యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ।। 12 ।।
యత్ — ఏదైతే; ఆదిత్య-గతం — సూర్యునిలో; తేజః — తేజస్సు; జగత్ — సౌర కుటుంబము; భాసయతే — ప్రకాశింపచేయునో; అఖిలమ్ — సమస్త; యత్ — ఏదైతే; చంద్రమసి — చంద్రునిలో; యత్ — ఏదైతే; చ — మరియు; అగ్నౌ — అగ్నిలో; తత్ — అది; తేజః — తేజస్సు; విద్ధి — తెలుసుకొనుము; మామకమ్ — నా యొక్క.
Translation
BG 15.12: సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము.
Commentary
మన మానవ నైజం ఎలాంటిదంటే మనకు ఏది ప్రముఖమైనది అని అనిపిస్తుందో దాని పట్ల ఆకర్షితమవుతాము. శరీరము, భార్య/భర్త, పిల్లలు, మరియు సంపద అనేవి ముఖ్యము అనుకున్నప్పుడు, మనం వాటి పట్ల ఆకర్షితమౌతాము. ఈ శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు, తన శక్తియే సృష్టిలో ఉన్న అన్ని ప్రముఖమైన వాటిలో వ్యక్తమవుతున్నది అని వివరిస్తున్నాడు. సూర్యుని యొక్క తేజస్సుకి తానే మూలకారణము అని అంటున్నాడు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రతి క్షణానికి, సూర్యుడు, కొన్ని కోట్ల అణు విద్యుత్ కేంద్రాలు జనింపచేసే శక్తికి సమానమైన శక్తిని విడుదల చేస్తున్నది. ఈ ప్రకారంగా అది కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుండి ఇలా చేస్తూనే ఉన్నది, అయినా అది ఏమాత్రం తరిగిపోలేదు మరియు దాని వ్యవస్థ లో ఏ లోపమూ రాలేదు. ఇటువంటి మహాద్భుతమైన ఖగోళ వస్తువైన సూర్యుడు ఏదో యాదృచ్ఛికంగా, బిగ్ బాంగ్ మహా విస్ఫోటం (big bang) వలన వచ్చింది అనుకోవటం అమాయకత్వమే అవుతుంది. సూర్యుడు ఈ విధంగా ఇలా ఉన్నాడు అంటే దానికి కారణం భగవంతుని మహిమనే.
అదే విధముగా చంద్రుడు కూడా రాత్రి పూట ఆకాశమును వెలిగిస్తూ ఒక అద్భుతమైన పని చేస్తుంటాడు. లౌకిక బుద్ధి ద్వారా, చంద్రుని కాంతి కేవలం సూర్యుని కాంతిని పరావర్తనం చేయటం వలన వస్తున్నదని అని ఈ కాలం సైన్సు ప్రకారం చెప్పవచ్చు. కానీ, ఈ యొక్క మహాద్భుతమైన వ్యవస్థ భగవంతుని మహిమ వల్లే సాధ్యమవుతున్నది; ఇంకా చెప్పాలంటే, చంద్రుడు భగవంతుని యొక్క ఎన్నెన్నో విభూతులలో ఒకటి.
ఈ సందర్భంలో కేనోపనిషత్తులో ఒక కథ ఉన్నది:
ఒకప్పుడు దేవతలకు, దైత్యులకు దీర్ఘకాలం యుద్ధం జరిగింది; దానిలో చివరకు దేవతలే విజయం సాధించారు. కానీ వారి విజయం గర్వానికి దారి తీసింది, వారు తమ శక్తిసామర్థ్యముల వల్లనే ఈ విజయం సాధించాము అని అనుకున్నారు. వారి గర్వ-భంగము చేయటానికి భగవంతుడు ఒక యక్షుడి రూపంలో వచ్చి స్వర్గ-ఆకాశంలో స్థితమై నిలబడ్డాడు. ఆయన రూపము అత్యంత తెజోవంతముగా ఉంది.
దేవరాజు ఇంద్రుడు అతన్ని మొదట గమనించి, కేవలం ఒక యక్షుడు తన కన్నా తేజోవంతముగా ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇంద్రుడు అగ్ని దేవుడిని, ఆయనెవరో తెలుసుకు రమ్మని పంపించాడు. అగ్ని దేవుడు ఆ యక్షుడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు , ‘నేను అగ్ని దేవుడను, నాకు సమస్త జగత్తుని ఒక్క క్షణంలో కాల్చివేసే శక్తి ఉన్నది, ఇప్పుడిక దయచేసి నీవెవరో తెలియ చెప్పవలసినది’ అని.
యక్షుడి రూపంలో ఉన్న భగవంతుడు, ఒక గడ్డి పరకను ఆయన ముందు ఉంచి, ‘దయచేసి దీనిని కాల్చుము’ అన్నాడు.
దాన్ని చూసి అగ్ని దేవుడు బిగ్గరగా నవ్వి, ‘ఈ అల్పమైన గడ్డిపరక నా అనంతమైన శక్తి ముందు నిలుస్తుందా?’ అన్నాడు. కానీ, అగ్ని దేవుడు దీనిని భస్మం చేయటానికి సిద్ధమైనప్పుడు, భగవంతుడు ఆయన లోనుండి శక్తిమూలమును ఆర్పివేసాడు. పాపం అగ్ని దేవుడు తానే చలితో వణకటం ప్రారంభించాడు; ఇక వేరొకదాన్ని కాల్చివేసే అవకాశం ఏది? ఇవ్వబడిన పనిని చేయటంలో విఫలమై సిగ్గుపడుతూ, అగ్ని దేవుడు మళ్లీ ఇంద్రుని వద్దకు వెళ్ళిపోయాడు.
ఆ తరువాత ఇంద్రుడు, ఆ యక్షుడు ఎవరో, ఆయన గురించి తెలుసుకొనిరమ్మని వాయు-దేవుడిని పంపించాడు. వాయు-దేవుడు వెళ్లి యక్షుడితో, ‘నేను వాయు-దేవుడను, నేను తలుచుకుంటే ఈ ప్రపంచాన్నంతా ఒక్క క్షణంలో తలక్రిందులు చేయగలను, ఇప్పుడు దయచేసి నీవెవరో తెలియచేయుము’ అని అన్నాడు.
మరల ఆ యక్షుడి రూపంలో ఉన్న భగవంతుడు, ఒక గడ్డి పరకను ఆయన ముందు ఉంచి, ‘దయచేసి దీనిని త్రిప్పివేయుము.’ అని అడిగాడు.
ఆ గడ్డి పరకను చూసి వాయుదేవుడు నవ్వాడు. అత్యంత వేగంతో దానివైపుకు దూసుకెళ్ళాడు కానీ, భగవంతుడు ఆయన మూలశక్తిని కూడా లోనుండి ఆర్పివేసాడు. పాపం ఆ వాయుదేవుడు తన కాళ్లను ఈడ్చుకుంటూ నడవటానికి కూడా కష్టపడాల్సి వచ్చింది; మరిక ఇంకొక దాన్ని ఎగరగోట్టే ప్రశ్నెక్కడుంది?
చివరికి ఇంద్రుడే స్వయముగా ఆ యక్షుడేవరో తెలుసుకోవటానికి వెళ్ళాడు, కానీ, ఇంద్రుడు రాగానే భగవంతుడు అంతర్ధానమయ్యాడు, ఆయన స్థానంలో ఆయన దివ్య యోగమాయా శక్తి, ఉమ, కూర్చుని ఉంది. ఆ యక్షుడి గురించి ఇంద్రుడు ఆమెను అడిగినప్పుడు, ఉమ, ఇలా సమాధానమిచ్చింది, ‘ఆయన మీ యొక్క సర్వోన్నత తండ్రిగారు, ఆయన నుండే మీ దేవతలందరూ మీ యొక్క శక్తి సామర్థ్యములను పొంది ఉన్నారు. మీ గర్వమును పోగొట్టడానికే ఆయన అలా రావటం జరిగింది.’ అని.