అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ।। 11 ।।
అఫల-ఆకాంక్షిభిః — ప్రతిఫలము ఏమీ ఆశించకుండా; యజ్ఞః — యజ్ఞము; విధి-దృష్టః — శాస్త్రములు ఉపదేశించిన విధముగా; యః — ఏదైతే; ఇజ్యతే — చేయుదురో; యష్టవ్యమ్-ఏవ-ఇతి — కర్తవ్యముగా చేయవలసినదే అని; మనః — మనస్సు; సమాధాయ — దృఢ సంకల్పముతో; సః — అది; సాత్త్వికః — సాత్విక స్వభావము తో చేసినట్టు.
Translation
BG 17.11: ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధినియమములను పాటిస్తూ, ఇది చేయవలసిన కర్తవ్యము అని మనస్సులో దృఢ సంకల్పముతో చేసిన యజ్ఞము సత్త్వ గుణముతో చేయబడినట్టు.
Commentary
యజ్ఞము చేసే ప్రవృత్తి కూడా త్రిగుణముల ప్రకారముగానే ఉంటుంది. శ్రీ కృష్ణుడు, సత్త్వ గుణములో చేసే యజ్ఞ పద్ధతిని మొదటగా వివరిస్తున్నాడు. ‘అఫల-ఆకాంక్షిభిః’ అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా యజ్ఞమును చేయబడాలి. ‘విధి దృష్టః’ అంటే, అది వేద శాస్త్రములలో చెప్పబడిన నియమముల ప్రకారంగా చేయబడాలి. ‘యష్టవ్యమ్ ఏవైతి’ అంటే, శాస్త్రముల్లో ఆదేశింపబడినట్టు, ఈశ్వర ఆరాధన నిమిత్తమే చేయబడాలి. ఎప్పుడైతే యజ్ఞము ఈ విధముగా చేయబడినదో, అది సత్త్వ గుణముతో చేయబడినట్టు.