Bhagavad Gita: Chapter 11, Verse 45

అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే ।
తదేవ మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ।। 45 ।।

అదృష్ట-పూర్వం — ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడబడని; హృషితః — గొప్ప ఆనందము; అస్మి — నేను; దృష్ట్వా — చూసిన పిదప; భయేన — భయముతో; చ — ఇంకా; ప్రవ్యథితం — వణుకుచున్నది; మనః — మనస్సు; మే — నా యొక్క; తత్ — అది; ఏవ — నిజముగా; మే — నాకు; దర్శయ — చూపుము; దేవ — భగవత్; రూపం — రూపమును; ప్రసీద — దయచేసి కృప చూపించి; దేవ-ఈశ — దేవతలకే ప్రభువా; జగత్-నివాస — జగత్తుకే ఆశ్రయమైనవాడా.

Translation

BG 11.45: ఇంతకు మునుపెన్నడూ చూడని నీ యొక్క విశ్వ రూపమును చూసిన పిదప, నేను పరమానందమును అనుభవిస్తున్నాను. అయినా సరే, నా మనస్సు భయముతో వణుకుచున్నది. దయచేసి నాపై కృప చేయుము మరియు తిరిగి మరల నీ యొక్క ప్రసన్నమైన స్వరూపమును చూపుము, ఓ దేవదేవా, ఓ జగత్తుకు ఆశ్రయమును ఇచ్చేవాడా.

Commentary

భక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది - ఐశ్వర్య భక్తి మరియు మాధుర్య భక్తి. ఐశ్వర్య భక్తిలో భక్తుడు భగవంతుని యొక్క సర్వశక్తి తత్త్వాన్ని ధ్యానం చేస్తూ భక్తిలో నిమగ్నమౌతాడు. ఐశ్వర్య భక్తిలో ప్రధానంగా ఉండే భావము గౌరవము మరియు భక్తిపూర్వక భయము. ఇటువంటి భక్తిలో, భగవంతుని నుండి దూరంగా ఉండే భావన మరియు ప్రవర్తనలో ఎలాంటి లోపాలు లేకుండా ఉండటం అనేవి ముఖ్యముగా ఉంటాయి. ద్వారకా వాసులు మరియు అయోధ్య వాసులు ఈ యొక్క ఐశ్వర్య భక్తికి ఉదాహరణలు; వారు శ్రీకృష్ణుడిని మరియు శ్రీరాముడిని తమ మాహారాజులుగా కొలిచారు. సామాన్య ప్రజలు తమ రాజుగారి పట్ల చాలా మర్యాద మరియు అణకువతో ఉంటారు, కానీ వారు రాజుగారి పట్ల సాన్నిహిత్య భావనలో ఉండలేరు.

మాధుర్య భక్తిలో భక్తుడు భగవంతునితో అన్యోన్యమైన వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. దీనిలో ప్రధానంగా ఉండే భావన ఏమిటంటే, ‘శ్రీ కృష్ణుడు నా వాడు మరియు నేను ఆయనకే చెందిన వాడిని’ అని. కృష్ణుడిని తమ తోటి స్నేహితునిగా ప్రేమించిన బృందావన గోప బాలురు, శ్రీకృష్ణుడిని తమ బిడ్డలా ప్రేమించిన యశోద మాత మరియు నందబాబా, తమ ప్రియుడిగా కృష్ణుడిని ప్రేమించిన గోపికలు, మాధుర్య భక్తికి ఉదాహరణలు. మాధుర్య భక్తి అనేది ఐశ్వర్య భక్తి కంటే అనంతమైన రెట్లు ఉన్నతమైనది. కాబట్టి, జగద్గురు శ్రీకృపాలు జీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:

సబఇ సరస రస ద్వారికా

మథురా అరు బ్రజ మాహీఁ

మధుర, మధురతర, మధురతమ

రస బ్రజరస సమ నాహీఁ (భక్తి శతకం, 70వ శ్లోకం)

‘భగవంతుని యొక్క దివ్య ఆనందము అన్ని రూపాల్లో కూడా అత్యంత మధురమైనది. అయినా అందులోకూడా స్థాయిలు ఉన్నాయి—ఆయన యొక్క ద్వారకా లీలల ఆనందము మధురమైనది, ఆయన యొక్క మథురా లీలల ఆనందము ఇంకా మధురమైనది, మరియు, ఆయన యొక్క వ్రజ (బృందావన) లీలల ఆనందము అత్యంత మధురమైనది.’

మాధుర్య భక్తిలో, భక్తులు భగవంతుని యొక్క పరమేశ్వర తత్త్వాన్ని మర్చిపోయి, శ్రీకృష్ణుడి పట్ల నాలుగు రకాల అనుబంధాలను పెంచుకుంటారు:

దాస్య భావము — శ్రీకృష్ణుడు నా స్వామి మరియు నేను ఆయన యొక్క సేవకుడిని, అని. శ్రీకృష్ణుడి వ్యక్తిగత సేవకులైన రక్తకుడు, పత్రకుడు వంటి వారి భక్తి ఈ దాస్య భావములో ఉంది. భగవంతుడు మన తండ్రి లేదా తల్లి అనేది ఈ యొక్క భావన యొక్క రూపాంతరమే, అది దీనిలో భాగమే.

సఖ్య భావము — శ్రీ కృష్ణుడు మన స్నేహితుడు (సఖుడు) మరియు నేను ఆయన యొక్క సన్నిహిత సఖుడను. శ్రీదాముడు, మధుమంగళుడు, ధన్సుఖుడు, మన్సుఖుడు వంటి బృందావన గోప బాలుర యొక్క భక్తి ఈ సఖ్య భావ కోవకు చెందినది.

వాత్సల్య భావం — శ్రీకృష్ణుడు మన బిడ్డ మరియు నేను ఆయన తల్లి/తండ్రిని. యశోద మరియు నందబాబాల యొక్క భక్తి ఈ వాత్సల్య భావము లోనిది.

మాధుర్య భావము — శ్రీకృష్ణుడు మా ప్రియసఖుడు మరియు నేను అతని ప్రియురాలిని. బృందావన గోపికల యొక్క భక్తి ఈ మాధుర్య భావములో ఉన్నది.

అర్జునుడు సఖ్యభావములో ఉన్న భక్తుడు మరియు భగవంతునితో సుహృద్భావంగల సంబంధాన్ని ఆస్వాదించేవాడు. భగవంతుని యొక్క విశ్వ రూపాన్ని చూసిన పిదప, అర్జునుడు మహోన్నతమైన ఆశ్చర్యానికి మరియు పూజ్య భావానికి లోనయ్యాడు, అయినా తను ఎప్పుడూ అనుభవించే సఖ్యభావము యొక్క మాధుర్యాన్నే కోరుకున్నాడు. కాబట్టి, ఆయన ఇప్పుడు చూస్తున్న విశ్వరూపమును ఉపసంహరించి మరలా మానవ స్వరూపాన్ని చూపించమని కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు.