Bhagavad Gita: Chapter 13, Verse 30

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాత్మానమ్ అకర్తారం స పశ్యతి ।। 30 ।।

ప్రకృత్య — ప్రకృతి స్వభావము చేత; ఏవ — నిజముగా; చ — మరియు; కర్మాణి — కర్మలు; క్రియమాణాని — చేయబడును; సర్వశః — అన్నీ; యః — ఎవరైతే; పశ్యతి — చూచెదరో; తథా — కూడా; ఆత్మానమ్ — జీవాత్మ; అకర్తారం — అకర్త (ఏమీ చేయదు); స — వారు; పశ్యతి — చూసినట్టు.

Translation

BG 13.30: (శరీరము యొక్క) అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు, అని అర్థంచేసుకున్నవారు నిజముగా చూసినట్టు.

Commentary

తంత్ర భాగవతం ఇలా పేర్కొంటున్నది: ఆహంకారాత్ తు సంసారో భవేత్ జీవస్య న స్వతః, ‘ఈ శరీరమే నేను అనుకునే అహంకారము మరియు కర్తను (చేసేది) నేనే అన్న గర్వము , జీవాత్మని జనన-మరణ సంసారములో బంధించివేస్తాయి.’ భౌతిక దృక్పథంలో, అహంకారము అనేది మనలను మనం ఈ శరీరమే అనుకునేలా చేస్తుంది, అందుకే మనం శరీర కార్యములను, ఆత్మకు ఆపాదించి, ‘నేను ఇది చేస్తున్నాను... నేను అది చేస్తున్నాను’ అని అనుకుంటూఉంటాము. కానీ, జ్ఞానోదయమయిన జీవాత్మ, భుజించేటప్పుడు, త్రాగే టప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు మరియు మిగతా అన్నీ పనులు చేసేటప్పుడు, శరీరమే ఈ పనులు అన్నీ చేస్తున్నది అని గమనిస్తుంది. అయినా, శరీరము చేసే పనులతో నాకు సంబంధం లేదు అని అది భావించరాదు. ఎలాగైతే, ఒక దేశం యుద్ధానికి వెళ్ళటానికి తీస్కున్న నిర్ణయానికి, ఆయనే స్వయంగా యుద్ధం చేయకపోయినా, ఆ దేశ అధిపతి బాధ్యుడో, ఆ విధంగానే, జీవప్రాణులు చేసే పనులకు, అవన్నీ శరీరం, మనస్సు, బుద్ధి లచే చేయబడినా, ఆత్మదే బాధ్యత. అందుకే ఆధ్యాత్మిక సాధకుడు ఈ రెండు పక్కలను మనస్సులో ఉంచుకోవాలి. వశిష్ఠ మహర్షి రాముడికి ఈ విధంగా ఉపదేశం చేసాడు. ‘రామా, పని చేసేటప్పుడు, ఫలితములు నీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నట్లు పరిశ్రమించుము; కానీ మనస్సులో మాత్రం చేసేది నీవు కాదు అని గుర్తుంచుకో.’