అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ ।
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 21 ।।
అవ్యక్తః — అవ్యక్తము; అక్షరః — నిత్యమైనది (నాశములేనిది); ఇతి — ఈ విధముగా; ఉక్తః — అనబడుతుంది; తం — అది; ఆహుః — చెప్పబడును; పరమాం — సర్వోత్కృష్టమైన; గతిమ్ — గమ్యము; యం — ఏదైతే; ప్రాప్య — చేరుకున్న పిదప; న, నివర్తంతే — తిరిగి రారు; తత్ — అది; ధామ — ధామము (నివాసము); పరమం — సర్వోత్కృష్టమైన; మమ — నా యొక్క.
Translation
BG 8.21: ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము, మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక (మర్త్య) లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము.
Commentary
ఆధ్యాత్మిక లోకంలోని దివ్య ఆకాశాన్నే పరవ్యోమము అంటారు. భగవంతుని వేర్వేరు స్వరూపముల యొక్క శాశ్వతమైన దివ్య ధామములు అక్కడ ఉంటాయి. ఉదాహరణకి : గోలోకము (శ్రీ కృష్ణుని ధామము), సాకేత లోకము (శ్రీ రామచంద్రుని ధామము), వైకుంఠ లోకము (నారాయణుని ధామము), శివ లోకము (సదాశివుని లోకము), దేవీ లోకము (దుర్గా మాత ధామము), మొదలగునవి. ఈ లోకాల్లో, సర్వేశ్వరుడు తన దివ్య మంగళ స్వరూపముతో, తన నిత్య పరివారముతో నిత్యమూ నివసిస్తుంటాడు. ఈ యొక్క భగవంతుని స్వరూపాలన్నీ ఒకదానికి ఒకటి అభేదములే; ఇవి అన్నీ ఒకే భగవంతుని వేర్వేరు రూపములు మాత్రమే. ఏ రూపాన్ని ఆరాధిస్తే, భగవత్ ప్రాప్తి పొందిన తరువాత, ఆ భగవత్ స్వరూపము యొక్క ధామానికి చేరుకుంటారు. దివ్య శరీరము తీసుకున్న తరువాత, ఆత్మ, భగవంతుని దివ్య కార్యకలాపాలలో, దివ్య లీలలలో ఇక శాశ్వతంగా (నిత్యమూ) పాలుపంచుకుంటుంది.