ఈ భగవద్గీత యొక్క ఈ చిట్టచివరి అధ్యాయము మిగతా అన్ని అధ్యాయాల కన్నా దీర్ఘమైనది మరియు ఇది చాలా విషయములను వివరిస్తుంది. అర్జునుడు సన్యాసము అనే విషయాన్ని ప్రారంభిస్తూ, సంస్కృతంలో సాధారణంగా వాడే పదాలైన ‘సన్యాసము’ (కర్మలను త్యజించటం) మరియు ‘త్యాగము’ (కోరికలను త్యజించటం) అన్న వాటి గురించి ఒక ప్రశ్న అడుగుతాడు. ఈ రెండు పదాలు ‘త్యజించటం’ అన్న అర్థం లో ఉన్న మూల పదముల నుండే జనించాయి. ‘సన్యాసి’ అంటే గృహస్తు జీవితంలో పాలుపంచుకోకుండా సాధన కోసము సమాజము నుండి తనను తాను ఉపసంహరించుకుంటాడు. ‘త్యాగి’ అంటే కార్యకలాపాలు చేస్తుంటాడు కానీ, కర్మ ఫలములను అనుభవించాలనే స్వార్థ చింతనను విడిచిపెట్టినవాడు. (భగవద్గీతలో చెప్పబడిన అర్థం ఇది). శ్రీ కృష్ణుడు రెండవ రకం సన్యాసాన్ని సిఫారసు చేస్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు, మరియు ఇతర ధార్మిక కర్తవ్య కార్యములను ఎప్పుడూ త్యజించకూడదు అంటున్నాడు, ఎందుకంటే అవి జ్ఞానోదయులను కూడా పవిత్రం చేస్తాయి. వాటి పట్ల ఫలాసక్తి లేకుండా, అవి చేయబడాలి కాబట్టి వాటిని మన కర్తవ్యంలా భావించి చేయాలి.
తదుపరి, శ్రీ కృష్ణుడు కర్మను ప్రేరేపించే మూడు విషయముల గురించి, కర్మ యొక్క మూడు అంగముల గురించి, కర్మ ఫలములను నిర్ణయించే ఐదు విషయముల గురించి విస్తారమైన విశ్లేషణ అందచేస్తాడు. వీటన్నిటిని త్రిగుణముల పరంగా వివరిస్తాడు. అపరిపూర్ణ జ్ఞానము కలవారు, వారే తమ కర్మల (కార్యముల) కారణము (చేస్తున్నది) అని భావిస్తారు. కానీ జ్ఞానోదయమైన మహాత్ములు, అంతఃకరణ శుద్ధి కలవారై, చేసేది తాముకాదు మరియు ఆ కర్మఫలముకు భోక్త తాము కాదు అని తెలుసుకుంటారు. సతతమూ తమ కర్మ ఫలముల పట్ల అనాసక్తతతో ఉంటూ, వారు కర్మ బంధములలో చిక్కుకోరు. జనులు తమ ఉద్దేశ్యాలు, కార్యకలాపాలలో ఎందుకు విభిన్నరకాలుగా ఉంటారో ఈ అధ్యాయం తదుపరి వివరిస్తుంది. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రకారంగా - వివిధ రకాల జ్ఞానములను, వివిధ రకాల పనులను, మరియు అవి చేసే వారి వివిధ రకాల స్వభావములను ఈ అధ్యాయం వివరిస్తుంది. అదే విశ్లేషణను - బుద్ధి, సంకల్పము, మరియు ఆనందము - పట్ల కూడా ఈ అధ్యాయం అందిస్తుంది. తదుపరి ఈ అధ్యాయము, ఆధ్యాత్మిక జీవనంలో పరిపూర్ణ సిద్ధి సాధించి, బ్రహ్మ-జ్ఞానములో స్థితులై ఉన్నవారిని వివరిస్తుంది. అటువంటి పరిపూర్ణ యోగులు కూడా తమ సిద్ధిలో పరిపూర్ణతని భక్తిలో నిమగ్నమవ్వటం ద్వారా అనుభవిస్తారు. ఈ విధంగా, సర్వోన్నత దివ్య మంగళ స్వరూప భగవంతుని యొక్క యదార్థ రహస్యమును ప్రేమయుక్త భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోగలము.
