Bhagavad Gita: Chapter 12, Verse 5

క్లేశోఽధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ ।।
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ।। 5 ।।

క్లేశః — కష్టములు/ఇబ్బందులు; అధిక-తర — ఎక్కువగా; తేషాం — వారికి; అవ్యక్త — అవ్యక్త రూపము పట్ల; ఆసక్త — ఆసక్తులై ఉన్న; చేతాసాం — మనస్సు కలవారు; అవ్యక్తా — అవ్యక్తము; హి — నిజముగా; గతిః — మార్గము; దుఃఖం — చాలా కష్టతరముగా; దేహవద్భిః — శరీర బద్దులైన వారికి (జీవాత్మ); అవాప్యతే — పొందెదరు.

Translation

BG 12.5: మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది.

Commentary

తన యొక్క భిన్నమైన స్వరూపములను ఆరాధించే వారందరినీ ఆదరించిన శ్రీ కృష్ణుడు, తన సాకార రూపమును పూజించటమే శ్రేష్ఠమని మరల ఒకసారి చెప్తున్నాడు. నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించటం చాలా కష్టసాధ్యమైన మార్గమని అది ఎన్నో క్లేశములతో కూడినదని అంటున్నాడు.

నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించటం ఎందుకు అంత కష్టమైనది? దీనికి ప్రప్రథమమైన మరియు ప్రధానమైన కారణం ఏమిటంటే, మనకు (మనుష్యులకు) కూడా ఒక ఆకారం ఉంది మరియు అనంతమైన జన్మలలో, రూపమున్న వాటితో అనుబంధం ఏర్పరుచుకోవటం మనకు అలవాటైంది. అందుకే, భగవంతుని పై ప్రేమను పెంపొందించుకునే ప్రయాసలో కూడా, మనకొక మనోహరమైన ఆకర్షణీయమైన రూపము అందుబాటులో ఉంటే, మనస్సు సునాయాసముగా దానిపై లగ్నం చేసి భగవంతుని పై మమకారానుబంధం పెంచుకుంటుంది. కానీ, నిరాకార తత్త్వ ఉపాసనలో, మన బుద్ధి దానిని అందుకోలేదు, మరియు మనస్సుకి, ఇంద్రియములకి అనుబంధం పెంచుకోవటానికి ఒక స్పర్శనీయమైన (tangible) వస్తువు అంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఈశ్వరునిపై ధ్యానం చేయటానికి, మరియు ఆయనపై మనస్సుతో అనుబంధం పెంచుకోవటానికీ, ఈ రెండు ప్రయత్నాలూ కఠినంగా అనిపిస్తాయి.

నిరాకార బ్రహ్మన్ ను ఆరాధించటం అనేది సాకార భగవంతుడిని ఆరాధించటం కంటే కష్టము గా ఉండటానికి ఇంకొక కారణము ఉంది. ఈ రెండు రకాల మార్గాలని, మర్కట-కిషోర న్యాయము (కోతి పిల్ల తర్కము) మరియు మార్జార-కిషోర న్యాయము (పిల్లి పిల్ల తర్కము) ఉదాహరణతో అర్థంచేసుకోవచ్చు. కోతిపిల్ల తనే తన తల్లి పొట్టని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది; ఈ విషయంలో తల్లి కోతి నుండి ఎలాంటి సహాయము లభించదు. తల్లి-కోతి ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మ మీదికి దూకినప్పుడు, తల్లి-కోతిని గట్టిగా పట్టుకునే ఉండే బాధ్యత పిల్ల-కోతిదే, ఒకవేళ అది అలా చేయలేకపోతే, అది పడిపోతుంది. అదే సమయంలో, పిల్లిపిల్ల చాలా చిన్నగా, సున్నితముగా ఉంటుంది; కానీ తల్లి-పిల్లి ఆ పిల్లను ఒకచోటి నుండి ఇంకొక చోటికి మార్చే బాధ్యత తనే తీసుకుంటుంది; అది జాగ్రత్తగా పిల్లిపిల్లను మెడ వెనుక నోటితో పట్టి లేపి తీస్కువెళుతుంది.

ఈ పోలికలో, నిరాకార బ్రహ్మన్ యొక్క భక్తులను కోతిపిల్ల తో పోల్చవచ్చు మరియు సాకార రూపము యొక్క భక్తులను పిల్లి పిల్లతో పోల్చవచ్చు. నిరాకార బ్రహ్మన్ ను ఉపాసించేవారు, ఆ మార్గంలో పురోగతి సాధించే భారాన్ని తామే మోయవలసి ఉంటుంది, ఎందుకంటే బ్రహ్మన్ వారిమీద కృప చూపించలేదు; ఏలనన, బ్రహ్మన్ నిరాకారమే కాదు, అది గుణరహితము కూడా. అది నిర్గుణ (గుణములు లేని), నిర్విశేష (లక్షణములు లేని), మరియు నిరాకార (ఆకారము లేని) అని వివరించబడినది. దీనిచే, మనకు తెలిసేదేమిటంటే, బ్రహ్మన్, కృప అనే లక్షణమును చూపలేదు అని. ఈశ్వరుడిని నిర్గుణ, నిర్విశేష, నిరాకార ముగా ఆరాధించే వారు, పురోగతి కోసం పూర్తిగా తమ సొంత పరిశ్రమ మీదనే ఆధారపడాలి. మరో పక్క, భగవంతుని సాకార రూపము, కరుణ మరియు కృపా సముద్రము. కాబట్టి, సాకార రూప భక్తులు తమ సాధన లో దైవీ సహకారం పొందుతారు. భగవంతుడు భక్తులపై ప్రసాదించే రక్షణ ఆధారముగానే శ్రీ కృష్ణుడు, 9.31వ శ్లోకంలో: ‘ఓ కుంతీ పుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నశింపడు అని ధైర్యముగా ప్రకటించుము.’ అని పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని తదుపరి రెండు శ్లోకాలలో మళ్ళీ చెప్తున్నాడు.