Bhagavad Gita: Chapter 10, Verse 28

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ।। 28 ।।

ఆయుధానాం — ఆయుధములలో; అహం — నేను; వజ్రం — వజ్రాయుధమును; ధేనూనామ్ — ఆవులలో; అస్మి — నేను; కామ-ధుక్ — కామధేనువు; ప్రజనః — సంతానోత్పత్తికి కారణములలో; చ — మరియు; అస్మి — నేను; కందర్పః — మన్మథుడను (కామ దేవుడు); సర్పానాం — సర్పములలో; అస్మి — నేను; వాసుకిః — వాసుకి.

Translation

BG 10.28: ఆయుధములలో వజ్రాయుధమును మరియు ఆవులలో కామధేనువును. సంతానోత్పత్తికి కారణములలో కామదేవుడను (మన్మథుడు) నేనే; సర్పములలో వాసుకిని నేను.

Commentary

పురాణములలో చెప్పబడిన మహాముని దధీచి చేసిన త్యాగము చరిత్రలో సాటిలేనిది.

ఒకసారి వృత్తాసురుడు అనే రాక్షసుని చేత దేవ రాజైన ఇంద్రుడు స్వర్గలోకము నుండి తరిమివేయబడ్డాడు. అప్పటివరకు ఉన్న ఏ ఆయుధము చేత కూడా సంహరింపబడని వరం ఆ రాక్షసుడికి ఉంది. ఎటూ పాలుపోక, ఇంద్రుడు శివుడిని సహాయం అర్థించాడు, శివుడు ఆయనను విష్ణుమూర్తి దగ్గరకు తీసుకెళ్ళాడు. దధీచి ముని బొమికలతో తయారుచేయబడే వజ్రాయుధము మాత్రమే వృత్తాసురున్ని చంపగలదు అని విష్ణుమూర్తి ఇంద్రునికి తెలియచెప్పాడు. ఇంద్రుడు అప్పుడు, వజ్రాయుధం తయారీకి ఆయన బొమికలను ఉపయోగించుకోవటం కోసం దధీచి మునిని తన ప్రాణ త్యాగము చేయవలసినదని ప్రార్థించాడు. దధీచి ఆ విన్నపాన్ని మన్నించాడు కానీ, మొదట అన్ని నదుల వద్దకు తీర్థయాత్ర వెళ్ళదలచాడు. దధీచి ముని తన కోరిక నెరవేర్చుకోటానికి, ఇంద్రుడు, సమస్త పుణ్య నదుల నీటిని నైమిశారణ్యమునకు వెంటనే తెచ్చాడు. అనంతరం దధీచి యోగ ప్రక్రియ ద్వారా తన శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయన బొమికల నుండి తయారు చేసిన వజ్రాయుధము ఉపయోగించి వృత్తాసురిడిని ఓడించాడు. దీనితో ఇంద్రుడు స్వర్గాధిపతి పదవిని తిరిగి పొందాడు. శ్రీ కృష్ణుడు కావాలనే ఇక్కడ, విష్ణు మూర్తి దగ్గర ఎల్లప్పుడూ ఉండే చక్రము, గద కంటే కూడా, ఆ వజ్రాయుధమునే భగవంతుని వైభవమునకు (విభూతికి) సూచికగా ఉదహరిస్తున్నాడు.

మైథున క్రియ అనేది, సత్-సంతానం కోసం మాత్రమే చేసినప్పుడు అది అపవిత్రమైనది కాదు అని కూడా ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. సంతానోత్పత్తి ద్వారా మానవ జాతిని కొనసాగించటానికి అవసరమైన స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ శక్తికి కామదేవుడు (మన్మథుడు) కారణము. ఈ లైంగిక వాంఛకు మూలము భగవంతుని యందే ఉంది, మరియు దీనిని ఇంద్రియ లౌల్యం కోసం దుర్వినియోగం చేయకూడదు, కేవలం మంచి సంతానం పొందటం కోసమే ఉపయోగించుకోవాలి. 7.11వ శ్లోకంలో కూడా, శాస్త్ర విరుద్ధం, ధర్మ విరుద్ధం కాని లైంగిక వాంఛ, తానే అని శ్రీ కృష్ణుడు ప్రకటించి ఉన్నాడు.