తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ।। 8 ।।
తమః — తమో గుణము; తు — కానీ; అజ్ఞాన-జం — అజ్ఞానము వలన జనించిన; విద్ధి — తెలుసుకొనుము; మోహనం — భ్రమ; సర్వ-దేహినామ్ — సమస్త బద్ధ జీవాత్మలకు; ప్రమాద — నిర్లక్ష్యము; ఆలస్య — సోమరితనము; నిద్రాభిః — మరియు నిద్ర; తత్ — అది; నిబధ్నాతి — బంధించి వేయును; భారత — అర్జునా, భరత వంశీయుడా.
Translation
BG 14.8: ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది.
Commentary
తమో గుణము సత్త్వ గుణమునకు విరుద్ధమైనది. దానిచే ప్రభావితమైన జనులు నిద్ర, సోమరితనము, మత్తు, హింస, మరియు జూదముచే ఆనందమును అనుభవిస్తారు. ఏది మంచి లేదా ఏది చెడు అన్న విచక్షణను వారు కోల్పోతారు; మరియు తమ స్వార్థ ప్రయోజనం కోసం అనైతికమైన పనులు చేయటానికి వెనుకాడరు. వారి కర్తవ్యమును వారు చేయటమే వారికి భారంగా అవుతుంది మరియు వారు దానిని నిర్లక్ష్యం చేస్తారు, మరియు మరింత సోమరితనానికి, నిద్రకు అలవాటైపోతారు. ఈ ప్రకారంగా, తమో గుణము జీవాత్మను అజ్ఞానపు చీకటి లోనికి మరింత నెట్టివేస్తుంది. జీవాత్మ, తన యొక్క దివ్య అస్తిత్వమును, జీవిత లక్ష్యమును మరియు పురోగతికై మానవ జన్మ ఇచ్చే అపూర్వ అవకాశమును పూర్తిగా విస్మరిస్తుంది.