తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ।
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభంతే ।। 21 ।।
తే — వారు; తం — అది; భుక్త్వా — భోగించిన తరువాత; స్వర్గ-లోకం — స్వర్గ లోకము; విశాలం — విశాలమైన; క్షీణే — తరిగిపోయిన తరువాత; పుణ్యే — పుణ్యము; మర్త్య-లోకం — భూలోకము; విశంతి — తిరిగొస్తారు; ఏవం — ఈ విధంగా; త్రయీ-ధర్మం — మూడు వేదముల యొక్క కర్మ కాండ భాగము; అనుప్రపన్నాః — అనుసరించిన; గత-ఆగతం — పదేపదే వచ్చి పోతుండటము; కామ-కామాః — భోగ వస్తువుల పట్ల కోరిక; లభంతే — పొందురు.
Translation
BG 9.21: స్వర్గ లోకము యొక్క విశాలమైన భోగములు అనుభవించుటచే వారి పుణ్య ఫలము అంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు. ఈ విధంగా భోగ వస్తు ప్రాప్తికై వైదిక కర్మ కాండలను ఆచరించే వారు భూలోకానికి పదేపదే వచ్చి పోతుంటారు.
Commentary
స్వర్గలోకముల యందుండెడి సుఖభోగములు తాత్కాలికమైనవి, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అక్కడికి పంపించబడిన జీవులకు, స్వర్గ లోక భోగములు అనుభవించిన తరువాత వారి పుణ్యం అంతా ఖర్చయిపోతుంది, అప్పుడు వారు, తిరిగి భూలోకానికి పంపించబడుతారు. ఈ విధంగా స్వర్గాది లోకములు పొందినా కూడా, దాని వల్ల ఆత్మ యొక్క సనాతన అన్వేషణ నెరవేరదు. మనందరమూ అనంతమైన పూర్వ జన్మలలో ఎన్నో సార్లు అక్కడికి వెళ్లి వచ్చాము, కానీ అనంతమైన ఆనందం కోసము ఆత్మకున్న కోరిక తీరలేదు. అన్ని వైదిక శాస్త్రాలు ఈ విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి:
తావత్ ప్రమోదతే స్వర్గే యావత్ పుణ్యం సమాప్యతే
క్షీణ పుణ్యః పతత్యర్వాగనిచ్ఛన్ కాల-చాలితః
(భాగవతం 11.10.26)
‘స్వర్గ లోకాల్లో నివసించేవారు తమ పుణ్యఫలము అయిపోయేంత వరకు దేవతా భోగాలను అనుభవిస్తారు. ఆ తరువాత వారు కాలక్రమంలో తమకు ఇష్టం లేకపోయినా క్రింది లోకాలకు నెట్టివేయ బడుతారు.’
స్వర్గహు స్వల్ప అంత దుఖదాఈ (రామచరితమానస్)
‘స్వర్గ ప్రాప్తి అనేది తాత్కాలికమైనది మరియు తర్వాత దుఃఖాలను తెచ్చేది.’
ఎలాగైతే ఫుట్‌బాల్ బంతి, మైదానం అంతటా ఒక చోటి నుండి ఇంకో చోటికి తన్నబడుతుందో, మాయ అనేది, జీవాత్మను, భగవత్ విముఖం అవటం చేత అలాగే తంతున్నది. కొన్ని సార్లు నిమ్న లోకాలకు వెళుతోంది, కొన్నిసార్లు ఉన్నత లోకాలకు వెళుతుంది. ఈ క్రింది మరియు పై లోకాల్లో తనకు లభించిన ఈ బహు విధములైన రూపములలో కేవలం మానవ రూపం మాత్రమే భగవత్ప్రాప్తికి అవకాశం కల్పిస్తుంది. అందుకే దేవతలు కూడా, భగవత్ ప్రాప్తికై ప్రయత్నించటానికి మానవ-జన్మ కోసమే పరితపిస్తుంటారని శాస్త్రాలు చెప్తున్నాయి.
దుర్లభం మానుషం జన్మ ప్రార్థయతే త్రిదశైరపి
(నారద పురాణం)
‘మానవ శరీర జన్మ చాలా చాలా అరుదు (దుర్లభము). దేవతలు కూడా దీన్ని కాంక్షిస్తారు.’ అందుకే శ్రీ రామచంద్రుడు కూడా అయోధ్యావాసులకి ఇలా ఉపదేశం ఇచ్చాడు.
బడే భాగ మానుష తను పావా,
సుర దుర్లభ సబ గ్రంథంహి గావా
(రామచరితమానస్)
‘ఓ అయోధ్యావాసులారా, మీరందరూ మానవ జన్మ లభించినందుకు ఏంతో ఏంతో అదృష్ట వంతులు, ఇది చాలా చాలా దుర్లభమైనది మరియు స్వర్గలోకవాసులు కూడా కోరుకునేది.’ దేవతలే ఈ మానవ జన్మను ఇంతగా కోరుకుంటున్నప్పుడు మరి ఇక మనం మాత్రం ఆ స్వర్గలోకాలకి పోవాలని కోరుకోవటం ఏమి ప్రయోజనం? అందుకే, మనం పరమేశ్వరుడిపై భక్తి ద్వారా భగవత్ ప్రాప్తికై నిమగ్నమవ్వాలి.