అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే ।
తేఽపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ।। 26 ।।
అన్యే — ఇతరులు; తు — ఇంకా; ఏవం — ఈ విధముగా; అజానంతః — తెలియని వారు (ఆధ్యాత్మిక మార్గముల గురించి); శృత్వా — వినటం ద్వారా; అన్యేభ్య — ఇతరుల నుండి; ఉపాసతే — పూజించటం ప్రారంభిస్తారు; తే — వారు; అపి — కూడా; చ — మరియు; అతితరంతి — దాటిపోవుదురు; ఏవ — కూడా; మృత్యుమ్ — మృత్యువు; శృతి-పరాయణాః — భక్తితో వినటం (మహాత్ముల ద్వారా).
Translation
BG 13.26: ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి ఇతరుల దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, వారు కూడా క్రమక్రమంగా ఈ జనన-మరణ సంసార సాగరాన్ని దాటగలరు.
Commentary
సాధనా పద్ధతులు తెలియని వారు కూడా ఉంటారు. కానీ, ఏదో విధముగా వారు ఇతరుల ద్వారా విని ఆధ్యాత్మిక పథం వైపు ఆకర్షితమవుతారు. నిజానికి, ఆధ్యాత్మికత వైపు వచ్చిన వారు చాలా మంది ఈ విధంగా వచ్చిన వారే. వారికి ఆధ్యాత్మిక విషయాల పట్ల శిక్షణ లేకపోయినా, వారికి ఏదో రకంగా దాని గురించే చదివే లేదా వినే అవకాశం వస్తుంది. దానితో వారికి భగవత్ భక్తి యందు ఆసక్తి పెరిగి వారు ఆ మార్గంలో ముందుకెళతారు.
వైదిక ఆచారంలో, మహాత్ముల వద్ద వినటం అనేది ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు ఉన్న ఒక శక్తి వంతమైన సాధనముగా ఉద్ఘాటించబడినది. శ్రీమద్ భాగవతంలో, పరీక్షిత్ మహారాజు, శుకుడిని ఈ ప్రశ్న అడిగాడు, ‘ఏ విధంగా మనం మన హృదయంలో ఉన్న అవాంఛితములైన కామము, కోపము, దురాశ, ఈర్ష్య, మరియు ద్వేషము వంటి వాటిని నిర్మూలించవచ్చు?’ అని. శుకదేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు:
శృణ్వతాం స్వ-కథాః కృష్ణః పుణ్య-శ్రవణ-కీర్తనః
హృద్యన్తః స్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్
(భాగవతం 1.2.17)
‘పరీక్షిత్ మహారాజా! సాధుపురుషుల ద్వారా భగవత్ నామములను, రూపములను, లీలలను, గుణములను, ధామములను మరియు భగవత్ భక్తుల గురించీ కేవలం వింటూ ఉండుము. ఇది హృదయములో అనంతమైన జన్మల నుండి ఉన్న మలినములను సహజంగానే నిర్మూలిస్తుంది.’
మనం సరియైన చోటనుండి విన్నప్పుడు, విశ్వసనీయమైన ప్రామాణిక ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. అంతేకాక, ఏ మహాత్ముని నుండి వింటున్నామో, ఆ సత్పురుషునికి ఉన్న దృఢ విశ్వాసము నమ్మకము మనకు కూడా రావటం ప్రారంభమవుతుంది. సత్పురుషుల నుండి వినటం అనేది మన విశ్వాసమును పెంచుకోవటానికి ఉన్న అత్యంత సరళమైన విధానము. ఇంకా చెప్పాలంటే, ఆ ఆధ్యాత్మిక కార్యముల పట్ల మహాత్మునికి ఉన్న ఉత్సాహము మనకు కూడా అంటుకుంటుంది. సాధకుడికి, భౌతిక దృక్పథం యొక్క జడత్వాన్ని వదిలించుకొని మరియు సాధనా పథంలో అడ్డంకులను తొలగించుకోవటానికి, భక్తి పట్ల ఉత్సాహము, చాలా శక్తిని ఇస్తుంది. ఉత్సాహము మరియు విశ్వాసము అనేవి భక్తి అనే భవనం నిలిచి ఉండే పునాదులు.