సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ।
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్ ।। 4 ।।
సాంఖ్య — కర్మ సన్యాసము; యోగౌ — కర్మ యోగము; పృథక్ — వేరువేరు; బాలాః — అజ్ఞానులు; ప్రవదంతి — అంటారు; న — కాదు; పండితాః — పండితులు; ఏకం — ఒక్క దానిలో; అపి — అయినా; ఆస్థితః — స్థితులై ఉండి; సమ్యక్ — సంపూర్ణముగా; ఉభయోః — రెంటి యొక్క; విందతే — పొందుతారు; ఫలం — ఫలమును.
Translation
BG 5.4: అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము (కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము) మరియు కర్మ యోగము (భక్తితో పని చేయటము) భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చు అని యదార్థముగా తెలిసినవారు చెప్తారు.
Commentary
ఇక్కడ, శ్రీ కృష్ణుడు, 'సాంఖ్య' అన్న పదాన్ని కర్మ సన్యాసమును సూచించటానికి వాడుతున్నాడు, అంటే జ్ఞానమును పెంపొందించుకొని కర్మలను త్యజించటం అన్నమాట. సన్యాసము అనేది రెండు రకాలుగా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం, అవి: ఫాల్గు వైరాగ్యము, యుక్త వైరాగ్యము. ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి, జనులు, కష్టాలను, బాధ్యతలను వదిలిచ్చుకోవటం కోసము దానిని త్యజించటాన్ని ఫాల్గు వైరాగ్యం అంటారు. ఇటువంటి ఫాల్గు వైరాగ్యం, పలాయనవాద దృక్పథంలో ఉన్నది మరియు అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలు ఎదురైనప్పుడు, దాన్ని కూడా మరల వదిలేసి తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెట్టడానికి ఆశిస్తారు. యుక్త వైరాగ్యంలో, జనులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుని శక్తిగా చూస్తారు. వారికి ఉన్న దానిని వారికి చెందినదిగా పరిగణించరు మరియు తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించరు. బదులుగా, దేవుడు తమకు ఇచ్చిన దానితో ఆ భగవంతుని సేవ చేయటానికే ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యము స్థిరమైనది మరియు కష్టాలకు చలించనిది.
కర్మ యోగులు బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే, యుక్త వైరాగ్య భావాలు (స్థిరమైన వైరాగ్యం) పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులగా మరియు భగవంతుడిని భోక్తగా పరిగణిస్తారు; అందుకే ప్రతీదీ భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నామనే భావనలో స్థితులౌతారు. ఈ విధంగా, వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ భగవత్ ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో సమానంగా ఉంటుంది. బాహ్యంగా వారు ప్రాపంచిక మనుష్యుల లాగ కనిపించినా అంతర్గతంగా సన్యాసుల కు ఏమాత్రం తీసిపోరు.
పురాణములు మరియు ఇతిహాసములు భారత చరిత్రలలో మహోన్నతమైన రాజుల గురించి చెపుతూ, బాహ్యంగా వారు రాజ ధర్మాలను నిక్ఖచ్చిగా నిర్వర్తిస్తూనే రాజ విలాసాలలో నివసిస్తున్నా, వారు మానసికంగా పూర్తిగా భగవత్ భావన లోనే స్థితులై ఉన్నారని పేర్కొన్నాయి. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథువు, విభీషణుడు, యుధిష్ఠిరుడు మొదలగువారంతా అత్యుత్తమ కర్మ యోగులే. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటున్నది:
గృహీత్వాపీంద్రియైరర్థాన్ యో న ద్వేష్టి న హృష్యతి
విష్ణోర్మాయామిదం పశ్యన్ స వై భాగవతోత్తమః (11.2.48)
‘ఇంద్రియ వస్తు విషయములను, వాటి కోసం ప్రాకులాడకుండా మరియు వాటి నుండి పారిపోకుండా, భగవత్ దృక్పథంతో, సమస్తము భగవంతుని శక్తి స్వరూపమే, అన్ని ఆయన సేవకే, అన్న దృక్పథంలో స్వీకరించే వాడు అత్యున్నత భక్తుడు.’ ఈ విధంగా, కర్మ యోగికి, కర్మ సన్యాసికి మధ్య, నిజమైన జ్ఞానికి, తేడా ఏమీ కనపడదు. వీటిలో ఏ ఒక్కటి పాటించినా, ఈ రెంటి యొక్క ఫలితములు లభించును.