యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి ।
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 31 ।।
యదా — ఎప్పుడైతే; భూత — ప్రాణులు; పృథక్-భావమ్ — విభిన్నమైన రకాలు; ఏక-స్థం — ఒకచోటనే స్థితమై ఉన్నట్టు; అనుపశ్యతి — చూచెదరో; తతః — ఆ తదుపరి; ఏవ — నిజముగా; చ — మరియు; విస్తారం — జనించిన; బ్రహ్మ — బ్రహ్మాం; సంపద్యతే — (వారు) పొందెదరు; తదా — అప్పుడు.
Translation
BG 13.31: విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.
Commentary
సముద్రము తానే అలలుగా, నురగగా, సుడులుగా, తరంగములగా మార్చుకుంటుంది. ఎవరికైనా ఇవన్నీ వేర్వేరుగా మొదటిసారి చూపిస్తే, వారు ఇవన్నీ వేర్వేరు అని అనుకుంటారు. కానీ, సముద్రము గురించి తెలిసిన వ్యక్తి, ఆ విభిన్నమైన వాటన్నిటిలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వమును చూస్తాడు. అదే విధంగా, అతిచిన్న అమీబా నుండి అత్యంత శక్తివంతులైన దేవతల వరకూ, ఎన్నెన్నో రకాల జీవ రాశులు ఉన్నాయి. అవి అన్నీ కూడా ఒకే సత్యము పై స్థితమై ఉన్నాయి - అదే జీవాత్మ, అది భగవంతుని అంశము; అది భౌతిక శక్తితో తయారుచేయబడిన శరీరము యందు కూర్చుని ఉంటుంది. ఇన్ని రూపముల వైవిధ్యము వచ్చినది, ఆత్మ వలన కాదు, అది భౌతిక శక్తిచే తయారుచేయబడిన విభిన్న శరీరముల వలన మాత్రమే. జన్మించే సమయంలో, సమస్త ప్రాణుల శరీరములు, భౌతిక శక్తిచే సృష్టించబడతాయి, మరిణించిన పిదప అవి అన్నీ మళ్లీ దానిలోనే కలిసిపోతాయి. విభిన్నములైన జీవరాశులు అన్నీ ఒకే భౌతిక శక్తి యందు స్థితమై ఉన్నట్టు గమనించినప్పుడు, మనం ఈ భిన్నత్వం వెనుక ఉన్న ఏకత్వమును తెలుసుకోవచ్చు. మరియు ప్రకృతి స్వభావము భగవంతుని శక్తి కావున ఇటువంటి జ్ఞానము, ఒకే ఆధ్యాత్మిక అస్తిత్వము జగత్తు అంతటా వ్యాప్తమై ఉన్నది, అని గ్రహించేటట్లు మనలను చేస్తుంది. ఇది బ్రహ్మ పరిజ్ఞానమునకు దారి తీస్తుంది.