భగవంతుడు సర్వ భూతముల హృదయములో స్థితుడై ఉంటాడని, మరియు వాటి వాటి కర్మానుసారం వారిని త్రిప్పుతుంటాడని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి గుర్తుచేస్తాడు. భగవంతుడినే స్మరిస్తూ, మన అన్ని కార్యకలాపములను ఆయనకే అర్పితం చేసి, ఆయన ఆశ్రయం పొంది, ఆయనే మన పరమ లక్ష్యముగా చేసుకుంటే, ఆ తదుపరి ఆయన కృప ద్వారా మనము అన్ని క్లేశములను, అవరోధాలను అధిగమించగలము. కానీ, దురభిమానంతో, మన ఇష్టంవచ్చినట్టు ప్రవర్తిస్తే, మనకు విజయం/సఫలత లభించదు. చిట్టచివరికి శ్రీ కృష్ణుడు అత్యంత గుహ్యమైన జ్ఞానమును తెలియచేస్తూ, సర్వ ధర్మములనూ త్యజించి కేవలం భగవంతునికే శరణాగతి చేయమంటాడు. కానీ, ఈ జ్ఞానమును సాధుచిత్తులూ, భక్తులు కాని వారికి ఇవ్వకూడదు అని అంటున్నాడు, ఎందుకంటే దానిని వారు తప్పుగా అర్థం చేసుకుని, బాధ్యతారహితముగా కర్మలను పరిత్యాగం చేసే ప్రమాదం ఉంటుంది. కానీ, ఈ రహస్య జ్ఞానమును అర్హులైన జీవులకు అందిస్తే, అది అత్యున్నత ప్రేమతో చేసేపని అవుతుంది మరియు అది భగవంతునికి అత్యంత ప్రీతికరమయినది.
తన మోహము/భ్రాంతి నిర్మూలించబడినవి అని, తాను ఇప్పుడు, చెప్పినట్టు చేయటానికి తయారుగా ఉన్నానని అర్జునుడు ఆ తరువాత శ్రీ కృష్ణుడికి తెలియచేస్తాడు. చివరలో, అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకి ఈ (కృష్ణార్జున) సంవాదమును వినిపిస్తున్న సంజయుడు, ఆ దివ్య సంభాషణను వింటూ తాను ఎంత ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి లోనయ్యాడో చెప్తాడు. ఆ యొక్క పవిత్ర సంభాషణని, మరియు మహాద్భుత విశ్వరూపమును గుర్తుచేసుకుంటే ఆయన యొక్క రోమములు మహదానందముతో నిక్కబొడుచుకుంటాయి. భగవంతుడు మరియు ఆయన పరిశుద్ధ భక్తుడు ఎక్కడుంటే, వారి పక్షమే విజయం ఎల్లప్పుడూ ఉంటుంది; అంతేకాక, శుభమూ, విజయమూ, మరియు ఐశ్వర్యమూ కూడా వారి వద్దే ఉంటుంది, ఎందుకంటే అసత్యపు చీకటి ఖచ్చితంగా పరమ సత్యము యొక్క వెలుగుచే నిర్మూలించబడుతుంది - అనే ఒక గంభీరమైన ప్రకటనతో సంజయుడు దీనిని ముగిస్తున్నాడు.
Bhagavad Gita 18.1 View commentary »
అర్జునుడు పలికెను : ఓ మహాబాహువులు కల కృష్ణా, 'సన్యాసము' (కర్మలను త్యజించటము) మరియు 'త్యాగము' (కర్మఫలములను భోగించాలనే కోరికను త్యజించటము) ల యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓ హృషీకేశా, వాటి మధ్య భేదమును కూడా తెలుసుకోవాలని కోరిక ఉన్నది, ఓ కేశినిషూదనా.
