ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ।
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ।। 12 ।।
ఇష్టాన్ — కోరిన; భోగాన్ — జీవిత అవసరములు; హి — తప్పకుండా; వః — మీకు; దేవాః — దేవతలు; దాస్యంతే — అనుగ్రహించెదరు; యజ్ఞ-భావితాః — యజ్ఞముచే తృప్తి చెంది; తైః — వారిచే; దత్తాన్ — ఇవ్వబడిన వాటిని; అప్రదాయ — నివేదించకుండా; ఏభ్యః — వారికి; యః — ఎవరైతే; భుంక్తే — అనుభవిస్తారో; స్తేనః — దొంగలు; ఏవ — వాస్తవముగా; సః — వారు.
Translation
BG 3.12: యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు, జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటిని ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని, తిరిగి నివేదించకుండా, తామే అనుభవించే వారు, నిజానికి దొంగలే.
Commentary
ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే, మనకు వర్షం, గాలి, పంటలు, చెట్లూచేమలు, ఖనిజములు, సారవంతమైన నేల మరియు ఇతర వనరులను ప్రసాదిస్తారు. వారి నుండి వీటన్నిటిని పొందిన మనం మానవులం వారికి ఋణపడి ఉన్నాము. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు; మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని ఆశిస్తారు. దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ ప్రీతి చెంది, ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి సహకరిస్తారు. ఈ విధంగా, మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈవిశ్వం మనకు సహకరించటం ప్రారంభిస్తుంది అని చెప్పబడింది.
కానీ, ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని ఈశ్వర సేవ కోసం కాకుండా, మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే, శ్రీ కృష్ణుడు దాన్ని చోర మనస్తత్వం అంటున్నాడు. తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతుంటారు, ‘నేను నీతిగా బ్రతుకుతున్నాను; ఎవరినీ కష్టపెట్టను; నేనేమీ దొంగిలించను; కానీ నేను భగవంతుడున్నాడని నమ్మను, దైవారాధనను నమ్మను. నేనేమైనా తప్పు చేస్తున్నానా?’ అని. ఈ ప్రశ్నకు సమాధానం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇటువంటి వ్యక్తులు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చెయ్యట్లేదు కానీ భగవంతుని దృష్టిలో దొంగలే. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంటి యజమానిని గుర్తించకుండా, అక్కడి సోఫాలో కూర్చొని, ఫ్రిడ్జిలో నుండి ఆహారం తిని, బాత్రూం వాడుకొని, ఇలా ఉంటున్నామనుకోండి. మనం ఏమీ తప్పు చేయలేదనుకోవచ్చు, కానీ చట్టం దృష్టిలో మనం దొంగగా పరిగణించబడుతాము; ఎందుకంటే ఆ ఇల్లు మనది కాదు. ఇదే విధంగా మనం ఉండే ఈ లోకం భగవంతుని సృష్టి, ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు. ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే, ఆధ్యాత్మిక కోణంలో మనం తప్పకుండా దొంగతనం చేసినట్టే.
భారత చరిత్రలో ప్రఖ్యాత రాజు చంద్రగుప్తుడు, తన గురువైన చాణక్య పండితుడిని ఇలా అడిగాడు, ‘వైదిక వాజ్మయం పరంగా, పౌరుల విషయంలో ఒక రాజు యొక్క స్థానం ఏమిటి?’ అని.
చాణక్య పండితుడు ఇలా సమాధానం చెప్పాడు ‘రాజు తన పౌరుల సేవకుడు మాత్రమే, అంతకన్నా ఇంకేమీ కాదు. తన రాజ్య పౌరులకి భగవత్ ప్రాప్తి పథంలో సహాయం చేయటమే దేవుడు నిర్దేశించిన రాజు యొక్క ధర్మం.’
ఒక రాజు, వ్యాపారి, రైతు, శ్రామికుడు, ప్రతి వ్యక్తీ, ఎవరైనా సరే, భగవంతుని జగత్తులోని అంతర్గత భాగంగా, తన ధర్మాన్ని భగవత్ సేవగా చేయాలి.