మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి యుక్త్వైవమ్ ఆత్మానం మత్పరాయణః ।। 34 ।।
మత్-మనాః — సదా నన్నే స్మరించుము; భవ — ఉండుము; మత్ — నా యొక్క; భక్తః — భక్తుడు; మత్ యాజీ — నన్ను పూజించు వాడవు; మామ్ నమస్కురు — నాకు నమస్కరింపుము; మాం ఏవ — నన్నే ఖచ్చితముగా; ఏష్యసి — చేరుకుందువు; యుక్త్వా — నాతోనే ఏకమై; ఏవం — ఈ విధంగా; ఆత్మానం — నీ మనస్సు మరియు శరీరము; మత్-పరాయణః — నాకే అర్పితమై ఉండి.
Translation
BG 9.34: ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను ఆరాధించుము, మరియు నాకు ప్రణామములు అర్పించుము. నీ మనస్సు మరియు శరీరము నాకు సమర్పించుటచే నీవు నా వద్దకు నిస్సందేహముగా వచ్చెదవు.
Commentary
ఈ అధ్యాయంలో మొత్తం, భక్తి మార్గము యొక్క మహత్వం చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు అర్జునుడిని తన భక్తుడిగా అవ్వమని ప్రార్థించటం ద్వారా ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. తనను పూజించటం ద్వారా, తన దివ్య మంగళ స్వరూపముపై మనస్సుతో ధ్యానం చేయటం ద్వారా, స్వచ్ఛమైన వినయవిధేయతలతో తనకు నమస్కరించటం ద్వారా, తన మనస్సుతో నిజమైన యోగములో భగవంతునితో ఏకమై ఉండమని అర్జునుడికి చెప్తున్నాడు.
‘నమస్కురు’ (వినయంతో ప్రణమిల్లటం) అనేది, భక్తి ఆచరణలో అహంకార లక్షణములు ఏవైనా జనిస్తే, వాటిని నిర్మూలిస్తుంది. ఈ విధంగా, గర్వము లేకుండా, హృదయము భక్తిలో మగ్నమై, మన యొక్క సమస్త ఆలోచనలు, కార్యకలాపములు భగవంతునికే సమర్పించాలి. ఈ రకమైన భక్తి యోగ ఏకత్వము తప్పకుండా భగవత్ ప్రాప్తిని పొందిస్తుంది అని శ్రీ కృష్ణుడు అర్జునుడికి హామీ ఇస్తున్నాడు; దీని పై ఎలాంటి సందేహమూ ఉండకూడదు.