Bhagavad Gita 18.2 View commentary »
శ్రీ భగవానుడు ఇలా పలికెను : కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు.
Bhagavad Gita 18.3 View commentary »
కొంతమంది విద్వాంసులు కర్మలు అన్నియూ దోషభూయిష్టమైనవి అని, వాటిని విడిచిపెట్టాలి అంటారు, అదే సమయంలో మరికొంతమంది, యజ్ఞములు, దానములు, మరియు తపస్సులను ఎన్నడూ విడిచిపెట్టవద్దు అంటారు.
Bhagavad Gita 18.4 View commentary »
త్యాగము అన్న విషయముపై ఇక ఇప్పుడు నా తుది నిర్ణయమును వినుము, ఓ పురుషవ్యాఘ్రమా, త్యాగము అనేది మూడు రకాలుగా ఉంటుంది అని చెప్పబడినది.
Bhagavad Gita 18.5 View commentary »
యజ్ఞము, దానము, మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు; అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము, మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి.
Bhagavad Gita 18.6 View commentary »
ఫలములపై మమకారాసక్తి లేకుండా మరియు ప్రతిఫలాపేక్ష లేకుండా ఈ కార్యములు చేయబడాలి. ఇదే నా ఖచ్చితమైన మరియు సర్వోత్కృష్ట తీర్పు, ఓ అర్జునా.
Bhagavad Gita 18.7 View commentary »
విధింపబడిన కర్తవ్య కర్మలను ఎన్నటికీ త్యజించరాదు. ఇటువంటి అయోమయ త్యాగము తామసిక త్యాగము అని చెప్పబడును.
Bhagavad Gita 18.8 View commentary »
విధిగా చేయవలసిన కర్తవ్య కర్మలను, అవి కష్టముగా ఉన్నాయని లేదా శారీరక అసౌకర్యమును కలిగిస్తున్నాయని తలచి, వాటిని విడిచిపెట్టటాన్ని, రజో గుణ త్యాగము అంటారు. అటువంటి త్యాగము ఎప్పటికీ క్షేమదాయకమైనది కాదు మరియు మన ఉన్నతికి దోహదపడదు.
Bhagavad Gita 18.9 View commentary »
అర్జునా, కర్తవ్యమునకు అనుగుణంగా ఎప్పుడైతే కర్మలు చేయబడుతాయో, మరియు ఫలాపేక్ష త్యజించబడుతుందో, దానిని సత్త్వగుణ త్యాగము అంటారు.
Bhagavad Gita 18.10 View commentary »
నచ్చని పనులు తప్పించుకోటానికి యత్నించకుండా లేదా ఇష్టమైన/అనుకూలమైన పనుల కోసం ఆశించకుండా ఉండే వారు నిజమైన త్యాగులు. వారు సత్త్వగుణ సంపన్నులు మరియు వారు ఎటువంటి సంశయములు లేనివారు (కర్మ స్వభావం గురించి).
Bhagavad Gita 18.11 View commentary »
దేహమును కలిగున్న ఏ జీవికి కూడా, కర్మలను పూర్తిగా త్యజించటం శక్యము కాదు. అందుకే, తన కర్మ ఫలములను త్యజించినవాడే నిజమైన త్యాగి అని చెప్పబడును.
Bhagavad Gita 18.12 View commentary »
స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి, మరణించిన పిదప కూడా - సుఖము, దుఃఖము, మరియు ఈ రెంటి మిశ్రమము - ఈ మూడు విధములుగా కర్మ ప్రతిఫలములు ఉండును. కానీ, కర్మఫల త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో కానీ, పరలోకములో కానీ ఉండవు.
Bhagavad Gita 18.13 View commentary »
ఓ అర్జునా, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న ఐదు కారకముల గురించి సాంఖ్య శాస్త్రము ప్రకారం ఏమి చెప్పారో ఇప్పుడు చెప్తాను వినుము, అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది.
