ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ।। 21 ।।
ఆదిత్యానాం — అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో; అహం — నేను; విష్ణుః — విష్ణు మూర్తి; జ్యోతిశాం — ప్రకాశవంతమైన వస్తువులలో; రవిః — సూర్యుడు; అంశు-మాన్ — తేజోవంతమైన; మరీచిః — మరీచి; మరుతాం — మరుత్తులలో; అస్మి — నేను; నక్షత్రాణాం — నక్షత్రములలో; అహం — నేను; శశీః — చంద్రుడను.
Translation
BG 10.21: అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో నేను విష్ణువుని; ప్రకాశవంతమైన వస్తువులలో నేను సూర్యుడిని. మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రి పూట ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను.
Commentary
పురాణాల ఆధారంగా మనం తెలుకునేదేమిటంటే కశ్యప మహామునికి ఇద్దరు భార్యలు — అదితి మరియు దితి. తన మొదటి భార్య అదితి ద్వారా ఆయనకు పన్నెండుగురు దేవతలు జన్మించారు, వీరే - ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వనుడు, పుష, సవిత, త్వష్ట, మరియు వామన అనే వారు. వీరిలో వామనుడు అనే ఆయన విష్ణు మూర్తి యొక్క అవతారము. ఈ విధంగా, ఆదిత్యులలో (అదితి యొక్క పన్నెండుగురు పుత్రులు) విష్ణువుగా (వామన స్వరూపంలో) తన వైభవాన్ని ప్రకటిస్తున్నానని కృష్ణుడు పేర్కొంటున్నాడు.
ప్రకాశవంతమైన వాటిలో సూర్యుడు సర్వోన్నతుడు. రామచరితమానస్ ఇలా పేర్కొన్నది:
రాకాపతి షోడస ఉఅహిం తారాగన సముదాఇ
సకల గిరిన్హ దవ లాఇఅ బిను రబి రాతి న జాఇ
‘రాత్రి పూట అన్ని దీపాలు, ఆకాశంలోని సమస్త నక్షత్రాలతో కూడి, చంద్రుడు కూడా ఉన్నా - అవన్నీ రాత్రి యొక్క చీకటిని తొలగించటానికి సరిపోవు. కానీ, సూర్యుడు ఉదయించిన మరుక్షణం రాత్రి చీకటి తొలగిపోతుంది.’ సూర్యుని శక్తి అలాంటిది, అది తన విభూతి అని శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు.
తదుపరి ఆయన రాత్రిపూట ఆకాశం గురించి చెప్తున్నాడు. ఒక ప్రఖ్యాత నానుడి ఉంది, ‘వెయ్యి నక్షత్రాల కన్నా ఒక్క చంద్రుడు మేలు’ అని. రాత్రి పూట ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, తారాగణములలో తానే చంద్రుడను అంటున్నాడు, అదే శ్రీ కృష్ణుడి విభూతిని చక్కగా ప్రకటిస్తుంది.
పురాణములలో ఇంకా మనం ఏమి తెలుసుకోవచ్చంటే, కశ్యపుడు తన రెండవ భార్య అయిన దితి ద్వారా దైత్యులకు (అసురులు) తండ్రి అయ్యాడు. కానీ, దైత్యుల తరువాత కూడా దితి తనకు, ఇంద్రుడి (దేవతల ప్రభువు) కన్నా శక్తిశాలి అయిన ఇంకొక పుత్రుడిని కోరింది. తన బిడ్డని గర్భంలోనే ఒక సంవత్సర కాలం ఉంచుకుంది. అది తెలుసుకున్న ఇంద్రుడు ఒక వజ్రాయుధంతో ఆ పిండమును ఎన్నో ముక్కలుగా చేసాడు, కానీ అది చాలా భ్రూణములగా మారింది. ఇవి మరుత్తులైనాయి, అంటే ఎంతో ప్రయోజనము చేసే ఈ విశ్వంలో ప్రసరించే నలభైతొమ్మిది రకాల వాయువులు. వీటిలో ప్రధానమైనవి అవహము, ప్రవహము, నివహము, పుర్వహము, ఉద్వహము, సంవహము, మరియు పరివహము. వీటిలో ముఖ్యమైన పరివహమునకు ఇంకో పేరు మరీచి అని కూడా ఉంది. వాయువులలో, తన విభూతి, మరీచి రూపంలో వ్యక్తమవుతున్నదని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.