అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ ।
అపరస్పరసంభూతం కిమన్యత్ కామహైతుకమ్ ।। 8 ।।
అసత్యం — పరమ సత్యము లేకుండా; అప్రతిష్ఠం — ఎటువంటి ఆధారము లేకుండా; తే — వారు; జగత్ — ఈ ప్రపంచము; ఆహుః — అంటారు; అనీశ్వరమ్ — ఈశ్వరుడు లేడని; అపరస్పర — కారణం లేకుండా; సంభూతం — ఉద్భవించినది; కిం — ఏమిటి? అన్యత్ — వేరే ఇతర; కామ-హైతుకమ్ — లైంగిక తృప్తి కోసమే.
Translation
BG 16.8: వారు ఇలా అంటారు, ‘ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన (నైతిక నియమ) ఆధారము లేదు, మరియు భగవంతుడు (దీనిని సృష్టించింది లేదా నిర్వహించేది) అనేవాడు ఎవరూ లేడు. ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు.’ అని.
Commentary
అనైతిక ప్రవర్తన నుండి దూరంగా ఉండటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటిది సంకల్ప బలం ద్వారా అధార్మికత నుండి దూరంగా ఉండటం. రెండవది భగవంతుని భయం వల్ల పాపిష్టి పనులకు దూరంగా ఉండటం. కేవలం సంకల్ప బలం వల్ల మాత్రమే పాపపు పనులకు దూరంగా ఉండేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం మంది దండన/శిక్ష భయం వలననే తప్పుడు పనులు చేయటానికి వెనకాడుతారు. ఉదాహరణకు, జాతీయ రహదారిపై పోలీసు వాహనం కనబడగానే అందరూ వేగ పరిమితికి లోబడి తమ వేగాన్ని తగ్గించుకుంటారు, కానీ వారికి పట్టుబడతామనే ప్రమాదం ఏమీ కనపడనప్పుడు, వేగ పరిమితి మించి వెళ్ళటానికి వెనుకాడరు. ఈ విధంగా, భగవంతుడిని గట్టిగా నమ్మితే, ఆయన భయం చేత అనైతిక ప్రవర్తనకు దూరంగా ఉంటాము. మరో పక్క, భగవంతుని పైన విశ్వాసం లేకపోయినా, ఆయన చట్టాలు మాత్రం అన్నీ మనకు వర్తిస్తాయి, మరియు మన చెడు ప్రవర్తన యొక్క పరిణామాలను మనం అనుభవించాల్సిందే.
ఆసురీ స్వభావములు కలవారు, భగవంతుని మీద విశ్వాసంతో వచ్చే, ఈ యొక్క, భగవత్ అజమాయిషీని మరియు నియమబద్ధ ప్రవర్తనను అంగీకరించటానికి ఒప్పుకోరు. బదులుగా, అసలు భగవంతుడు అనేవాడు లేడు, మరియు నైతిక ప్రవర్తనకు ఈ ప్రపంచంలో ఆధారం లేదు అన్న దృక్పథాన్నే అవలంభిస్తారు. వారు ‘బిగ్ బ్యాంగ్ థియరీ’ (Big Bang Theory) వంటి వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు; అవి ఈ జగత్తు అంతా ఒక అసంకల్పిత విస్ఫోటం ద్వారా కాలము ప్రారంభమైనప్పుడు సృష్టిచబడింది అని; అందుకే దీనినంతా నిర్వహించే భగవంతుడు అనేవాడు లేనేలేడు అని చెప్తుంటాయి. సంశయము లేకుండా లేదా పరిణామాల మీద భయం లేకుండా, వారికి ఇంద్రియములను తృప్తి పరచటంలో నిమగ్నమవ్వటానికి ఇటువంటి సిద్ధాంతాలు అనుకూలంగా ఉంటాయి.
వివిధములైన ఇంద్రియ తృప్తులలో, లైంగిక భోగము తీవ్రమయినది. ఇది ఎందుకంటే, ఈ భౌతిక జగత్తు అనేది ఆద్ధ్యాత్మిక జగత్తు యొక్క ఒక వక్రీకరించబడిన పరావర్తనం వంటిది. ఆధ్యాత్మిక జగత్తులో, ముక్తి నొందిన జీవుల యొక్క కార్యకలాపాలకు మరియు వారు భగవంతునితో చేసే వ్యవహారాలకు, దివ్య ప్రేమ అనేదే మూలాధారము. భౌతిక జగత్తులో, దానియొక్క వక్ర ప్రతిబింబమైన కామమే, భౌతికంగా బద్దులైన జీవుల మనస్సులో ప్రధానంగా ఉంటుంది, మరీ ముఖ్యంగా రజో గుణ ప్రభావంలో ఉన్నవారికి. అందుకే, ఆసురీ మనస్సు కలవారు లైంగిక కార్యకలాపములే మానవ జీవన ప్రయోజనము అని అనుకుంటారు.