Bhagavad Gita 18.14 View commentary »
శరీరము, కర్త (జీవాత్మ), వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము - ఇవే కర్మ యొక్క ఐదు అంగములు.
Bhagavad Gita 18.15 – 18.16 View commentary »
శరీరము, వాక్కు, లేదా మనస్సులచే ఏ కర్మ/కార్యము జరిగినా, అది మంచిదయినా లేదా చెడయినా, ఈ ఐదు దానికి కారకములు. ఇది అర్థంకాని వారు ఆత్మయే నిజమైన కర్త అనుకుంటారు. మలినబుద్ధి తో ఉన్న అటువంటివారు యథార్థమును గ్రహింపలేరు.
Bhagavad Gita 18.17 View commentary »
కర్తృత్వ అహంకార భావమును (చేసేది నేనే అన్న భావమును) విడిచిపెట్టి, బుద్ధి మమకారాసక్తి రహితముగా ఉండే వారు, ప్రాణులను సంహరించినా సరే, వారు చంపినట్టు కాదు మరియు కర్మ బంధనములకు లోనుకారు.
Bhagavad Gita 18.18 View commentary »
జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), జ్ఞానమును ఎఱింగినవాడు - ఇవి మూడు కర్మను ప్రేరేపించును. కర్మ యొక్క ఉపకరణం, క్రియ, కర్త - ఈ మూడు కర్మ యొక్క అంగములు.
Bhagavad Gita 18.19 View commentary »
జ్ఞానము, కర్మ, మరియు కర్త - ఇవి ప్రకృతి త్రి-గుణముల పరముగా ఒక్కోటి మూడు రకాలుగా ఉంటాయని సాంఖ్య శాస్త్రము పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెప్తాను వినుము.
Bhagavad Gita 18.20 View commentary »
ఏ జ్ఞానముచేతనైతే, సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనశ్వరమైన అస్తిత్వము ఉన్నట్టు తెలుసుకోబడుతుందో ఆ జ్ఞానము సత్త్వ గుణములో ఉన్నట్టు.
Bhagavad Gita 18.21 View commentary »
ఏ జ్ఞానము చేతనయితే, భిన్నభిన్న దేహములలో ఉన్న నానా రకాల ప్రాణులు వేర్వేరుగా, ఒకదానికొకటి సంబంధము లేనట్టుగా చూడబడుతాయో, ఆ జ్ఞానము రాజసికమని (రజోగుణములో ఉన్న) గ్రహించుము.
Bhagavad Gita 18.22 View commentary »
సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది.
Bhagavad Gita 18.23 View commentary »
ఏదైతే కర్మ - శాస్త్రబద్ధముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది.
Bhagavad Gita 18.24 View commentary »
స్వార్థ కోరికచే ప్రేరేపితమై, అహంకారముచే చేయబడినట్టి, మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణములో ఉన్నదని చెప్పబడును.
Bhagavad Gita 18.25 View commentary »
మోహభ్రాంతి వల్ల ప్రారంభించబడి, తమ యొక్క స్వ-శక్తి ఏమిటో తెలుసుకోకుండా, మరియు పరిణామాలు, జరిగే నష్టము, మరియు ఇతరులకు జరిగే హాని గురించి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మ అని అంటారు.
Bhagavad Gita 18.26 View commentary »
అహంకార-మమకార రహితముగా ఉన్నవారు, మరియు ఉత్సాహము, దృఢసంకల్పము కలవారు, జయాపజయముల పట్ల ఉదాసీనముగా ఉన్నవారు, సత్త్వగుణ కర్తలు అని చెప్పబడ్డారు.
Bhagavad Gita 18.27 View commentary »
కర్మఫలముల పట్ల ఆసక్తితో ఉంటూ, దురాశగలవాడై, హింసా-ప్రవృత్తి కలిగి, అపవిత్రతతో ఉండి, మరియు హర్ష-శోకములచే ప్రభావితమౌతూ ఉండే కర్త రజోగుణములో ఉన్నట్టు పరిగణించబడుతాడు.
