అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప ।
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని ।। 3 ।।
అశ్రద్దధానాః — విశ్వాసము లేని జనులు; పురుషా — (అటువంటి) మనుష్యులు; ధర్మస్య — ధర్మము యొక్క; అస్య — ఇది; పరంతప — అర్జునా, శత్రువులను జయించేవాడా; అప్రాప్య — పొందకుండా; మాం — నన్ను; నివర్తంతే — తిరిగి వచ్చెదరు; మృత్యు — మరణము; సంసార — భౌతిక అస్తిత్వము; వర్త్మని — మార్గములో.
Translation
BG 9.3: ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు, నన్ను పొందలేకున్నారు, ఓ శత్రువులను జయించేవాడా. వారు పదేపదే జనన-మరణ చక్రంలో ఈ లోకానికి తిరిగి వస్తుంటారు.
Commentary
ఇంతకు క్రితం రెండు శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు జ్ఞానోపదేశము అందిస్తానని హామీ ఇచ్చి, దాని యొక్క ఎనిమిది గుణములను వివరించాడు. ఇక్కడ ఇది ‘ఈ ధర్మము’ అని చెప్పబడినది, అంటే భగవంతుని యెడల ప్రేమపూర్వక భక్తి పథము.
జ్ఞానము ఎంత అద్భుతమైనదైనా, మార్గము ఎంత ప్రభావశీలమైనదైనా, దాని ప్రకారంగా నడుచుకోవటానికి నిరాకరించేవానికి అది నిరర్థకమైనది. ఇంతకుక్రితం శ్లోకంలో చెప్పినట్టు, భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభవం తరువాత వస్తుంది; ప్రారంభంలో, ఈ ప్రక్రియ మొదలు పెట్టటానికి విశ్వాసంతో కూడిన మొదటి అడుగు అవసరం. భక్తి రసామృత సింధు (1.4.15) ఇలా పేర్కొంది: ఆదౌ శ్రద్ధా తతః సాధుసంగో ఽథ భజనక్రియా, ‘భగవత్ ప్రాప్తి కోసం కావలసిన మొదటి అడుగు విశ్వాసము/శ్రద్ధ. అప్పుడు వ్యక్తి, స్సత్సంగములలో (ఆధ్యాత్మిక కార్యక్రమాలు) పాలుపంచుకోవటం మొదలు పెడతాడు. ఇది వ్యక్తిగత భక్తి అభ్యాసమునకు దారి తీస్తుంది.’
తరచుగా జనులు, తాము దేనినైతే ప్రత్యక్ష్యంగా గ్రహింపగలుగుతామో దాన్ని మాత్రమే నమ్ముతాము అని అంటూఉంటారు, అంచేత, భగవంతుని అనుభవం తక్షణమే అవ్వదు కాబట్టి, ఆయనను నమ్మరు. కానీ, నిజానికి ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా చూడక పోయినా, ఎన్నో విషయాలను నమ్ముతాము. ఒక న్యాయమూర్తి ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి తన తీర్పు ఇస్తాడు. న్యాయమూర్తి గనక తను ప్రత్యక్షంగా చూసినదే నమ్ముతాను అంటే, సమస్త న్యాయ వ్యవస్థ విఫలమై పోతుంది. ఒక దేశాధ్యక్షుడు తనకు దేశ నలుమూలల నుండీ అందే నివేదికల ఆధారంగా దేశాన్ని పరిపాలన చేస్తాడు. తన దేశంలో ఉన్న అన్ని గ్రామాలని, నగరాలని దర్శించటానికి వెళ్లి చూడటం ఆయనకు అసాధ్యమైన పని. ఇక, తను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ఆ నివేదికలను నమ్మను అంటే, తన దేశాన్ని ఎలా పరిపాలించగలడు? కాబట్టి, ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా, నమ్మకము/విశ్వాసము అనేది ప్రతి మెట్టులో చాలా ముఖ్యము. బైబిల్ దీనిని చాలా చక్కగా పేర్కొన్నది: ‘మేము నమ్మిక/విశ్వాసం ఆధారంగా నడుస్తాము, అంతేగానీ కంటికి కనిపించే దాని ఆధారంగా కాదు’, (We walk by faith, and not by sight. 2 Corinthians 5:7).
