యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 22 ।।
యే — ఏదైతే; హి — నిజముగా; సంస్పర్శ-జాః — ఇంద్రియ వస్తు-విషయముల సంపర్కంచే జనించిన; భోగాః — భోగములు; దుఃఖా — దుఃఖములు; యోనయః — మూలము; ఏవ — నిజముగా; తే — వారు; ఆద్య-అంతవంతః — మొదలు మరియు తుది కలిగిన; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; న — ఎప్పటికీ కాదు; తేషు — వాటిలో; రమతే — రమించరు; బుధః — తెలివైనవారు.
Translation
BG 5.22: ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం (మొదలు-చివర) ఉంటాయి, కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు.
Commentary
ఇంద్రియ వస్తు-విషయ సంపర్కంచే ఇంద్రియములు సుఖానుభూతులను కలుగచేస్తాయి. మనస్సు ఒక ఆరవ ఇంద్రియము లాగా, గౌరవము, పొగడ్త, పరిస్థితులు, విజయము మొదలైన అగ్రాహ్యమైన వాటి నుండి ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఈ యొక్క శారీరక, మానసిక సుఖాలన్నిటినీ భోగాలు (భౌతిక సుఖానుభవము) అంటారు. ఇటువంటి ప్రాపంచిక భోగాలు, ఈ క్రింది కారణాల వలన ఆత్మను సంతృప్తి పరచలేవు:
ప్రాపంచిక ఆనందాలు పరిమితమైనవి, కాబట్టి ఏదో లోపించిన భావన వాటిలో అంతర్గతంగా ఉంటుంది. ఒక వ్యక్తికి లక్షాధికారి అయ్యాననే సంతోషం ఉండవచ్చు, కానీ అదే లక్షాధికారి ఒక కోటీశ్వరున్ని చూసినప్పుడు అసంతృప్తికి లోనై ఇలా అనుకుంటాడు, ‘నాకు కూడా ఒక కోటి రూపాయలు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేవాడిని.’ అని. దీనికి విరుద్ధంగా, భగవంతుని ఆనందం అనంతమైనది, కాబట్టి పరిపూర్ణ సంతృప్తిని ఇస్తుంది.
ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవి. ఒకసారి అయిపోయిన తరువాత, వ్యక్తిని మరల అసంతృప్తితో వదిలిపెడతాయి. ఉదాహరణకి ఒక తాగుబోతు, రాత్రి పూట మద్యం తాగటాన్ని ఎంజాయ్ చేయవచ్చు. కానీ మరుసటి రోజు పొద్దున్న దాని దుష్ప్రభావం, అతనికి తీవ్రమైన తలనొప్పి ఇస్తుంది. కానీ, భగవంతుని ఆనందం నిత్యమైనది, ఒకసారి పొందిన తరువాత అది ఎప్పటికీ ఉంటుంది.
ప్రాపంచిక సుఖాలు అస్థిరమైనవి మరియు త్వరితగతిన వీగిపోతాయి. జనులు ఒక గొప్ప అవార్డు పొందిన సినిమాను చూసినప్పుడు, ఏంతో ఆనందిస్తారు, కానీ అదే సినిమాని రెండవ సారి స్నేహితుడికి తోడు కోసం చూడవలసి వస్తే, ఆ ఆనందం ఉండదు. ఇంకొక స్నేహితుడు మూడో సారి చూడటానికి ఒత్తిడి చేస్తే, వారంటారు , ‘ఏదైనా శిక్ష వేయండి కానీ, మరల ఆ సినిమా చూడమని అడగవద్దు.’ అని. భౌతిక వస్తువుల నుండి కలిగే సుఖం మనం దానిని ఆనందించే కొద్దీ తగ్గిపోతుంది. ఆర్థికశాస్త్రంలో దీనిని ‘లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్’ (Law of Diminishing Returns) అంటారు. కానీ, భగవంతుని ఆనందం చైతన్యవంతమైనది; అది సత్-చిత్-ఆనందం (శాశ్వతమైన నిత్య నూతనమైన దివ్య ఆనందము). కాబట్టి, ఒక వ్యక్తి అదే భగవత్ నామాన్ని నిరంతరం రోజంతా జపిస్తూ ఉన్నా, నిత్య నూతనమైన ఆధ్యాత్మిక తృప్తిని దానిలో పొందుతాడు.
ఒక స్వస్థచిత్తంగల మనిషి, రుచికరమైన స్వీటుని అస్వాదిస్తునప్పుడు, దానిని వదిలి బురదని తినమంటే తినడు. అదేవిధంగా, ఒక వ్యక్తి దివ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని అస్వాదిస్తున్నప్పుడు, మనస్సు అన్ని భౌతిక సుఖాల యందు రుచిని కోల్పోతుంది. విచక్షణా జ్ఞానం ప్రసాదించబడిన వారు ఈ పైన చెప్పబడిన భౌతిక సుఖాల లోపాలను అవగతం చేసుకుని, తమ ఇంద్రియములను వాటినుండి నిగ్రహిస్తారు. శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో దీనిని ఉద్ఘాటిస్తున్నాడు.