Bhagavad Gita 18.28 View commentary »
క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలవిలంబన చేసే కర్తలను, తమోగుణ కర్తలు అంటారు.
Bhagavad Gita 18.29 View commentary »
ఇక వినుము ఓ అర్జునా, ప్రకృతి త్రిగుణముల ప్రకారంగా బుద్ధి మరియు ధృతిల యందు భేదమును విస్తారముగా వివరిస్తాను.
Bhagavad Gita 18.30 View commentary »
ఓ పార్థా, ఏది సరియైన పని, ఏది చెడు పని; ఏది కర్తవ్యము, ఏది కర్తవ్యము కాదు; దేనికి భయపడాలి, దేనికి భయపడనవసరం లేదు; ఏది బంధకారకము, ఏది మోక్షకారకము అని అర్థమైనప్పుడు, బుద్ధి సత్త్వగుణములో ఉన్నది అని చెప్పబడును.
Bhagavad Gita 18.31 View commentary »
ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి, రజోగుణములో ఉన్నట్టు.
Bhagavad Gita 18.32 View commentary »
ఓ పార్థా! చీకటితో ఆవృత్తమై ఉండి, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి.
Bhagavad Gita 18.33 View commentary »
యోగము ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పము; మరియు మనస్సు, ప్రాణ వాయువులు, ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారముగా ఉన్న సంకల్పాన్ని, సత్త్వ గుణ దృఢమనస్కత అంటారు.
Bhagavad Gita 18.34 View commentary »
ఫలాపేక్షచే ప్రేరితమై ధర్మము (విధులు), కామము (సుఖములు), మరియు అర్థము(సంపద) పట్ల ఆసక్తితో ఉండే స్థిరచిత్తము రాజసిక ధృతి అని చెప్పబడును.
Bhagavad Gita 18.35 View commentary »
విడువకుండా పగటికలలు కంటూ, భయపడుతూ, శోకిస్తూ, నిరాశకు లోనౌతూ మరియు దురహంకారముతో ఉండే అల్పబుద్ధి సంకల్పమునే తమోగుణ ధృతి అంటారు.
Bhagavad Gita 18.36 View commentary »
ఇక ఇప్పుడు నా నుండి వినుము, ఓ అర్జునా, దేహముయందున్న జీవాత్మ రమించే మూడు విధముల సుఖముల గురించి, మరియు సర్వ దుఃఖముల నుండి విముక్తి దశ చేరటం గురించి.
Bhagavad Gita 18.37 View commentary »
మొదట్లో విషంలా అనిపించినా, చివరికి అమృతంలా ఉండే సుఖమే సత్త్వ గుణ సుఖము. అది ఆత్మ-జ్ఞానం యందే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధిచే జనిస్తుంది.
Bhagavad Gita 18.38 View commentary »
ఇంద్రియములతో ఇంద్రియ వస్తువిషయముల సంపర్కముచేత కలిగిన సుఖమును రాజసిక (రజో గుణ) సుఖము అని అంటారు. ఈ సుఖానందము మొదట్లో అమృతంలా ఉన్నా చివరికి విషంలా ఉంటుంది.
Bhagavad Gita 18.39 View commentary »
ఏదైతే ఆనందము - ఆత్మ యొక్క స్వభావాన్ని పూర్తిగా మొదలు నుండి చివర వరకు కప్పివేసి, మరియు నిద్ర, సోమరితనము, మరియు నిర్లక్ష్యము నుండి ఉద్భవించినదో - అది తామసిక ఆనందము అని చెప్పబడును.
Bhagavad Gita 18.40 View commentary »
ఈ భౌతిక జగత్తు యందు - భూమిపై కానీ, లేదా, ఊర్ధ్వ స్వర్గాది లోకాలలో కానీ - ఏ ఒక్క ప్రాణి కూడా ఈ ప్రకృతి త్రిగుణముల ప్రభావానికి అతీతము కాదు.
