Bhagavad Gita: Chapter 10, Verse 42

అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ।
విష్టభ్యాహమిదం కృత్స్నమ్ ఏకాంశేన స్థితో జగత్ ।। 42 ।।

అథవా — లేదా; బహునా — వివరముగా; ఏతేన — ఈ యొక్క దానిచే; కిం — ఏమి?; జ్ఞాతేన తవ — నీవు తెలుసుకొని; అర్జునా — అర్జున; విష్టభ్య — వ్యాపించి పోషిస్తూ; అహం — నేను; ఇదం — ఈ యొక్క; కృత్స్నం — సమస్త; ఏక — ఒకే ఒక్క; అంశేన — అంశచే; స్థితః — స్తితుడనై; జగత్ — సృష్టి.

Translation

BG 10.42: ఈ విస్తారమైన జ్ఞానం ఏం అవసరం, ఓ అర్జునా? ఇంత మాత్రం తెలుసుకో చాలు, కేవలం నా యొక్క ఒక్క చిన్న అంశచేతనే, సమస్త జగత్తు యందు వ్యాపించి మరియు దాన్ని పోషిస్తూ/నిర్వహిస్తూ ఉన్నాను.

Commentary

ప్రశ్నకు ఇంతకుక్రితమే సమాధానం చెప్పేసాను అన్న అర్థాన్ని శ్రీకృష్ణుడి మాటలు సూచిస్తున్నాయి. ఇప్పుడు, తనే స్వంతముగా, ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాడు. తన యొక్క ఎన్నో అద్భుతమైన విభూతులని తెలియచేసిన పిదప, ఆయన చెప్పిన దాన్నంతా కలిపినా తన యొక్క వైభవముల విస్తారాన్ని గణించలేమని అంటున్నాడు, ఎందుకంటే అనంతకోటి బ్రహ్మాండముల సృష్టిని తన యొక్క చిన్న అంశము యందే కలిగి ఉన్నాడు, శ్రీ కృష్ణుడు.

తన యొక్క చిన్న అంశమును ఇక్కడే ఎందుకు ఉదహరిస్తున్నాడు? కారణం ఏమిటంటే, అనంతమైన బ్రహ్మాండములు కలిగి ఉన్న మొత్తం భౌతిక జగత్తు, భగవంతుని సమస్త సృష్టిలో కేవలం 1/4వ వంతు మాత్రమే; మిగిలిన 3/4వ వంతు ఆధ్యాత్మిక దివ్యజగత్తు.

పాదోఽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి

(పురుష సూక్తం, 3వ మంత్రం)

 

‘భౌతిక శక్తిచే తయారుచేయబడిన ఈ యొక్క తాత్కాలికమైన జగత్తు పరమేశ్వరుని వ్యక్తిత్త్వం యొక్క ఒక్క భాగము మాత్రమే. మిగతా మూడు భాగాలు, జనన-మరణములకు అతీతమైన ఆయన యొక్క దివ్య ధామములు.’

ఆసక్తికరంగా, శ్రీ కృష్ణుడు అర్జునుడి ముందే, ఈ లోకం లోనే, ఉన్నాడు, అయినా సమస్త భౌతిక జగత్తు తనయొక్క ఒక్క అంశముయందే ఉన్నది అంటున్నాడు. ఇది గణేశుడు మరియు శివుని కథ లాగా ఉంది.

ఒకసారి, నారద మహర్షి శివునికి ఒక ప్రత్యేకమైన పండు ఇచ్చాడు. శంకర భగవానుని ఇద్దరు కుమారులైన, కార్తికేయుడు మరియు గణేశుడు ఇద్దరూ దానికోసం పోటీపడ్డారు. తను వారిలో ఏ ఒక్కరికైనా ఇస్తే, రెండవవారు తమ తండ్రి పక్షపాతముగలవాడని అనుకుంటారని శంకరుడు తలచాడు. కాబట్టి శంకర భగవానుడు తన ఇద్దరు పిల్లలకి ఒక పోటీ ఏర్పాటు చేసాడు. ఎవరైతే ఈ బ్రహ్మాండమును ప్రదక్షిణ చేసి, తిరిగి తన దగ్గరికి మొదట వస్తారో వారికే ఈ పండు అని అన్నాడు.

ఇది విన్న కార్తికేయుడు వెంటనే బ్రహ్మాండమును ప్రదక్షిణ చేయటానికి బయలుదేరాడు. ఆయన చక్కటి దేహధారుడ్యం కలవాడు కావున దానిని ఉపయోగించుకోదలచాడు. ఈయనతో పోలిస్తే, గణేశుడు ఊబకాయుడు మరియు తన సోదరునితో పోటీ పడటానికి సరితూగను అనుకున్నాడు. కాబట్టి, వినాయకుడు (గణేశుడు) తన బుద్ధి ద్వారా దీనిని సాధించాలనుకున్నాడు. శివపార్వతులు అక్కడే నిలబడి ఉన్నారు. గణేశుడు వారికి మూడుసార్లు ప్రదక్షిణ చేసి, ‘నాన్నగారూ, నేను చేసేసాను, దయచేసి ఇక ఆ పండు ఇవ్వండి’ అన్నాడు,

శివుడు అన్నాడు ‘కానీ, నువ్వు మాతోటి ఇక్కడే ఉన్నావు కదా, బ్రహ్మాండము చుట్టూ ఎలా తిరిగావు?’ అని.

గణేశుడు అన్నాడు, ‘తండ్రి గారు, మీరే ఈశ్వరుడు, సమస్త బ్రహ్మాండము మీయందే ఉన్నది. నేను మీకు ప్రదక్షిణ చేస్తే సమస్త బ్రహ్మాండమును చుట్టి వచ్చినట్టే.’ అని.

తన పుత్రుడు గణేశుడు చాలా తెలివైన వాడని శంకర భగవానుడు ఒప్పుకోవలసి వచ్చింది మరియు నిజంగానే గణేశుడు ఆ పోటిలో నెగ్గాడు.

ఎట్లయితే శివుడు ఒక ప్రదేశంలోనే నిల్చున్నా, బ్రహ్మాండమంతా తనయందే కలిగి ఉన్నట్టు, అదే విధంగా, అనంతమైన భౌతిక బ్రహ్మాండములను కలిగిఉన్న సమస్త సృష్టి, తన యొక్క ఒక్క అంశముయందే కలిగిఉన్నట్టు శ్రీ కృష్ణుడు అర్జునుడికి ప్రకటిస్తున్నాడు.