యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః ।
శ్రద్ధావంతోఽనసూయంతో ముచ్యంతే తేఽపి కర్మభిః ।। 31 ।।
యే — ఎవరైతే; మే — నా; మతం — బోధనలు; ఇదం — ఈ యొక్క; నిత్యం — ఎల్లప్పుడూ; అనుతిష్ఠంతి — పాటిస్తారో; మానవాః — మానవులు; శ్రద్ధా-వంతః — గాఢమైన విశ్వాసంతో; అనసూయంతః — అసూయారహితులై; ముచ్యంతే — ముక్తులవుతారు; తే — వారు; అపి — కూడా; కర్మభిః — కర్మ బంధాలనుండి.
Translation
BG 3.31: పూర్తి శ్రద్ధ, విశ్వాసంతో, అసూయ లేకుండా, నా ఈ బోధనలను పాటించే వారు కర్మ బంధముల నుండి విముక్తులౌతారు.
Commentary
చాలా అందంగా, దేవదేవుడు తను వివరించిన సిద్ధాంతాన్ని 'మత' (అభిప్రాయం) అన్నాడు. అభిప్రాయం అనేది వ్యక్తిగత దృక్పథం, సూత్రం అంటే ఒక సార్వత్రిక వాస్తవం. అభిప్రాయాలు అనేవి బోధకుల బట్టి మారవచ్చు, కానీ సూత్రం అదే ఉంటుంది. తత్త్వవేత్తలు మరియు ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను సూత్రాలుగా చెప్తారు. కానీ గీతలో తను చెప్పిన సూత్రాన్ని భగవంతుడు తన అభిప్రాయం అన్నాడు. తన ఉదాహరణతో మనకు వినయాన్ని, మర్యాదను నేర్పుతున్నాడు.
కర్తవ్య నిర్వహణ కోసం పిలుపు నిచ్చిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు, భగవద్గీత యొక్క ఉపదేశాలను విశ్వాసంతో స్వీకరించి వాటిని జీవితంలో శ్రద్ధగా పాటిస్తే కలిగే శ్రేయస్సుని సూచిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకొని మన జీవితాలను మార్చుకోవటమే, మనుష్యులుగా మనకున్న విశేషధర్మం. ఈ విధంగా, మన మానసిక జ్వరాలు (కామం, క్రోధం, లోభం, ఈర్ష్య, భ్రమ, మరియు ఇతర మానసిక వ్యాధులు మొదలైనవి) ఉపశమిస్తాయి.
ఇంతకు పూర్వ శ్లోకంలో, అన్ని కార్యములనూ తనకే అర్పితము చేయమని శ్రీ కృష్ణుడు అర్జునుడికి వివరించాడు. కానీ, ఈ ఉపదేశం పట్ల, భగవంతుని మీద విశ్వాసం లేని వారి నుండి అవహేళన ఎదురవ్వచ్చు మరియు భగవంతునిపై ఈర్ష్య కలవారి నుండి తిరస్కారం ఎదురవ్వచ్చు. కాబట్టి, దృఢవిశ్వాసంతో ఈ ఉపదేశాన్ని స్వీకరించవలసిన అవసరాన్ని శ్రీ కృష్ణుడు నొక్కిచెప్తున్నాడు. నమ్మకంతో ఈ ఉపదేశాన్ని పాటించేవారు కర్మ బంధాలనుండి విముక్తులౌతారు. మరిక, నమ్మకం లేని వారి గతి ఏమౌతుంది? వారి పరిస్థితి ఇక తదుపరి వివరించబడింది.