న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 6 ।।
న — కాదు; తత్ — అది; భాసయతే — ప్రకాశింపచేయును; సూర్యో — సూర్యుడు; న శశాంకో — చంద్రుడు కూడా కాదు; న పావకః — అగ్ని కూడా కాదు; యత్ — ఎక్కడికైతే; గత్వా — వెళ్లిన పిదప; న నివర్తంతే — తిరిగి రారో; తత్-ధామ — ఆ ధామము; పరమం — సర్వోన్నతమైనది; మమ — నాది.
Translation
BG 15.6: సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.
Commentary
ఇక్కడ, శ్రీ కృష్ణుడు దివ్య లోక స్వభావాన్ని సంక్షిప్తముగా వివరిస్తున్నాడు. దానిని ప్రకాశింపచేయటానికి, సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని అవసరం లేదు, ఎందుకంటే అది సహజంగానే స్వయంప్రకాశితము. భౌతిక జగత్తు అనేది భౌతిక శక్తి, మాయ ద్వారా తయారుచేయబడినది కానీ, దివ్య లోకము ఆధ్యాత్మిక శక్తి యోగమాయచే తయారు చేయబడినది. అది భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములు మరియు దోషములకు అతీతమైనది మరియు సంపూర్ణ దోషరహితమైన ప్రదేశము. అది సత్-చిత్-ఆనందము, అంటే, అమరత్వము, జ్ఞానము, మరియు ఆనందముతో పూర్ణముగా నిండి ఉంటుంది.
దివ్య లోకము, పరవ్యోమము అనే ఆధ్యాత్మిక ఆకాశమును కలిగిఉంటుంది. దానిలో, దైవీ ఐశ్వర్యములు, అద్భుతములతో నిండిన ఎన్నెన్నో ధామములు ఉంటాయి. సమస్త నిత్య సనాతన భగవత్ స్వరూపములైన, కృష్ణుడు, రాముడు, నారాయణుడు వంటి వారు వారి వారి ధామములను ఆ ఆధ్యాత్మిక ఆకాశములో కలిగిఉంటారు. అక్కడ వారు నిత్య శాశ్వతముగా తమ భక్తులతో నివసిస్తూ తమ దివ్య లీలలలో వారితో గడుపుతూ ఉంటారు. బ్రహ్మదేవుడు తన శ్రీ కృష్ణుడి ప్రార్థనలో ఇలా పేర్కొన్నాడు:
గోలోక-నామ్ని నిజ-ధామ్ని తలే చ తస్య
దేవీ మహేశ-హరి-ధామసు తేషు తేషు
తే తే ప్రభావ-నిచయా విహితాశ్చ యేన
గోవిందం ఆది-పురుషం తం అహం భజామి
(బ్రహ్మ సంహిత, 43వ శ్లోకము)
‘ఆధ్యాత్మిక ఆకాశములో గోలోకము ఉంది, ఇది శ్రీ కృష్ణుడి యొక్క తనదైన స్వధామము. ఆ ఆధ్యాత్మిక ఆకాశము లో నారాయణుడు, శివుడు, దుర్గా మాత మొదలైన వారి ధామములు కూడా ఉంటాయి. ఎవరి (విభూతి) ఐశ్వర్యముచే ఇది అంతా సాధ్యమై నిలుస్తున్నదో, ఆ సర్వోత్కృష్ట దివ్య భగవానుడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను.’ శ్రీ కృష్ణుడి ధామమైన గోలోకము గురించి బ్రహ్మ ఇంకా ఇలా చెప్తున్నాడు:
ఆనంద-చిన్మయ-రస-ప్రతిభావితాభిస్
తాభిర్ య ఏవ నిజ-రూపతయా-కలాభి:
గోలోక ఏవ నివసతి అఖిలాత్మ-భూతో
గోవిందం ఆది-పురుషం తం అహం భజామి
(బ్రహ్మ సంహిత, 37వ శ్లోకము)
‘సర్వోత్కృష్ట దివ్య భగవానుడైన గోవిందుడిని నేను పూజిస్తాను, ఆయన గోలోకములో తన నిజస్వరూపమే అయిన రాధతో కలిసి నివసిస్తుంటాడు. వారి నిత్య పరివారము, సఖి గణము, నిత్య-ఆనంద ఆధ్యాత్మిక శక్తిచే ప్రేరణ పొందుతూ ఉంటారు, వారు అరవై నాలుగు కళల మూర్తీభవించిన స్వరూపములు.’ భగవత్-ప్రాప్తి నొందిన భక్తులు, ఆయన యొక్క పరంధామమునకు చేరుకుని, ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణతతో నిండిపోయిన దివ్య లీలలలో పాలుపంచుకుంటారు. అక్కడకు చేరుకున్న జీవులు, ఈ జనన-మరణ సంసారమును దాటిపోతారు అని శ్రీ కృష్ణుడు, అర్జునుడికి హామీ ఇస్తున్నాడు.