Bhagavad Gita: Chapter 13, Verse 7

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ।
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ।। 7 ।।

ఇచ్ఛా — కోరిక; ద్వేషః — ద్వేషము; సుఖం — సుఖము; దుఃఖం — దుఃఖము; సంఘాతః — ఇవన్నీ కలిపి; చేతనా — చైతన్యము; ధృతిః — మనశ్శక్తి; ఏతత్ — ఇవి అన్ని; క్షేత్రం — క్షేత్రము; సమాసేన — తో కూడి; స-వికారమ్ — మార్పులతో; ఉదాహృతమ్ — చెప్పబడినవి.

Translation

BG 13.7: వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము — ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు (వికారములు) అనబడుతాయి.

Commentary

శ్రీ కృష్ణుడు ఇప్పుడు క్షేత్రము యొక్క గుణములను మరియు దాని యొక్క వికారములను (మార్పులను) ఇక వివరిస్తున్నాడు.

శరీరము. ఈ దేహము అనేది క్షేత్రము యొక్క అంతర్భాగమే, కానీ దానిలో ఇంకా చాలా ఉంటాయి. మరణించే వరకు శరీరము ఆరు మార్పులకు లోనవుతుంది — అస్తి (ఒక ఉనికి రావటము), జాయతే (పుట్టుక), వర్ధతే (పెరుగుదల), విపరిణమతే (పునరుత్పత్తి), అపక్షీయతే (వయస్సుతో పాటు శుష్కించి పోవుట), వినశ్యతి (మరణించుట). భౌతిక జగత్తు యందు కానీ లేదా భగవంతుని యందు కానీ, ఆత్మ నిర్దేశించిన రీతిలో, ఆత్మకు ఆనంద అన్వేషణ లో శరీరము సహకరిస్తుంది.

చైతన్యము. ఆత్మలో ఉండే ప్రాణ శక్తియే ఈ చైతన్యము, మరియు ఆత్మ ఉన్నంత కాలము, అది ఉన్న శరీరానికి చైతన్యమును ఆపాదిస్తుంది. ఇది ఎలాగంటే, అగ్నికి వేడిమిని కలిగించే సామర్థ్యము ఉన్నది, మరియు దానిలో ఇనప చువ్వని పెడితే , ఆ చువ్వ కూడా, అగ్ని నుండి అందిన వేడిమికి, ఎర్రగా వేడిగా అయిపోతుంది. అదే విధముగా, ఆత్మ అనేది శరీరానికి చైతన్యమును కలిగించి, ప్రాణమును కలిగిఉన్న దానిలా చేస్తుంది. శ్రీ కృష్ణుడు అందుకే చైతన్యమును క్షేత్రము యొక్క లక్షణముగా పేర్కొన్నాడు.

మనోబలము. ఇది శరీరములోని వేరువేరు అంశములను చురుకుగా మరియు ఒక దిశగా ఏకాగ్రతతో ఉంచే దృఢ సంకల్పము. ఆత్మ తన క్షేత్రము ద్వారా తన యొక్క లక్ష్యమును సాధించటానికి ఈ సంకల్పమే కారణము. సంకల్పబలం అనేది, ఆత్మయొక్క శక్తితో ప్రేరేపితమైన బుద్ధి యొక్క లక్షణము. సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణముల యొక్క ప్రభావముచే సంకల్పంలో జరిగే మార్పులు 18.33వ శ్లోకం నుండి 18.35వ శ్లోకం వరకు వివరించబడ్డాయి.

కోరిక (ఇచ్ఛ). ఇది మనోబుద్ధుల ఒక వ్యవహారము, ఇది ఒక వస్తువును లేదా పరిస్థితిని లేదా ఒక వ్యక్తిని, లేదా మరోదాన్ని పొందాలనే తపనను సృష్టిస్తుంది. శరీరమును గురించి వివరించేటప్పుడు, కోరిక అనేదాన్ని మనము చాలా సామాన్యమైనదిగా తీసుకుంటాము, కానీ ఒక్కసారి ఊహించండి, కోరిక అనేది లేకపోతే జీవితం ఎలా ఉండి ఉండేదో! కాబట్టి, ఈ క్షేత్రమును రూపకల్పన చేసి, దానియందే కోరికను కూడా ఉంచిన పరమేశ్వరుడు, సహజంగానే కోరిక గురించి ప్రత్యేకంగా పేర్కొంటాడు. బుద్ధి అనేది ఒక వస్తువు యొక్క వాంఛనీయతను విశ్లేషిస్తుంది, మరియు మనస్సు దానిపై కోరికను పెంపొందించుకుంటుంది. వ్యక్తికి ఆత్మ-జ్ఞానోదయమైనప్పుడు, సమస్త భౌతిక ప్రాపంచిక కోరికలు నశించిపోతాయి, మరియు పరిశుద్ధమైన మనస్సు భగవంతునికై కోరికను పెంపొందించుకుంటుంది. భౌతిక కోరికలు బంధనమునకు కారణము మరియు ఆధ్యాత్మిక కోరికలు మోక్షమునకు దారి తీస్తాయి.

ద్వేషం. ఇది ప్రతికూల వస్తువుల, వ్యక్తుల, మరియు పరిస్థితుల పట్ల వ్యతిరేకతను సృష్టించే మనోబుద్దుల స్థితి, వాటిని తప్పించటానికి ప్రయత్నిస్తుంది.

సంతోషము. ఇది అనుకూల పరిస్థితుల వల్ల మరియు కోరికలు తీరటం వలన మనస్సులో కలిగే ఒక సుఖానుభూతి. మనస్సు సంతోష భావనను అనుభూతి చెందటం వలన, దానితో అనుసంధానం అవటంచే ఆత్మ కూడా అదే భావన పొందుతుంది. కానీ, భౌతిక ప్రాపంచిక సుఖసంతోషాలు, ఆత్మ యొక్క తపనను తీర్చలేవు, భగవంతుని యొక్క అనంతమైన దివ్య ఆనందాన్ని పొందే వరకూ అది అసంతృప్తి తోనే ఉంటుంది.

దుఃఖము. ఇది ప్రతికూల పరిస్థితుల వలన మనస్సులో కలిగే బాధ.

జ్ఞానమును పెంపొందించుకోవటానికి, తద్వారా మానవ దేహ క్షేత్రము యొక్క ప్రయోజనాన్ని సిద్దింపచేసుకోవటానికి అవసరమయ్యే సుగుణములు మరియు లక్షణములను ఇప్పుడు ఇక తదుపరి శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు.