Bhagavad Gita: Chapter 15, Verse 19

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ।। 19 ।।

యః — ఎవరైతే; మాం — నన్ను; ఏవం — ఈ విధముగా; అసమ్మూఢః — సంశయము లేకుండా; జానాతి — తెలుసుకుని; పురుష-ఉత్తమమ్ — సర్వోత్కృష్ట దివ్య పురుషుడు; సః — వారు; సర్వ-విత్ — సంపూర్ణ జ్ఞానము కలవారు; భజతి — పూజిస్తారు; మాం — నన్ను; సర్వ-భావేన — సంపూర్ణముగా/మనఃస్ఫూర్తిగా; భారత — అర్జునా, భరత వంశీయుడా.

Translation

BG 15.19: ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.

Commentary

శ్రీమద్ భాగవతం ప్రకారం భగవంతుడిని మూడు రకాలుగా తెలుసుకోవచ్చును:

వదంతి తత్ తత్త్వ-విదస్ తత్త్వం యజ్ జ్ఞానం అద్వయమ్
బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్ద్యతే (1.2.11)

‘సర్వోన్నత తత్త్వము ఒక్కటే, అది జగత్తులో, బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు, అనే మూడు విధములుగా వ్యక్తమవుతుంది అని, పరమ సత్యమును ఎరింగిన వారు చెప్పారు.’ ఇవి మూడు వేర్వేరు అస్తిత్వములు కావు, ఒకే సర్వోన్నత తత్త్వము యొక్క మూడు స్వరూపాలు. ఉదాహరణకి, నీరు, మంచు, మరియు నీటిఆవిరి మూడు విభిన్న పదార్థములగా అగుపిస్తాయి, కానీ అవి ఒకే పదార్థము యొక్క మూడు విభిన్న రూపాలు. అదేవిధంగా, బ్రహ్మన్ అంటే, భగవంతుని యొక్క నిరాకార, సర్వ వ్యాప్త అస్తిత్వము. జ్ఞాన యోగమును అనుసరించే వారు, భగవంతుని యొక్క బ్రహ్మన్ అస్తిత్వాన్ని ఆరాధిస్తారు. పరమాత్మ అంటే, సమస్త ప్రాణుల హృదయములో స్థితమై ఉన్న ఆ సర్వోన్నత తత్త్వము యొక్క అస్తిత్వము. అష్టాంగ యోగ మార్గము, దేవుని యొక్క పరమాత్మ రూపమును దర్శింపచేస్తుంది. భగవానుడు అంటే, పరమేశ్వరుని యొక్క సాకర రూపము మరియు ఆ రూపంలో ఆయన ఎన్నో మధురమైన లీలలను చేస్తాడు. భక్తి మార్గము మనకు, ఈశ్వరుడిని భగవానుని రూపంలో భగవత్ ప్రాప్తి కలిగిస్తుంది. ఇదే విషయము ఇంతకు పూర్వము 12.2వ శ్లోకములో వివరించబడినది.

ఈ అధ్యాయములో, 12వ శ్లోకము మొదలు, శ్రీ కృష్ణుడు ఈ అన్నీ మూడు భగవత్ తత్త్వములనూ వివరించాడు. 12 నుండి 14 శ్లోకముల వరకు సర్వ వ్యాప్తి అయిన బ్రహ్మన్ లక్షణం వివరించబడినది, 15వ శ్లోకం పరమాత్మ తత్త్వాన్ని, మరియు 17, 18వ శ్లోకాలు భగవానుని గురించి పేర్కొన్నాయి. మరిప్పుడు, వీటిలో ఏది అన్నింటికన్నా ఉన్నతమైనది మరియు పరిపూర్ణమైనది? ఈ ప్రశ్నకు ఆయన సమాధానం ఇక్కడ ఇస్తున్నాడు - తనను భక్తి ద్వారా భగవానునిగా, సర్వోన్నత దివ్య పురుషోత్తమునిగా, తెలుసుకున్నవారు, యదార్థముగా ఆయన పట్ల పూర్తి జ్ఞానముతో ఉన్నట్టు. భగవానుని రూపంలో తెలుసుకొనటం ఎందుకు సర్వోన్నతమైనదో , జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ తన భక్తి శతకంలో విస్తారంగా వివరించారు. పైన చెప్పబడిన శ్రీమద్ భాగవతంలోని శ్లోకాన్ని ఉదహరిస్తూ ఇలా ప్రారంభించారు.

తీన రూప్ శ్రీకృష్ణ కో, వేదవ్యాస్ బతాయ,
బ్రహ్మ ఔర పరమాత్మా, అరు భగవాన్ కహాయ

(భక్తి శతకము, 21వ శ్లోకం)

‘ఈశ్వరుడు మూడు రకాలుగా ప్రకటితమౌతాడు అని వేద వ్యాసుల వారు పేర్కొన్నారు — బ్రహ్మన్, పరమాత్మ, మరియు భగవానుడు.’ ఆ తరువాత పరమ సత్యము యొక్క ఈ మూడు అస్తిత్వములను వివరించారు.

సర్వశక్తి సంపన్న్ హో, శక్తి వికాస న హోయ,
సత్ చిత్ ఆనంద రూప్ జో, బ్రహ్మ కహావే సోయ

(భక్తి శతకము, 22వ శ్లోకం)

‘బ్రహ్మన్ అస్తిత్వంలో, ఈశ్వరుని యొక్క అనంతమైన శక్తులు గుప్తముగా ఉంటాయి. ఆయన కేవలం నిత్య జ్ఞానమును మరియు ఆనందమును ప్రదర్శిస్తాడు.’

సర్వ శక్తి సంయుక్త హో, నామ రూప్ గుణ హోయ
లీలా పరికర రహిత్ హో, పరమాత్మా హై సోయ

(భక్తి శతకము, 23వ శ్లోకం)

‘పరమాత్మ అస్తిత్వంలో ఈశ్వరుడు తన రూపమును, నామమును, మరియు గుణమును చూపిస్తాడు. కానీ, లీలలను ప్రదర్శించడు, ఇంకా, పరివారమును కలిగి ఉండడు.’

సర్వ శక్తి ప్రాకట్య హో, లీలా వివిధ ప్రకార,
విహరత పరికర సంగ్ జో, తేహి భగవాన్ పుకార

(భక్తి శతకము, 24వ శ్లోకం)

‘తన సర్వ శక్తులను ప్రకటితం చేస్తూ, మరియు, భక్తులతో ఎన్నెన్నో మధురమైన లీలలను చేస్తూ, ఉండే ఈశ్వరుని అస్తిత్వమే భగవానుడు.’ జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారి ఈ శ్లోకాలు, బ్రహ్మన్ మరియు పరమాత్మ అస్తిత్వములలో ఈశ్వరుడు తన సర్వ శక్తులను ప్రకటించడు అని స్పష్టంగా చెప్తున్నాయి. ఈశ్వరుడు భగవానుడి రూపములో సంపూర్ణముగా ఉంటాడు, దానిలో తన యొక్క - నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు మరియు పరివారము అన్నింటినీ ప్రకటిస్తాడు. (ఇది కూడా 12.2వ శ్లోకములో ఒక రైలు ఉదాహరణ ద్వారా వివరించబడినది) అందుకే, ఆయనను భగవానుని లా తెలుసుకున్నవారు యదార్థముగా సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నట్టు.