Bhagavad Gita 18.41 View commentary »
బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు - వీరి యొక్క విధులు వారివారి లక్షణములకు అనుగుణంగా, వారి వారి గుణముల ప్రకారంగా కేటాయించబడినవి. (పుట్టుక పరంగా కాదు).
Bhagavad Gita 18.42 View commentary »
శమము (ప్రశాంతత), దమము (ఇంద్రియ నిగ్రహణ), తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానము, విజ్ఞానము, మరియు ఇహపరలోకములపై విశ్వాసము - ఇవి బ్రాహ్మణుల సహజసిద్ధ స్వభావ కర్మ లక్షణములు.
Bhagavad Gita 18.43 View commentary »
శౌర్యము, బలము, ధైర్యము, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధంలోనుండి వెనుతిరగని సంకల్పము, విశాల హృదయముతో గల దయాగుణము, మరియు నాయకత్వ సామర్థ్యము - ఇవి క్షత్రియులకు సహజంగా ఉన్న కర్మ లక్షణములు.
Bhagavad Gita 18.44 View commentary »
వ్యవసాయం, పాడిపంటలు, మరియు వర్తకవాణిజ్యాలు అనేవి వైశ్య గుణములు ఉన్నవారికి సహజ సిద్ధమైన పనులు. పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణములు కలవారి యొక్క సహజమైన విధి.
Bhagavad Gita 18.45 View commentary »
స్వభావసిద్ధ జనితమైన వారి వారి విధులను నిర్వర్తించటం ద్వారా, మానవులు పరిపూర్ణ సిద్ధిని సాధించవచ్చు. ఒక వ్యక్తి తనకు విధింపబడిన విధులను ఆచరిస్తూ/నిర్వర్తిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో ఇక ఇప్పుడు నానుండి వినుము.
Bhagavad Gita 18.46 View commentary »
తన సహజస్వభావ వృత్తిని నిర్వర్తించటం ద్వారా వ్యక్తి - సమస్త భూతములూ ఎవని నుండి ఊద్భవించాయో మరియు ఎవ్వనిచే ఈ జగమంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో - వానిని ఆరాధించినట్టు. ఇటువంటి పనులు చేయటం ద్వారా వ్యక్తి సునాయాసముగానే సిద్ధిని పొందుతాడు.
Bhagavad Gita 18.47 View commentary »
పర (ఇతరుల) ధర్మమును సరిగ్గా చేయుటకంటే కూడా, సరిగా చేయలేకపోయినా సరే, తన స్వ-ధర్మము చేయుటయే వ్యక్తికి శ్రేష్ఠము. తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో, వ్యక్తికి పాపము అంటదు.
Bhagavad Gita 18.48 View commentary »
తన సహజ సిద్ధ స్వభావంచే జనితమైన కర్తవ్యములను, వాటిలో దోషాలు ఉన్నాసరే వాటిని వ్యక్తి ఎన్నటికీ విడిచిపెట్టరాదు, ఓ కుంతీ పుత్రా. అగ్ని పొగచే కప్పివేయబడ్డట్టు, నిజానికి సమస్త కర్మ ప్రయాసలూ, ఏదోఒక దోషముచే ఆవరింపబడి ఉంటాయి.
Bhagavad Gita 18.49 View commentary »
ఎవరి బుద్ధి అంతటా అనాసక్తిగా ఉంటుందో, ఎవరు మనస్సుని జయించారో మరియు సన్న్యాస అభ్యాసముచే కోరికలను త్యజించారో, వారు శ్రేష్ఠమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుతారు.
Bhagavad Gita 18.50 View commentary »
ఓ అర్జునా, పరిపూర్ణ సిద్ధిని (కర్మ సన్న్యాసములో) పొందిన వ్యక్తి, ఏ విధముగా, అలౌకిక ఆధ్యాత్మిక జ్ఞానము యందే స్థితమై ఉండటం ద్వారా, బ్రహ్మన్ ను కూడా ఎలా పొందగలడో - వివరిస్తాను, నా నుండి క్లుప్తముగా వినుము.
