నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ।। 25 ।।
న-అహం-ప్రకాశః — నేను కనిపించను; సర్వస్య — అందరికీ; యోగ-మాయా — భగవంతుని మహోన్నత (దివ్య) శక్తి; సమావృతః — కప్పివేయబడి; మూఢః — మూర్ఖులు; అయం — ఈ యొక్క; న — కాదు; అభిజానాతి — తెలుసుకోవటం; లోకః — జనులు; మాం — నన్ను; అజమ్ — పుట్టుకలేని వాడను; అవ్యయం — మార్పుచెందని.
Translation
BG 7.25: నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పుచెందని వాడినని తెలుసుకోలేరు.
Commentary
7.4వ మరియు 7.5వ శ్లోకాలలో తన శక్తులలో రెంటిని వివరించిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు తన మూడవ శక్తి అయిన యోగ-మాయా శక్తిని ఉదహరిస్తున్నాడు. ఇది ఆయన అత్యున్నత శక్తి. విష్ణు పురాణం ఇలా పేర్కొంటున్నది:
విష్ణు శక్తిః పరా ప్రోక్తా క్షేత్రజ్ఞాఖ్యా తథాఽపరా
అవిద్యా కర్మసంజ్ఞాన్యా తృతీయా శక్తిరిష్యతే. (6.7.61)
‘పరమేశ్వరుడైన శ్రీ విష్ణు మూర్తికి మూడు ముఖ్యమైన శక్తులు ఉన్నాయి - యోగమాయ, ఆత్మలు మరియు మాయ.’ జగద్గురు కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:
శక్తిమాన్ కీ శక్తియాఁ, అగనిత యదపి బఖాన
తిన్ మహన్ ‘మాయా’, ‘జీవ’, అరు ‘పరా’, త్రిశక్తి ప్రధాన
(భక్తి శతకము, 3వ శ్లోకము)
‘సర్వోత్కృష్ట శక్తిమంతుడైన శ్రీ కృష్ణుడికి అనంతమైన శక్తులు ఉన్నాయి. వీటిలో, యోగమాయ, ఆత్మలు, మరియు మాయ అనేవి ప్రధానమైనవి.’
ఆ, యోగమాయా దివ్య శక్తి, భగవంతుని యొక్క సర్వ-శక్తిమంతమైన సామర్థ్యము. దీని ద్వారానే, తన యొక్క దివ్య లీలలను, దివ్య ప్రేమానందమును, మరియు దివ్య ధామమును వ్యక్త పరుస్తాడు. ఆ యొక్క యోగమాయ శక్తి ద్వారానే భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు, మరియు తన దివ్య లీలలను ఈ భూలోకం లో కూడా ప్రకటిస్తాడు. ఇదే యోగమాయా శక్తి చే తనను తాను మన నుండి గోప్యం గా ఉంచుకుంటాడు. భగవంతుడు మన హృదయంలోనే కూర్చుని ఉన్నా, ఆయన మనలోనే ఉన్న అనుభూతి మనకు తెలియదు. మనకు ఆయన దివ్య దర్శనం చూడగలిగే అర్హత లభించేవరకు, ఆయన దివ్యత్వాన్ని యోగమాయ మననుండి కప్పివేసి ఉంచుతుంది. కాబట్టి, మనం ఈశ్వరుడిని ప్రస్తుతం ఆయన సాకార రూపంలో చూసినా, ఆయనే భగవంతుడని గుర్తు పట్టలేము. ఎప్పుడైతే యోగమాయా శక్తి తన కృప మనపై చూపిస్తుందో, అప్పుడే మనకు భగవంతుడిని చూసి, గుర్తుపట్టగలిగే దివ్య దృష్టి లభిస్తుంది.
చిదానందమయ దేహ తుమ్హారీ, బిగత బికార జాన అధికారీ
(రామచరితమానస్)
‘ఈశ్వరా, నీకు దివ్య మంగళ స్వరూపము ఉంది. ఎవరి హృదయములు పవిత్రమైనవో వారు మాత్రమే నిన్ను నీ కృప ద్వారా తెలుసుకోగలరు.’
ఈ యోగమాయా శక్తి, నిరాకారమైనది మరియు ఒక రూపంలో కూడా వ్యక్తమవుతుంది, రాధ, సీత, దుర్గ, కాళి, లక్ష్మీ, పార్వతి మొదలైన రూపాలలో. ఇవన్నీ యోగమాయ శక్తి యొక్క దివ్య మంగళ స్వరూపాలే, ఇవన్ని కూడా వైదిక సాంప్రదాయంలో, విశ్వానికే మాతృ మూర్తిగా పూజించబడ్డాయి. వీరు మాతృగుణాలైన, సున్నితత్వము, వాత్సల్యము, క్షమ, కృప, మరియు అకారణ ప్రేమలను ప్రసరిస్తారు. మనకు ఇంకా ముఖ్యముగా, జీవాత్మలకు దివ్య కృప ప్రసాదించి, ఆధ్యాత్మిక అలౌకిక జ్ఞానాన్ని అందించటం ద్వారా వాటికి భగవంతుడిని తెలుసుకోగలిగే శక్తిని వీరు ప్రసాదిస్తారు. కాబట్టి, బృందావన భక్తులు, ‘రాధే రాధే, శ్యామ్ సే మిలా దే’, ‘ఓ రాధా, దయచేసి నీ కృపని అనుగ్రహించి, శ్రీ కృష్ణుడిని కలుసుకోవటానికి సహాయం చేయుము.’ అని పాడుతుంటారు.
ఈ విధంగా యోగమాయ రెండు పనులూ చేస్తుంది — ఇంకా అర్హత సాధించని జీవాత్మల నుండి భగవంతుడిని దాచిపెడుతుంది మరియు శరణాగతి చేసిన జీవాత్మలకు తన కృప ప్రసాదించి, దానితో వారు భగవంతుడిని తెలుసుకునేటట్టు చేస్తుంది. ఈశ్వరుడి విముఖంగా ఉన్నవారు మాయచే కప్పివేయబడుతారు, వారు యోగమాయ కృపకు దూరమైపోతారు. ఈశ్వరుడికి సన్ముఖంగా ఉన్నవారు, మాయ నుండి విముక్తిపొంది, యోగమాయ సంరక్షణలోకి వస్తారు.