Bhagavad Gita: Chapter 11, Verse 47

శ్రీ భగవానువాచ ।
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ ।
తేజోమయం విశ్వమనంతమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ।। 47 ।।

శ్రీ-భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; మయా — నా చేత; ప్రసన్నేన — ప్రసన్నుడనై; తవ — నీ చే; అర్జున — అర్జునా; ఇదం — ఇది; రూపం — రూపము; పరం — దివ్యమైన; దర్శితం — చూపించబడెను; ఆత్మ-యోగాత్ — నా యోగమాయా శక్తి చేత; తేజః-మయం — తేజోవంతమైన; విశ్వం — విశ్వము; అనంతం — అనంతమైన; ఆద్యం — ఆదిమూలమైన; యత్ — ఏదైతే; మే — నా యొక్క; త్వత్ అన్యేన — నీవు తప్ప; న దృష్ట-పూర్వం — ఇంకెవరూ ఇంతకు క్రితం చూడలేదు.

Translation

BG 11.47: శ్రీ భగవానుడు పలికెను: అర్జునా, నీ చేత ప్రసన్నుడనై, నా యోగమాయా శక్తి ద్వారా, నా యొక్క తేజోవంతమయిన, అనంతమైన, మరియు సనాతనమైన మూల విశ్వ రూపమును నేను నీకు చూపించితిని. నీ కంటే ముందు ఈ రూపమును ఎవ్వరూ చూడలేదు.

Commentary

అర్జునుడు భీతిల్లిపోయి, విశ్వ రూపమును ఉపసంహరించమని వేడుకోవటం వలన, శ్రీ కృష్ణుడు ఇప్పుడు అతనిని భయపడనవసరం లేదని శాంతింపజేస్తున్నాడు. తన యొక్క విశ్వరూప దర్శనమును అర్జునుడిపై కృపతో ప్రసాదించాడు, అంతేకానీ శిక్షించటానికి కాదు, ఆ రూపాన్ని అర్జునుడి పట్ల చాలా ప్రీతి చెంది చూపించాడు. ఆ విశ్వ రూపమును చూడటంలో అర్జునుడే మొట్టమొదటి వాడు అని, అది ఎంత అరుదైన విషయమో అని వక్కాణించటంలో అతిశయోక్తితో చెప్పాడు. దుర్యోధనునికి మరియు యశోదమ్మకూ కూడా ఈ విశ్వ రూపమును కొద్దిగా చూపించాడు కానీ, మరీ ఇంత అద్భుతంగా, ఇంత విస్తారంగా, ఈ పరిమాణంలో కాదు.

శ్రీకృష్ణుడు అర్జునుడికి దివ్య దృష్టిని తన యోగామాయా శక్తి ద్వారా ప్రసాదించాడు. ఇది భగవంతుని యొక్క సర్వ శక్తివంతమైన శక్తిస్వరూపము. దీనిని ఎన్నో చోట్ల ఉదహరించాడు, 4.6వ శ్లోకంలో మరియు 7.25వ శ్లోకంలో మొదలైన చోట్ల. ఈ యొక్క యోగమాయా శక్తి ద్వారానే, భగవంతుడు, ‘కర్తుమకర్తుమ్ అన్యథా కరతుమ్ సమర్థః’ అయ్యాడు; అంటే, ఈ యోగామాయా శక్తి ద్వారా సాధ్యమయ్యేవి చేయగలడు, సాధ్యం కానివి చేయగలడు, ఒకేసారి పరస్పర విరుద్ధమైనవి కూడా చేయగలడు.’ ఈ యొక్క దివ్యమైన శక్తి ఒక సాకార రూపంలో కూడా ప్రకటితమౌతుంది మరియు హిందూ ధర్మంలో అది విశ్వ మాతగా, రాధ, దుర్గ, లక్ష్మీ, కాళీ, సీత, పార్వతి, వంటి రూపాలలో ఆరాధించబడుతుంది.