Bhagavad Gita 18.51 – 18.53 View commentary »
వ్యక్తి ఎప్పుడైతే - ఇంద్రియములను చక్కగా నిగ్రహించి పరిశుద్ధమైన బుద్ధి కలవాడు అగునో, శబ్దము మరియు ఇతర ఇంద్రియ విషయములను త్యజించి, రాగ ద్వేష రహితముగా ఉండునో, అప్పుడు బ్రహ్మంను పొందుటకు పాత్రుడగును. అటువంటి వ్యక్తి ఏకాంతమును ఇష్టపడుతాడు, మితంగా తింటాడు, శరీరమనోవాక్కులను నియంత్రిస్తాడు, నిత్యమూ ధ్యానములో నిమగ్నమౌతాడు, మరియు వైరాగ్యమును అభ్యాసం చేస్తాడు. అహంకారము, హింస, దురభిమానము, కోరికలు, ఆస్తిపాస్తులు తనవే అన్న భావన, స్వార్థము - లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్నవాడై, బ్రహంతో ఏకీభావ స్థితిని పొందుటకు అర్హుడవుతాడు. (అంటే, పరమ సత్యమును బ్రహ్మన్ రూపంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవటం).
Bhagavad Gita 18.54 View commentary »
పరబ్రహ్మంతో ఏకీభావ స్థితిలో ఉన్న వ్యక్తి మానసికంగా ప్రశాంతచిత్తముతో ఉంటాడు, దేనికీ శోకింపడు, దేనినీ కాంక్షింపడు. సర్వ భూతముల పట్ల సమత్వ భావముతో ఉంటూ, అటువంటి యోగి నా పరాభక్తిని పొందును.
Bhagavad Gita 18.55 View commentary »
కేవలం నా పట్ల ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే, యదార్థముగా నేను ఎవరో (ఎంతటి వాడనో) తెలుకోవచ్చును. నన్ను తెలుసుకున్న పిదప, నా భక్తుడు నా సంపూర్ణ భావనలో లీనమగును.
Bhagavad Gita 18.56 View commentary »
సర్వ కార్యములు చేస్తూనే ఉన్నా, నా భక్తులు నన్నే పూర్తిగా ఆశ్రయిస్తారు. నా కృపచే వారు నిత్యశాశ్వతమైన మరియు అనశ్వరమైన ధామమును పొందుతారు.
Bhagavad Gita 18.57 View commentary »
నన్నే నీ యొక్క పరమ లక్ష్యముగా చేసుకుని, నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. బుద్ధి యోగమును ఆశ్రయించి, నీ చిత్తమును నా యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుము.
Bhagavad Gita 18.58 View commentary »
నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటే, నా కృపచే అన్ని అడ్డంకులను మరియు కష్టాలను అధిగమించగలవు. కానీ ఒకవేళ, అహంకారముచే, నా సలహా వినకపోతే, నీవు నాశనమైపోతావు.
Bhagavad Gita 18.59 View commentary »
ఒకవేళ నీవు అహంకారముచే ప్రేరితమై, ‘నేను యుద్ధం చేయను’ అని అనుకుంటే, నీ నిర్ణయం ఎలాగూ వ్యర్థమై పోతుంది. ఎందుకంటే, నీ యొక్క స్వంత (క్షత్రియ) భౌతిక స్వభావమే నిన్ను యుద్ధం చేయటానికి పురికొల్పుతుంది.
Bhagavad Gita 18.60 View commentary »
ఓ అర్జునా, మోహభ్రాంతిచే నీవు ఏదైతే పనిని చేయను అని అంటున్నావో, నీ యొక్క సహజప్రకృతి స్వభావముచే జనించిన ప్రేరణచే, ఆ పనినే చేయటానికి ప్రేరేపింపబడుతావు.
Bhagavad Gita 18.61 View commentary »
పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు, ఓ అర్జునా. భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.