భగవత్ ప్రత్యక్షానుభవము గురించి ఒక అందమైన కథ ఉంది:
ఒకానప్పుడు ఒక రాజు, ఓ సాధువుతో ఇలా అన్నాడు, ‘నేను భగవంతుడిని నమ్మను ఎందుకంటే నేను ఆయనను చూడలేకున్నాను.’ అని. ఆ సాధువు, ఒక ఆవును రాజు గారి సభకు తెమ్మని అడిగాడు. రాజు గారు ఒప్పుకుని తన సేవకులని ఒక ఆవుని తెమ్మని ఆదేశించాడు. సాధువు ఆవు పాలను పితకమని అభ్యర్థించాడు. రాజు గారు మరల తన సేవకులని సాధువు చెప్పినట్టు చేయమన్నాడు.
సాధువు అడిగాడు, ‘ఓ రాజా! మీ ఉద్దేశంలో ఇప్పుడే తీసిన ఈ పాలలో వెన్న ఉందని అనుకుంటున్నారా’ అని అన్నాడు. వెన్న ఉందని తనకి పూర్తి నమ్మకం ఉంది అని రాజు గారు అన్నాడు.
ఆ సాధువు అన్నాడు, ‘పాలల్లో మీరు ఇప్పుడు వెన్న చూడటం లేదు కదా, వెన్న ఉందని ఎలా నమ్ముతున్నారు? అన్నాడు.
రాజు గారు అన్నాడు , ‘మనకు ఈ సమయంలో కనబటటం లేదు ఎందుకంటే పాలల్లో మొత్తం వెన్న వ్యాప్తమై ఉంది, కానీ దానిని చూడాలంటే ఒక పద్ధతి ఉంది. ఈ పాలను పెరుగుగా చేసి, ఆ పెరుగుని చిలికితే, వెన్న అప్పుడు కనబడుతుంది.’ అని అన్నాడు.
ఆ సాధువు అన్నాడు, ‘పాలల్లో వెన్న లాగ భగవంతుడు అంతటా ఉన్నాడు. ఈ సమయంలో భగవంతుడిని చూడలేకపోయినా, భగవంతుడు లేడు అనే నిశ్చయానికి మనం తొందరపడి రాకూడదు. ఆయనను చూడటానికి ఒక పక్రియ ఉంది; మనకు విశ్వాసము ఉండి, ప్రక్రియను చేపడితే, మనకు భగవంతుని ప్రత్యక్ష అనుభూతి లభిస్తుంది మరియు భగవత్ ప్రాప్తి పొందుతాము.’
భగవంతుని మీద నమ్మకం అనేది మానవులు అనాయాసంగా అనుసరించే సహజమైన ప్రక్రియ కాదు. మనకు ఇవ్వబడిన స్వతంత్ర-చిత్తమును ఉపయోగించుకొని, భగవంతునిపై నమ్మకం కలిగి ఉండాలనే దృఢమైన నిర్ణయానికి రావాలి. కౌరవుల సభలో, దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్ర చేయటానికి ప్రయత్నించినప్పుడు, శ్రీ కృష్ణుడు ఆమె చీరను పొడిగించి, ఆమెను అవమానము, సిగ్గు నుండి కాపాడాడు. అక్కడున్న కౌరవులందరూ ఆ అద్భుతాన్ని చూసారు, కానీ, శ్రీకృష్ణుని సర్వశక్తిత్వము పై నమ్మికను ఉంచటానికి తిరస్కరించారు, నిజాన్ని అర్థంచేసుకోలేకపోయారు. పరమేశ్వరుడైన భగవానుడు ఈ శ్లోకంలో ఏమి చెప్తున్నాడంటే, ఆధ్యాత్మిక పథం పై విశ్వాసం అవసరం లేదు అని నిర్ణయించుకున్న వారు, దివ్య జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉండిపోతారు మరియు జనన-మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు అని.