జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః ।
యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే ।। 2 ।।
జ్ఞానం — జ్ఞానము; తే — నీకు; అహం — నేను; స — తో; విజ్ఞానం — విజ్ఞానము; ఇదం — ఇది; వక్ష్యామి — తెలియ చెప్పెదను; అశేషతః — సంపూర్ణముగా; యత్ — ఏదైతే; జ్ఞాత్వా — తెలుసుకున్న పిదప; న — ఉండదు; ఇహ — ఈ లోకంలో; భూయః — మరింక; అన్యత్ — వేరే ఏది; జ్ఞాతవ్యం — తెలుసుకోవలసినది; అవశిష్యతే — మిగులును.
Translation
BG 7.2: ఏ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను.
Commentary
ఇంద్రియమనోబుద్ధులచేత తెలుసుకున్న దానిని జ్ఞానము అంటారు. ఆధ్యాత్మిక సాధన వలన అంతర్గతంగా, లో-నుండి తెలియవచ్చిన దానిని విజ్ఞానము అంటారు. విజ్ఞానము అనేది బుద్ధిచే నేర్చుకున్నది కాదు; నేరుగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. ఉదాహరణకి, మనం ఒక సీసాలో ఉన్న తేనే యొక్క తియ్యదనం గురించి గొప్పగా వింటూ ఉండవచ్చు, కానీ అది పుస్తక/సిద్ధాంతపరమైన జ్ఞానం గానే మిగిలిపోతుంది. కానీ, ఈ బాటిల్ మూత తీసి దాంట్లో ఉన్న తేనె రుచి చూస్తే, దాని యొక్క తియ్యదనం యొక్క అనుభవపూర్వక జ్ఞానం వస్తుంది. అదే విధంగా, గురువు మరియు శాస్త్రముల నుండి మనకు తెలిసేది జ్ఞానము, మరియు ఆ జ్ఞానం అనుసరించి మనం సాధనా అభ్యాసం చేసి, అంతఃకరణ శుద్ది చేసుకున్నప్పుడు, మనలోనుండే ఉదయించిన వివేకమునే, విజ్ఞానము అంటారు.
వేద వ్యాస మహర్షి - భక్తి యొక్క స్వభావము, మహిమలు, మరియు భక్తి విశేషము విశదీకరిస్తూ - శ్రీమద్ భాగవతం వ్రాయాలని సంకల్పించినప్పుడు, ఆయన జ్ఞానంపై ఆధారమై వ్రాయటంలో సంతృప్తి చెందలేదు; అందుకే మొదట భగవంతుని పట్ల అనుభవపూర్వక విజ్ఞానం కోసం భక్తిలో నిమగ్నమైనాడు:
భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణిహితే ఽమలే
అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తద్-అపాశ్రయాం (భాగవతం 1.7.4)
‘భక్తి యోగము ద్వారా, ప్రాపంచిక తలంపులు ఏమీ లేకుండా, వేద వ్యాసుడు తన మనస్సుని భగవంతుని పైనే నిమగ్నం చేసాడు; దీనితో, భగవంతుని అధీనంలో ఉండే ఆయనకే చెందిన బాహ్య శక్తి మాయ సమేతంగా, వేద వ్యాసునికి, సర్వోత్కృష్టుఁడైన దివ్య భగవంతుని దర్శనం కలిగింది.’ ఈ అంతర్గత విజ్ఞానం కలిగిఉండి, అటు పిమ్మట ఆయన ఈ ప్రసిద్ధ పురాణాన్ని వ్రాసాడు.
సర్వోత్క్రుష్ట పరమాత్మ యొక్క సిద్ధాంత జ్ఞానం చే అర్జునుడిని ప్రకాశితం చేస్తానని మరియు అతనికి దాని అంతర్గత విజ్ఞాన వికాసానికి తోడ్పడతానని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఈ విజ్ఞానం తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవటానికి ఇంకేమీ మిగలదు.