Bhagavad Gita 18.62 View commentary »
సంపూర్ణ హృదయ పూర్వకముగా కేవలం ఆయనకే అనన్య శరణాగతి చేయుము, ఓ భరతా. ఆయన కృపచే, నీవు పరమ శాంతిని మరియు నిత్యశాశ్వత ధామమును పొందెదవు.
Bhagavad Gita 18.63 View commentary »
ఈ విధంగా, నేను నీకు అన్ని రహస్యాలకంటే పరమ రహస్యమైన జ్ఞానమును తెలియచేసాను. దీనిపై లోతుగా ఆలోచించుము, మరియు నీకు నచ్చిన రీతిలో చేయుము.
Bhagavad Gita 18.64 View commentary »
నా యొక్క సర్వోత్కృష్ట ఉపదేశమును మళ్ళీ ఒకసారి వినుము, అది సమస్త జ్ఞానములో కెల్లా అత్యంత గోప్యమైనది. నీ హితము కోరి దీనిని తెలియచేస్తున్నాను, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి కాబట్టి.
Bhagavad Gita 18.65 View commentary »
ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా పట్ల భక్తితో ఉండుము, నన్ను పూజించుము మరియు నాకు నమస్కరించుము. ఇలా చేయటం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుందువు. నేను నీకిచ్చే వాగ్దానం ఇది, ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైనవాడివి.
Bhagavad Gita 18.66 View commentary »
అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసెదను; భయపడకుము.
Bhagavad Gita 18.67 View commentary »
ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా తపస్సంపన్నులు కాని వారికి, లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. (ఆధ్యాత్మిక విషయములు) వినటం పట్ల ఏవగింపు కలవారికి కూడా దీనిని చెప్పకూడదు, మరియు ముఖ్యంగా, నాపట్ల అసూయ కలవారికి దీనిని చెప్పకూడదు.
Bhagavad Gita 18.68 View commentary »
ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో, వారు మహోన్నత ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహముగా నన్నే చేరుకుంటారు.
Bhagavad Gita 18.69 View commentary »
వారి కంటే ఎక్కువ ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు; వారి కంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరూ ఉండబోరు.
Bhagavad Gita 18.70 View commentary »
మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, జ్ఞాన యజ్ఞముచే (తమ బుద్ధిచే) నన్ను ఆరాధించినట్టు అని నేను ప్రకటిస్తున్నాను; ఇదే నా అభిప్రాయము.
Bhagavad Gita 18.71 View commentary »
శ్రద్ధా విశ్వాసముతో, అసూయ లేకుండా, ఈ జ్ఞానాన్ని కేవలం విన్న వారు కూడా పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకుంటారు.
Bhagavad Gita 18.72 View commentary »
ఓ అర్జునా, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము, మోహభ్రాంతి నిర్మూలించబడినవా?
Bhagavad Gita 18.73 View commentary »
అర్జునుడు పలికెను: ఓ అచ్యుతా (దోషరహితుడా), నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడినది, మరియు నేను జ్ఞానములో స్థితుడనై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏవీ లేవు, మరియు నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను.
Bhagavad Gita 18.74 View commentary »
సంజయుడు పలికెను: ఈ విధంగా నేను, వసుదేవుని పుత్రుడైన శ్రీ కృష్ణుడికి మరియు మహాత్ముడు, ప్రిథ పుత్రుడూ అయిన అర్జునుడికి మధ్య జరిగిన సంవాదమును విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమములు నిక్కబొడుచుకుంటున్నాయి.
Bhagavad Gita 18.75 View commentary »
వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.
Bhagavad Gita 18.76 View commentary »
సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకు మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును పదేపదే గుర్తుచేసుకుంటూ, ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.
Bhagavad Gita 18.77 View commentary »
మరియు ఆ శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడనై, పదేపదే మహదానందముతో పదేపదే పులకించి పోతున్నాను.
Bhagavad Gita 18.78 View commentary »
ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.