ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్ పురుషః పరః ।। 23 ।।
ఉపద్రష్టా — సాక్షి; అనుమంతా — ఆనతి నిచ్చేవాడు; చ — మరియు; భర్తా — భర్త (పోషకుడు); భోక్తా — అలౌకిక భోక్త; మహా-ఈశ్వరః — సర్వోత్కృష్ట నియంత్రకుడు/అధికారి; పరమ-ఆత్మా — పరమాత్మ; ఇతి — అది; చ అపి — ఇంకా కూడా; ఉక్తః — చెప్పబడును; దేహే — దేహము లోయందు; అస్మిన్ — ఇది; పురుషః-పరః — సర్వోత్కృష్ట భగవానుడు.
Translation
BG 13.23: దేహముయందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వ నియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ, అని చెప్పబడుతాడు.
Commentary
దేహములోని జీవాత్మ యొక్క స్థితిని ఇందాక శ్రీ కృష్ణుడు వివరించాడు. ఇక ఈ శ్లోకంలో, శరీరములోనే స్థితమై ఉన్న పరమాత్మ యొక్క స్థాయి గురించి చెప్తున్నాడు. ఇంతకు పూర్వమే 13.3వ శ్లోకంలో కూడా పరమాత్మ గురించి చెప్పి ఉన్నాడు; ఆ సందర్భంలో, ఒక జీవాత్మ తన దేహము (క్షేత్రము) గురించి మాత్రమే ఎఱుంగును, అదే సమయంలో పరమాత్మ అనంతములైన సమస్త శరీరములను (క్షేత్రములను) ఎఱుంగును అని చెప్పి ఉన్నాడు.
అందరిలోనూ ఉన్న, అ పరమాత్మ, తన సాకార రూపములో విష్ణుమూర్తిగా వ్యక్తమవుతాడు. విష్ణుమూర్తి రూపములో ఉన్న ఆ పరమేశ్వరుడే సమస్త జగత్తుకి స్థితికారకుడు (సంరక్షించి, పోషించేవాడు). ఆయన, బ్రహ్మాండముపైన తన సాకార రూపములో, క్షీర సాగరములో (పాలసముద్రం) లో నివసిస్తాడు. ఆయనే సర్వ భూతముల హృదయములలో పరమాత్మ స్వరూపంలో వ్యాప్తి నొంది ఉంటాడు. లోపలే కూర్చుని, వారు చేసే పనులను గమనిస్తూ, కర్మలను నోట్ చేసుకుంటూ, వాటివాటి ఫలములను సరియైన సమయంలో అందచేస్తాడు. ప్రతి జన్మలో కూడా జీవాత్మతో పాటే, దాని వెంటే, అది ఏ శరీరంలోనికి వెళితే దానిలోకి వెళ్లి ఉంటాడు. ఒక పాము శరీరంలో నైనా, ఒక పంది శరీరమైనా, లేదా ఒక పురుగు శరీరమైనా తాను వసించడానికి వెనుకాడడు. ముండకోపనిషత్తు ఈ విధంగా పేర్కొంటున్నది.
ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్యనశ్నన్నన్యో అభిచాకశీతి
సమానే వృక్షే పురుషో నిమగ్నో ఽనీశయా శోచతి ముహ్యమానః
జుష్టం యదా పశ్యత్యన్యమీశమస్య మహిమానమితి వీతశోకః (3.1.1-2)
‘రెండు పక్షులు ఒక చెట్టు (శరీరము) యొక్క గూటిలో (హృదయములో) నివసిస్తున్నాయి. అవి ఒకటి జీవాత్మ, మరియొకటి పరమాత్మ. ఈ జీవాత్మ ఆ పరమాత్మకు విముఖంగా (వీపు చూపిస్తూ) ఉన్నది; మరియు ఆ చెట్టు యొక్క పండ్లు (శరీరంలో ఉన్నంత వరకు తనకు అందే కర్మఫలములు) తినటంలో నిమగ్నమై ఉన్నది. తియ్యని పండు వస్తే, అది సంతోషపడుతుంది; చేదు పండు వస్తే, అది దుఃఖిస్తుంది. పరమాత్మ, ఆ జీవాత్మకి మిత్రుడే, కానీ ఆయన జోక్యం చేసుకోడు; కేవలం కూర్చుని అన్నీ గమనిస్తుంటాడు. ఒకవేళ జీవాత్మ కనుక పరమాత్మ కేసి యూటర్న్ తిరిగితే, దాని యొక్క సమస్త బాధలూ సమిసిపోతాయి.’ జీవాత్మకి స్వేఛ్చాచిత్తము ఇవ్వబడినది. అంటే, భగవంతుని వైపుగా లేదా భగవంతునికి దూరంగా వెళ్ళే స్వేచ్ఛ ఉంటుంది. ఆ యొక్క స్వేచ్ఛా చిత్తముని దుర్వినియోగం చేయటం వలన జీవాత్మ బంధనములో ఉంది. మరియు దాని యొక్క సరియైన ఉపయోగమును నేర్చుకోవటం ద్వారా, అది నిత్య శాశ్వత భగవత్ సేవను పొందవచ్చు మరియు అనంతమైన ఆనందమును అనుభవించవచ్చు.