యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే ।
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ ।। 3 ।।
సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ।
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ।। 4 ।।
యే — ఎవరైతే; తు — కానీ; అక్షరం — అనశ్వరమైన/నిత్యమైన; అనిర్దేశ్యం — నిర్వచించుటకు వీలుకాని; అవ్యక్తం — అవ్యక్తమైన; పర్యుపాసతే — ఆరాధిస్తారో; సర్వత్ర-గం — సర్వ వ్యాప్తి అయిన; అచింత్యం — మనోబుద్ధులకు అతీతుడు (ఊహింపశక్యము కాని); చ — మరియు; కూట-స్థమ్ — మారని; అచలం — కదిలించలేని; ధృవం — సనాతనమైన ; సన్నియమ్య — నిగ్రహించి; ఇంద్రియ-గ్రామం — ఇంద్రియములు; సర్వత్ర — అంతటా; సమ-బుద్ధయః — సమ బుద్ధితో ఉండి; తే — వారు; ప్రాప్నువంతి — పొందుతారు; మాం — నన్ను; ఏవ — కూడా; సర్వ-భూత-హితే — సమస్త ప్రాణుల సంక్షేమం కోసం; రతాః — నిమగ్నుడై.
Translation
BG 12.3-4: నాశరహితుడూ, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తమూ, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్యశాశ్వతుడూ, మరియు నిశ్చలమైన వాడునూ - అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్త్వాన్ని - ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధితో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ - ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు.
Commentary
సాకార రూపమును ఆరాధించుటయే ఉత్తమమని చెప్పిన పిదప, శ్రీకృష్ణుడు, నిరాకార తత్త్వాన్ని ఆరాధించటాన్ని తానెక్కడా తిరస్కరించటం లేదని వివరణ ఇస్తున్నాడు. సర్వవ్యాప్త, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, మనోబుద్ధులకు అతీతమైన, నాశరహిత, నిశ్చల, నిత్యసనాతన బ్రహ్మన్ పట్ల భక్తితో నిమగ్నమయ్యే వారు కూడా ఈశ్వరుడిని పొందుతారు.
మనుష్యులు (జీవ రాశులు) అనంతమైన విభిన్న స్వభావాలతో ఉంటారు. ఈ భిన్నత్వమును సృష్టించిన పరమేశ్వరుడు కూడా ఎన్నో విభిన్న విలక్షణమైన స్వభావాలు కలిగిఉంటాడు. మనకు పరిమితమైన అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంది కాబట్టి, భగవంతుని యొక్క అనంతమైన అస్తిత్వాలని/అవతారాలని/స్వరూపాలనీ కొన్ని విభాగాలలోకి వర్గీకరించుకుంటాము. ఆ ప్రకారంగానే, ఇంతకు క్రితం శ్లోక వ్యాఖ్యానంలో పేర్కొన్నట్టుగా, వేద వ్యాసుడు భగవంతుని యొక్క వేర్వేరు ప్రకటితములను మూడు రకాలుగా వర్గీకరణం చేసారు - బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు. మనం వీటిలో ఏ రకమైన ఈశ్వర తత్త్వమునైనా ఆరాధించవచ్చు, కానీ, మనకు నచ్చిన/అర్థమయిన ఈశ్వర స్వరూపమే సరియైనది, ఇతరులు అనుసరించే విధానం తప్పు అని ఎట్టిపరిస్థితులలో కూడా భావించరాదు.
4.11వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: ‘నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా, తెలియకపోయినా, అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు, ఓ అర్జునా (ప్రిథ తనయుడా).’ ఇక్కడ, శ్రీ కృష్ణుడు, నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించేవారు కూడా ఆయననే చేరుతారు అని వక్కాణిస్తున్నాడు. నిర్గుణ నిరాకార అస్తిత్వంతో ఏకమై పోవటమే వారి యొక్క అభిలాష కాబట్టి ఈశ్వరుడు వారిని అవ్యక్త, సర్వ-వ్యాప్త బ్రహ్మన్ గానే కలుస్తాడు.