Bhagavad Gita: Chapter 10, Verse 41

యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్చ త్వం మమ తేజోఽoశసంభవమ్ ।। 41 ।।

యత్ యత్ — ఏదైనా; విభూతిమత్ — ఐశ్వర్యవంత; సత్త్వం — ప్రాణి/వస్తువు; శ్రీ మత్ — అందమైన; ఊర్జితం — తేజోవంతమయిన; ఏవ — కూడా; వా — లేదా; తత్ తత్ — అవిఅన్ని; ఏవ — నిజముగా; అవగచ్చ — తెలుసుకొనుము; త్వం — నీవు; మమ — నా యొక్క; తేజః — తేజస్సు; అంశ — అంశతో; సంభవం — ఉద్భవించినది.

Translation

BG 10.41: నీవు ఏదైనా అందమైన దాన్ని కానీ, అద్భుతమైన దాన్ని కానీ, లేదా శక్తివంతమైన దాన్ని కానీ చూస్తే, అది కేవలం నా శోభ యొక్క తళుకుగా తెలుసుకొనుము.

Commentary

స్పీకర్లో ప్రవహించే కరెంటు దానిలో నుండి శబ్దమును జనింపచేస్తుంది. కానీ, అది ఎలా పనిచేస్తుందో దాని వెనుక ఉన్న సూత్రం తెలియనివారు, ధ్వని ఆ స్పీకర్ నుండే వస్తోంది అని అపోహ పడవచ్చు. అదే విధంగా, మనం ఎప్పుడైనా అత్యద్భుతమైన వైభవాన్ని ఎక్కడైనా గమనిస్తే, మరియు ఏదేని విశేషఘటన మనలను ఆశ్చర్యచకితులను చేస్తే, పారవశ్యమునకు గురి చేస్తే, అమితానందమును కలుగజేస్తే, అది భగవంతుని వైభవము యొక్క తళుకుగా అర్థంచేసుకోవాలి. సౌందర్యము, యశస్సు, శక్తి, జ్ఞానము, మరియు ఐశ్వర్యము అనంత పరిమాణంలో కలవాడు భగవంతుడు. సర్వ ప్రాణులకు, సమస్త పదార్థములకు వాటి వాటి శోభను చేకూర్చిపెట్టేది ఆయన శక్తిసామర్థ్యములే. ఈ విధంగా, సర్వ-ఐశ్వర్యమునకు మూలఉత్పత్తి స్థానమైన భగవంతుడినే మనం మన ఆరాధనా విషయంగా చేసుకోవాలి.