Bhagavad Gita: Chapter 13, Verse 15

సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ ।
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ।। 15 ।।

సర్వ — అన్ని; ఇంద్రియ — ఇంద్రియములు; గుణ — ఇంద్రియ-వస్తువిషయములు; ఆభాసం — గ్రహించేవాడు/అనుభవించేవాడు; సర్వ — అన్ని; ఇంద్రియ — ఇంద్రియములు; వివర్జితమ్ — లేకుండా; అసక్తం — ఆసక్తి రహితముగా; సర్వ-భృత్ — అన్నింటిని సంరక్షించి పోషించేవాడు; చ — అయినా; ఏవ — నిజముగా; నిర్గుణం — ప్రకృతి త్రిగుణములకు అతీతముగా; గుణ-భోక్తృ — ప్రకృతి యొక్క త్రిగుణములకు భోక్తగా; చ — అయినా సరే.

Translation

BG 13.15: ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేనిపట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటిని సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా, ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే.

Commentary

భగవంతుని ఇంద్రియములు అంతటా ఉన్నాయి అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు సరిగ్గా దానికి విరుద్ధంగా, ఆయనకు ఎటువంటి ఇంద్రియములు లేవని చెప్తున్నాడు. దీనిని మనం లౌకిక తర్కము ద్వారా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే, ఇది పరస్పర విరుద్ధమైనదిగా అనిపిస్తుంది. ‘భగవంతునికి అనంతమైన ఇంద్రియములు ఉండి మరియు ఆయన ఇంద్రియములు లేకుండా కూడా, రెండూ ఎలా సాధ్యం?’ అని అనిపిస్తుంది. కానీ, ఇలాంటి లౌకిక తర్కము మనోబుద్ధులకు అతీతమైన ఆయన పట్ల వర్తించదు. భగవంతుడు అనంతమైన పరస్పర విరుద్ధమైన గుణములు ఒకే సమయంలో కలిగి ఉంటాడు. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం:

విరుద్ధ ధర్మో రూపొసా వైశ్వర్యాత్ పురుషోత్తమాః

‘పరమేశ్వరుడు అసంఖ్యాకమైన పరస్పర విరుద్ధ గుణములకు నిలయము.’ ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, భగవంతునికి ఉన్న అనంతమైన పరస్పర విరుద్ధ గుణములలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాడు.

ఆయనకు మనకున్నటువంటి ప్రాకృతిక ఇంద్రియములు ఉండవు, అందుకే ఆయనకు ఇంద్రియములు లేవు అని చెప్పటం సమంజసమే. సర్వేంద్రియ వివర్జితమ్ అంటే ‘ఆయనకు ప్రాకృతిక ఇంద్రియములు లేవు.’ అని అర్థం, కానీ, ఆయనకు సర్వత్రా ఉండే దివ్యమైన ఇంద్రియములు ఉన్నాయి, అందుకే భగవంతుని యొక్క ఇంద్రియములు సర్వవ్యాప్తమై ఉన్నాయి అని అనుకోవటం కూడా సమంజసమే. 'సర్వేంద్రియ గుణాభాసం' అంటే ‘ఇంద్రియములకు ఉండే స్వభావాన్ని వ్యక్తపరిచి ఇంద్రియ వస్తు-విషయములను గ్రహిస్తాడు.’ ఈ రెండు లక్షణములను పొందుపరుస్తూ, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

అపాణిపాదో జవనో గ్రహీతా

పశ్యత్యచక్షుః స శృణోత్యకర్ణః (3.19)

‘భగవంతునికి ప్రాకృతిక చేతులు, పాదములు, కళ్ళు, మరియు చెవులు ఉండవు. అయినా సరే ఆయన అన్నీ అవగాహన చేసుకుంటాడు, నడుస్తాడు, చూస్తాడు, మరియు వింటాడు.’

అంతేకాక, శ్రీ కృష్ణుడు తానే ఈ సృష్టిలోని జగత్తు అంతటినీ పోషించి, సంరక్షించేవాడిని, అయినా దాని నుండి విడిగా ఆసక్తి రహితంగా ఉంటానని చెప్తున్నాడు. తన యొక్క విష్ణుమూర్తి స్వరూపంలో, శ్రీ కృష్ణ భగవానుడు సమస్త సృష్టిని పోషిస్తూ నిర్వహిస్తూ ఉంటాడు. సర్వ భూతముల హృదయములో స్థితుడై ఉండి, వారి కర్మలను నోట్ చేసుకుంటూ, వాటివాటి ఫలితములను అందిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి అధిపత్యమునకు లోబడి బ్రహ్మ దేవుడు, విశ్వమును నిలకడగా నిర్వహించటానికి, లౌకిక భౌతిక శాస్త్ర సూత్రములను మార్పు చేస్తూ ఉంటాడు. ఇంకా, విష్ణుమూర్తి ఆధిపత్యములోని దేవతలు మనకు వాయువు, భూమి, నీరు, వర్షము మొదలైన, మన మనుగడకు అవసరమైన వాటిని సమకూరుస్తూ ఉంటారు. అందుకే, భగవంతుడే అన్నింటికీ నిర్వాహకుడు/పోషకుడు. అయినా, ఆయన తనకు తానే పరిపూర్ణుడు అందుకే అందరితో విడివడి ఆసక్తిరహితముగా ఉంటాడు. వేదములు ఆయనను 'ఆత్మారాముడు' అని అంటాయి, అంటే ‘తనలో తానే రమించిపోయేవాడు, ఇంకా ఏ ఇతర అన్య బాహ్యమైనవి అవసరం లేనివాడు’ అని అర్థం.

భౌతిక శక్తి అనేది భగవంతునికి యొక్క అధీనములో ఉండేది, అది ఆయనకు సేవ చేస్తూ ఆయన ప్రీతి కోసమే పనిచేస్తుంది. అందుకే ఆయన ప్రకృతి త్రిగుణముల యొక్క భోక్త. అదే సమయంలో, ఆయన నిర్గుణుడు (త్రిగుణములకు అతీతుడు), ఎందుకంటే ఈ గుణములు ప్రాకృతికమైనవి, కానీ భగవంతుడు దివ్యమైన వాడు.