Bhagavad Gita: Chapter 8, Verse 1-2

అర్జున ఉవాచ ।
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ।
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ।। 1 ।।
అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన ।
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ।। 2 ।।

అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; కిం — ఏమిటి?; తత్ — అది; బ్రహ్మ — బ్రహ్మన్; కిం — ఏమిటి? అధ్యాత్మం — జీవాత్మ; కిం — ఏమిటి? కర్మ — కర్మ సిద్ధాంతము; పురుష-ఉత్తమ — శ్రీ కృష్ణ, సర్వోత్కృష్ట పరమ పురుషుడు; అధిభూతం — కనిపించే భౌతిక జగత్తు; చ — మరియు; కిం — ఏమిటి? ప్రోక్తం — చెప్పబడును; అధిదైవం — దేవతల ప్రభువు; కిం — ఏమిటి? ఉచ్యతే — అనబడును? అధియజ్ఞ — సమస్త యజ్ఞముల యజమాని; కథం — ఏ విధంగా?; కః — ఎవరు? అత్ర — ఇక్కడ; దేహే — శరీరంలో; అస్మిన్ — ఇది; మధుసూదన — శ్రీ కృష్ణ, మధు అనే రాక్షసుడిని సంహరించినవాడా; ప్రయాణ-కాలే — మరణ సమయంలో; చ — మరియు; కథం — ఎలా; జ్ఞేయః — తెలుసుకోబడును; అసి — నీవు; నియత-ఆత్మభిః — దృఢ సంకల్పముతో ఉన్న వారిచే.

Translation

BG 8.1-2: అర్జునుడు పలికెను: ఓ పరమేశ్వరా, బ్రహ్మన్ (పరమ సత్యము) అనగా ఏమిటి? అధ్యాత్మము (ఆత్మ) అనగా ఏమిటి?, మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? మరియు ఎవరిని అధిదైవము అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణా, దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియుట ఎలా సాధ్యము?

Commentary

7వ అధ్యాయం ముగింపులో, శ్రీ కృష్ణుడు బ్రహ్మన్, అధిభూత, అధ్యాత్మ, అధిదైవ మరియు అధియజ్ఞ అన్న పదాలను పరిచయం చేసాడు. అర్జునుడికి వీటి గురించి ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, అందుకే ఈ రెండు శ్లోకాలలో ఏడు ప్రశ్నలను సంధించాడు. వీటిలో ఆరు ప్రశ్నలు శ్రీ కృష్ణుడు పలికిన పదాల గురించే. ఏడవ ప్రశ్న మరణ సమయం గురించి. శ్రీ కృష్ణుడు తానే ఈ విషయాన్ని 7.30వ శ్లోకంలో ప్రస్తావించాడు. ఇక ఇప్పుడు అర్జునుడు, మరణ సమయంలో భగవంతుడిని ఎలాగుర్తుంచుకుని స్మరించాలో తెలుసుకోగోరుతున్నాడు.