సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ।। 11 ।।
లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా ।
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ।। 12 ।।
అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ।। 13 ।।
సర్వ — అన్ని; ద్వారేషు — ద్వారముల గుండా; దేహే — శరీరము; అస్మిన్ — దీనిలో; ప్రకాశః — ప్రకాశము; ఉపజాయతే — వ్యక్తమై; జ్ఞానం — జ్ఞానము; యదా — ఎప్పుడైతే; తదా — అప్పుడు; విద్యాత్ — తెలుసుకొనుము; వివృద్ధం — ప్రబలమగును; సత్త్వం — సత్త్వ గుణము; ఇతి — ఈ విధముగా; ఉత — ఖచ్చితముగా; లోభః — లోభము (దురాశ); ప్రవృత్తిః — ప్రవృత్తి; ఆరంభః — పరిశ్రమ; కర్మణామ్ — కామ్య కర్మల కోసం; అశమః — వ్యాకులత; స్పృహా — యావ; రజసి — రజో గుణము యొక్క; ఏతాని — ఇవి; జాయంతే — పెరుగును; వివృద్ధే — ప్రబలమైనప్పుడు; భరత-ఋషభ — భరతులలో శ్రేష్ఠుడా, అర్జునా; అప్రకాశః — అజ్ఞానం; అప్రవృత్తిః — జడత్వం; చ — మరియు; ప్రమాదః — నిర్లక్ష్యము; మోహః — మోహము; ఏవ — నిజముగా; చ — మరియు; తమసి — తమోగుణము; ఏతాని — ఇవి; జాయంతే — కనిపించును; వివృద్ధే — ప్రబలమైనప్పుడు; కురు-నందన — కురునందనా, అర్జునా.
Translation
BG 14.11-13: దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభము (దురాశ), ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.
Commentary
శ్రీ కృష్ణుడు మళ్ళీ ఒకసారి, త్రిగుణములు వ్యక్తి యొక్క ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తున్నాడు. సత్త్వ గుణము సద్గుణములను పెంపొందించుకునేటందుకు, మరియు జ్ఞానము ప్రకాశితము అవ్వటానికి దారితీస్తుంది. రజో గుణము దురాశకి, ప్రాపంచిక సంపత్తి కోసం అతిప్రయాస మరియు మనస్సు యొక్క వ్యాకులతకు దారి తీస్తుంది. తమో గుణము చిత్తభ్రాంతికి, సోమరితనానికి, మరియు మత్తుపదార్ధాలకు మరియు హింసా ప్రవృత్తి దిశగా తీసుకువెళుతుంది.
నిజానికి, ఈ గుణములు, భగవంతుడు మరియు ఆధ్యాత్మిక మార్గముల పట్ల మన దృక్పథాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణతో చెప్పటానికి, మనస్సులో సత్త్వ గుణము ప్రధానముగా ఉన్నప్పుడు, మనము ఇలా అనుకోవచ్చు, ‘నాకు గురువు గారి నుండి ఎంతో కృప లభించింది. నా సాధనలో త్వరితగతిన పురోగతి సాధించటానికి కృషి చేయాలి, ఎందుకంటే మానవ దేహము అనేది దుర్లభము మరియు దానిని లౌకికమైన వాటి సముపార్జన కోసం వ్యర్థం చేసుకోవద్దు.’ రజో గుణము ప్రధానముగా ఉన్నప్పుడు, మనము ఇలా అనుకోవచ్చు, ‘నేను తప్పకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి, కానీ అంత తొందర ఏమున్నది? ప్రస్తుతం, నాకు చాలా బాధ్యతలు ఉన్నవి, అవి దీనికన్నా ఇంకా ముఖ్యమైనవి.’ ఎప్పుడైతే తమో గుణము ప్రబలంగా ఉంటుందో, మనం ఇలా అనుకోవచ్చు, ‘ఏమో, భగవంతుడు ఉన్నాడో లేడో నమ్మకం లేదు, ఎవరూ ఆయనను చూడలేదు. ఎందుకు సాధనా కోసం సమయం వృధా చేయాలి?’ అని. భక్తిలో ఒకే వ్యక్తి యొక్క ఆలోచనలు ఎంత ఉన్నత స్థాయి నుండి, ఎంత తక్కువ స్థాయికి ఊగిసలాడతాయో మనం గమనించవచ్చు.
ఈ త్రిగుణములచే మనస్సు ఊగిసలాడటం, చాలా సహజమే. కానీ, ఈ స్థితిగతులచే మనం నిరాశ చెందవద్దు, పైగా, ఇలా ఇది ఎందుకు అవుతుందో అర్థం చేసుకోవాలి, మరియు దానికి అతీతంగా ఎదగటానికి పరిశ్రమించాలి. సాధన అంటే, మనసులో ఈ త్రిగుణముల యొక్క ప్రవాహంతో పోరాడుతూ, దానిని గురువు మరియు భగవంతుడు పట్ల భక్తితో ఉండటానికి అభ్యాసము చేయటమే. ఒకవేళ మన యొక్క స్మృతి అత్యంత ఉన్నతమైన స్థాయిలో రోజంతా ఉండి ఉంటే, అప్పుడు సాధన యొక్క అవసరం లేదు. మనస్సు యొక్క సహజమైన భావనలు ప్రపంచం వైపు మొగ్గు చూపినా, బుద్ధి యొక్క సహాయంతో, దానిని ఆధ్యాత్మిక రంగం వైపు మరల్చాలి. ప్రారంభంలో ఇది కష్టతరముగా అనిపించవచ్చు, కానీ అభ్యాసముచే అది చాలా సులువుగా అయిపోతుంది. కారు నడపటం మొదట్లో చాలా కష్టమైనదిగా అనిపించినా, అభ్యాసముచే అది అలవాటై సహజముగా అయిపోతుంది.
శ్రీ కృష్ణుడు ఇక ఈ త్రిగుణములచే ప్రసాదింపబడే గమ్యములను చెప్పటం ప్రారంభిస్తున్నాడు, మరియు వాటికి అతీతముగా అవ్వాల్సిన మన లక్ష్యము యొక్క అవసరం చెప్తున్నాడు.