జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి ।
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే ।। 3 ।।
జ్ఞేయః — పరిగణించవలెను; సః — అతను; నిత్య — ఎల్లప్పుడూ; సంన్యాసీ — సన్యాస దీక్షను ఆచరిస్తూ; యః — ఎవరైతే; న, ద్వేష్టి — దేనినీ ద్వేషింపక; న, కాంక్షతి — దేనినీ ఆశించక; నిర్ద్వంద్వః — అన్ని ద్వంద్వములకు అతీతంగా; హి — నిజముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; సుఖం — సునాయాసముగానే; బంధాత్ — బంధము నుండి; ప్రముచ్యతే — విముక్తి చేయబడును.
Translation
BG 5.3: దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులౌతారు.
Commentary
బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే, కర్మ యోగులు, అంతర్గతంగా అనాసక్తత/వైరాగ్యాన్ని అభ్యాసము చేస్తుంటారు. అనుకూల, ప్రతికూల ఫలితాలని రెంటినీ సమదృష్టితో, ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తారు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే అది మన క్రమానుసార ఉన్నతి కొరకు సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవింప చేస్తుంటుంది. మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ మన దరికి వచ్చే దేనినైనా సహిస్తూ, సంతోషంగా మన ధర్మ మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం సహజంగానే క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపు తీసుకువెళ్తుంది.
దీనిని వివరించటానికి ఒక చక్కటి కథ ఉంది:
ఒకప్పుడు ఒక కొయ్య ముక్క ఉండేది. అది ఒక కొయ్యబొమ్మలు చేసే శిల్పి దగ్గరికి వెళ్లి, ‘నన్ను దయచేసి అందంగా చేయవా?’ అని అడిగింది.
శిల్పి అన్నాడు, ‘నేను ఆ పనికి సిద్ధంగా ఉన్నాను. కానీ, నీవు దానికి సిద్ధమేనా?’
ఆ చెక్క అన్నది, ‘అవును, నేను కూడా సిద్ధమే.’
ఆ శిల్పి తన పనిముట్లు తీసుకుని దానిని చెక్కటం మొదలుపెట్టాడు. ఈ కొయ్య “అయ్యో, ఏం చేస్తున్నావు? దయచేసి ఆపు, చాలా నొప్పిగా ఉంది’ అని అరిచింది.
అప్పుడు ఆ శిల్పి తెలివిగా అన్నాడు, ‘నీవు అందంగా అవ్వాలనుకుంటే, నీవు బాధని సహించాలి.’
‘సరే’, అన్నది కొయ్య. ‘అయితే చెక్కండి, కానీ దయచేసి కాస్త నెమ్మదిగా, సున్నితంగా చేయండి’.
ఆ శిల్పి తన పని మళ్ళీ ప్రారంభించాడు. ఈ కొయ్య అరుస్తూనే ఉంది, ‘ఇక ఈ రోజుకు చాలు; ఇంకా సహించలేను. దయచేసి మళ్ళీ రేపు తిరిగి ప్రారంభించండి.’ అని. ఆ శిల్పి తన పని యందే శ్రద్ధతో ముందుకెళ్ళాడు, మరియు కొద్ది రోజుల్లోనే ఆ కొయ్య, గుడిలో ఉంచతగిన, ఒక అందమైన విగ్రహంగా తయారయ్యింది.
ఇదే విధముగా, అనంతమైన జన్మలలో ప్రపంచంతో మమకారం వలన మన హృదయములు మొరటుగా, మలినముతో ఉన్నాయి. మనం అంతర్గత సౌదర్యంతో ఉండాలంటే మనం బాధని సహించి, ఈ ప్రపంచాన్ని మనలని పరిశుద్దం చేసే తన పనిని చేసుకోనివ్వాలి. కాబట్టి, కర్మ యోగులు భక్తితో పని చేస్తూ, ఫలితముల పట్ల సమదృష్టితో ఉంటారు, మరియు భగవంతుని యందే తమ మనస్సుని లగ్నం చేయటానికి అభ్యాసం చేస్తుంటారు.