Bhagavad Gita: Chapter 8, Verse 15

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ ।
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిమ్ పరమాం గతాః ।। 15 ।।

మామ్ — నన్ను; ఉపేత్య — పొందిన తరువాత; పునః — మళ్లీ; జన్మ — పుట్టుక; దుఃఖ-ఆలయమ్ — ఈ దుఃఖములకు నిలయము లో; అశాశ్వతమ్ — తాత్కాలికమైన; న — ఉండదు; ఆప్నువంతి — పొందిన; మహా-ఆత్మానః — మహాత్ములు; సంసిద్ధిమ్ — పరిపూర్ణత; పరమాం — సర్వోత్కృష్టమైనది; గతాః — సాధించి.

Translation

BG 8.15: నన్ను పొందిన పిదప, మహాత్ములకు, ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు, ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు.

Commentary

భగవత్ ప్రాప్తి పొందితే వచ్చే ఫలితం ఏమిటి? భగవత్ ప్రాప్తిని పొందిన వారు ఈ జనన-మరణ చక్రం నుండి విడుదల పొంది, భగవంతుని దివ్య ధామమునకు చేరుకుంటారు. ఈ విధంగా వారు, తిరిగి, దుఃఖములకు నిలయమైన ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవలసిన అవసరం లేదు. పుట్టేటప్పుడు, నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఎంతో బాధా కరమైన స్థితిని అనుభవిస్తాము. తదుపరి పసి బిడ్డలుగా, మనకున్న అవసరాలను మనం వ్యక్త పరచలేకుండా ఉండి, ఏడుస్తాము. యుక్తవయస్సులో శారీరక అవసరాల కోసం తంటాలుపడాల్సి వస్తుంది, దీనితో మానసిక క్షోభ అనుభవిస్తాము. వైవాహిక జీవితంలో దాంపత్య భాగస్వామి యొక్క విలక్షణస్వభావాలని భరించాలి. ముసలితనం చేరుకున్నప్పుడు, శారీరక దౌర్భల్యములను అనుభవించాలి. జీవితం మొత్తం - మన స్వంత శరీరము-మనస్సుల నుండి జనించే బాధలు, ఇతరుల ప్రవర్తన, ప్రతికూల పరిస్థితుల - నుండి జనించే కష్టాలను అనుభవించాలి. చివరికి, మన మృత్యు కాలంలో పడే యాతనని కూడా అనుభవించాలి.

ఈ మొత్తం దురవస్థ అర్థరహితమేమీ కాదు; భగవంతుని బృహత్పథకంలో దీనికి ఒక ప్రయోజనం ఉంది. భౌతిక ప్రపంచమే మన శాశ్వత స్థానం కాదు అన్న విషయాన్ని బోధపరుస్తాయి. అది భగవంతునికి విముఖమై ఉన్న మనలాంటి జీవాత్మలను సంస్కరించే ప్రదేశం వంటిది. ఇక్కడ మనం దుఃఖం అనుభవించక పొతే, భగవంతునికై అభిలాషను ఎన్నటికీ పెంపొందించుకోలేము. ఉదాహరణకి, మనం నిప్పులో చెయ్యి పెడితే రెండు పరిణామాలు జరుగుతాయి - చర్మం కాలిపోవటం ప్రారంభమౌతుంది మరియు నాడీ వ్యవస్థ, మండే యాతన యొక్క అనుభూతిని మెదడులో కలుగచేస్తుంది. చర్మం కాలిపోవటం మంచిదికాదు, కానీ ఆ బాధ యొక్క అనుభూతి మంచిదే. మనం ఈ బాధను అనుభవించకపొతే మనం చేతిని మంట నుండి వెనక్కు తీయము, దీనితో అది మరింత ఎక్కువ చెడిపోతుంది. నొప్పి/బాధ అనేది ఏదో తప్పు జరుగుతున్నది, దానిని సరిదిద్దాలి - అన్న దానికి సూచకం. అదే విధంగా, భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే బాధ - మన అంతఃకరణ లోపభూయిష్టంగా ఉంది మరియు మనకు భౌతిక దృక్పథం నుండి భగవంతునితో ఏకత్వం దిశగా పురోగతి అవసరం - అన్న విషయాన్ని సూచిస్తున్నది.

చిట్టచివరికి, మన పరిశ్రమతో మనం దేనికైతే అర్హత సంపాదించామో, అదే మనకు లభిస్తుంది. ఎవరైతే భగవంతునికి వ్యతిరేక దిశలో ఉండిపోతారో వారు ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు; అదే సమయంలో, ఎవరైతే భగవంతుని పట్ల అనన్య భక్తిని సాధిస్తారో వారు ఆయన దివ్య ధామాన్ని చేరుకుంటారు.