అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।
అధశ్చమూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే ।। 2 ।।
అధః — క్రిందికి; చ — మరియు; ఊర్ధ్వం — పైకి; ప్రసృతాః — విస్తరించి; తస్య — దాని యొక్క; శాఖా — కొమ్మలు; గుణ — ప్రకృతి గుణములు; ప్రవృద్ధాః — పోషించబడి; విషయ — ఇంద్రియ విషయములు; ప్రవాలాః — చిగుర్లు ; అధః — క్రిందికి; చ — మరియు; మూలాని — వేర్లు; అనుసంతతాని — పెరుగుతూనే ఉంటాయి; కర్మ — కర్మలు; అనుబంధీని — బంధించివేయును; మనుష్య-లోకే — మానవ లోకములో.
Translation
BG 15.2: త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి, ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి. క్రిందిన, దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.
Commentary
భౌతిక జగత్తుని అశ్వత్థ వృక్షముతో పోల్చటాన్ని శ్రీ కృష్ణుడు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. చెట్టు యొక్క ప్రధాన మొండెము, ఆత్మ తన కర్మలు చేసేటువంటి మానవ స్వరూపము. వృక్షము యొక్క శాఖలు క్రిందికి (అధః) మరియు పైకి (ఊర్ధ్వ) కూడా విస్తరించి ఉంటాయి. ఒకవేళ ఆత్మ పాపిష్టి పనులు చేస్తే అది జంతువులలో లేదా నరకలోకాలలో పుడుతుంది. ఇవి క్రిందికి ఉండే శాఖలు. ఒకవేళ ఆత్మ పుణ్య కార్యములు చేస్తే అది స్వర్గ లోకాలలో గంధర్వుడిలాగా, దేవత లాగా, లేదా మరేదైనా జీవిలా పుడుతుంది. ఇవి పైకి ఉన్న శాఖలు.
ఒక వృక్షము నీటితో పోషింపబడ్డట్టుగా, ఈ భౌతిక ఆస్థిత్వపు జగత్తు ప్రకృతి త్రిగుణములచే పోషించబడుతుంది. ఈ త్రిగుణములు ఇంద్రియ వస్తువిషయములను సృష్టిస్తాయి, అవి వృక్షమునకు చిగుర్లవంటివి (విషయ-ప్రవాలాః). చిగుర్ల యొక్క ప్రయోజనం ఏమిటంటే, అవి అంకురించి మరింత విస్తరిస్తాయి. ఈ అశ్వత్థ వృక్షము మీద చిగుళ్లు మొలకెత్తి, భౌతిక వాంఛలను కలుగ చేస్తాయి, అవి చెట్టు ఊడల వంటివి. రావి (మఱ్ఱి) చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే అవి శాఖలనుండి ఊడలను నేల వద్దకు పంపిస్తాయి. దీనితో, ఊడలు ద్వితీయ స్థాయి బోదెలుగా మారతాయి; దీనితో ఆ రావి చెట్టు విస్తరించి చాలా విశాలంగా పెరుగుతుంది. మనకు తెలిసిన అతిపెద్ద మఱ్ఱి చెట్టు, కొలకత్తా లోని బొటానికల్ గార్డెన్ లోని “ది గ్రేట్ బన్యన్” (The Great Banyan). ఈ చెట్టు విస్తరించిన వైశాల్యం సుమారుగా నాలుగు ఎకరాలు. చెట్టు యొక్క ప్రధాన ఉపరితల భాగం (crown of the tree) చుట్టుకొలత సుమారుగా 485 మీటర్లు, మరియు దానికి సుమారుగా 3700 ఊడలు, నేలను తాకినవి ఉన్నాయి. అదే విధంగా, అశ్వత్థ వృక్షము యొక్క ఉపమానంలో, భౌతిక జగత్తులో ఇంద్రియ వస్తువిషయములు చెట్టుకు ఉన్న చిగుళ్లు. అవి అంకురించి, వ్యక్తిలో ఇంద్రియ భోగముల పట్ల కోరికలను జనింపచేస్తాయి. ఈ కోరికలు ఆ వృక్షము యొక్క ఊడల వంటివి. అవి ఈ చెట్టు పెరుగుతూనే ఉండటానికి పోషకములను ఇస్తుంటాయి. భౌతిక భోగముల పట్ల కోరికలచే ప్రేరేపించబడి జీవ ప్రాణి కర్మలను చేస్తుంది. కానీ, ఇంద్రియ వాంఛలు ఎన్నటికీ తీరవు; పైగా వాటిని సంతృప్తి పరచాలని చూసే కొద్దీ, అవి మరింత పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి కోరికలను తీర్చుకోవటానికి చేసే కర్మలు, వాటిని మరింత పెంచుకోవటానికి మాత్రమే దోహద పడతాయి. ఈ విధంగా, ఈ ఉపమానముగా చెప్పబడిన వృక్షము యొక్క ఊడలు పరిమాణంలో, సంఖ్యలో అలా అంతులేకుండా పెరుగుతూనే ఉంటాయి. ఈ విధంగా అవి జీవాత్మను మరింత భౌతిక దృక్పథం లోనే కట్టివేస్తాయి.