యదక్షరం వేదవిదో వదంతి
విశంతి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ।। 11 ।।
యత్ — ఏదైతే; అక్షరం — వినాశము చెందనిది; వేద-విదః — వేద పండితులు; వదంతి — వివరిస్తారు; విశంతి — ప్రవేశిస్తారు; యత్ — ఏదైతే; యతయః — గొప్ప ఋషులు; వీత-రాగాః — మమకార-ఆసక్తి లేకుండా; యత్ — ఏదైతే; ఇచ్చంతః — కోరుతూ; బ్రహ్మచర్యః — బ్రహ్మచర్యము; చరంతి — ఆచరిస్తారు; తత్ — అది; తే — నీకు; పదం — లక్ష్యము; సంగ్రహేణ — క్లుప్తంగా; ప్రవక్ష్యే — నేను వివరిస్తాను.
Translation
BG 8.11: వేద పండితులు ఆయనను నాశము (క్షయము) చెందని వాడు అని చెప్తారు; ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తముగా విశదపరుస్తాను.
Commentary
వేదములలో భగవంతుడు ఎన్నో పేర్లతో పిలవబడ్డాడు. వాటిలో కొన్ని: సత్, అవ్యాకృత్, ప్రాణ్, ఇంద్ర, దేవ, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, మరియు పురుష్. ఎన్నో చోట్ల, భగవంతుని నిరాకార తత్త్వాన్ని సూచించేటప్పుడు, ఆయన 'అక్షర' అన్న పేరుతో కూడా పిలవబడ్డాడు. అక్షర అంటే 'నాశము లేనిది' అని అర్థం. బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:
ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్ఠతః (3.8.9)
‘అక్షరుడైన వాని బ్రహ్మాండమైన శక్తి చేతనే సూర్యుడు, చంద్రుడు తమ స్థానాల్లో నిలుప బడుతున్నారు.’ ఈశ్వరుని నిరాకార తత్త్వాన్ని పొందటానికి, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో, యోగ-మిశ్ర-భక్తిని వివరిస్తున్నాడు. సంగ్రహేణ అంటే ‘క్లుప్తంగా’ అని అర్థం. మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఈ మార్గాన్ని, ఆయన క్లుప్తంగా మాత్రమే వివరిస్తున్నాడు ఎందుకంటే ఈ మార్గము అందరికీ అనుకూలమైనది కాదు.
ఈ మార్గంలో వ్యక్తి చాలా తీవ్రమైన నియమనిష్ఠలను పాటించాలి, ప్రాపంచిక కోరికలని వదిలి వేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మరియు ఖచ్చితమైన ఇంద్రియనిగ్రహము అలవర్చుకోవాలి. బ్రహ్మచర్యము ద్వారా వ్యక్తి యొక్క శారీరక శక్తి సంరక్షించబడి, ఆ తరువాత సాధన ద్వారా అది ఆధ్యాత్మిక శక్తిగా మార్చబడుతుంది. ఆధ్యాత్మిక విషయాలను అవగతం చేసుకోవటానికి, బ్రహ్మచర్యాన్ని పాటించే సాధకుడు, తన జ్ఞాపక శక్తిని మరియు బుద్ధి కుశలతను పెంచుకుంటాడు. ఈ విషయం ఇంతకు పూర్వమే 6.14వ శ్లోకంలో వివరంగా చెప్పబడినది.