Bhagavad Gita: Chapter 5, Verse 17

తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః ।
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ।। 17 ।।

తత్-బుద్ధయః — బుద్ధి ఈశ్వర పరం అయినవారు; తత్-ఆత్మానః — హృదయము (మనస్సు, బుద్ధి) భగవంతుని యందే నిమగ్నమైన వారు; తత్-నిష్ఠాః — భగవంతుని యందే దృఢ విశ్వాసం కలవారు; తత్-పరాయణాః — భగవంతుడే తమ ఆశ్రయము, లక్ష్యము అని శ్రమించు వారు; గచ్చంతి — వెళ్లేదరు; అపునః-ఆవృత్తిం — తిరిగిరాని; జ్ఞాన — జ్ఞానముచే; నిర్ధూత — నిర్మూలించబడి; కల్మషాః — పాపములు

Translation

BG 5.17: తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు - వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి, త్వరిత గతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.

Commentary

ఎలాగైతే అజ్ఞానము వ్యక్తిని 'సంసారములో', అంటే నిరంతర జనన-మరణ చక్రంలో, దుఃఖములకు గురిచేయునో, అలాగే, జ్ఞానమునకు వ్యక్తిని భౌతిక బంధము నుండి విడిపించే శక్తి ఉంది. ఇటువంటి జ్ఞానము ఎప్పుడూ కూడా భగవంతునిపై భక్తితో కూడి ఉంటుంది. ఈ శ్లోకం, సంపూర్ణ భగవత్ ధ్యాసను సూచించటానికి చాలా బలమైన పద ప్రయోగం చేస్తున్నది.

తత్-బుద్దయః అంటే బుద్ధి భగవంతుని దిశగా నిర్దేశించబడి, అని.
తదాత్మనః అంటే హృదయము (మనస్సు,బుద్ధి) కేవలం భగవంతుని యందే నిమగ్నమవుట, అని.
తన్నిష్ఠా అంటే బుద్ధిలో భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసముండుట, అని.
తత్పరాయణాః అంటే భగవంతుడే పరమ లక్ష్యము మరియు ఆశ్రయము అని శ్రమిస్తూ, అని.

ఈ విధంగా, నిజమైన జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే అది భగవంతునిపై ప్రేమకు దారి తీస్తుంది. ఈ విధమైన ప్రేమచే భక్తులు సర్వత్రా ఆయననే దర్శిస్తారు. తదుపరి శ్లోకంలో ఇటువంటి దివ్య దృష్టి విశదీకరించబడింది.