Bhagavad Gita: Chapter 3, Verse 33

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।। 33 ।।

సదృశం — దానికి తగినట్లుగా; చేష్టతే — క్రియలను చేయును; స్వస్యాః — తమంత తామే; ప్రకృతే — ప్రకృతి గుణములు; జ్ఞానవాన్ — జ్ఞానులు; అపి — కూడా; ప్రకృతిం — సహజ స్వభావం; యాంతి — అనుసరించుట; భూతాని — అన్ని ప్రాణులు; నిగ్రహః — నిగ్రహించి; కిం — ఏమి; కరిష్యతి — చేసెదరు.

Translation

BG 3.33: వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?

Commentary

శ్రీ కృష్ణుడు మళ్లీ, అకర్మ కన్నా కర్మయే శ్రేష్ఠమనే విషయం సూచిస్తున్నాడు. జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపింపబడి తమ వ్యక్తిగత ప్రవృత్తి అనుగుణంగా నడుచుకుంటారు. పుస్తక జ్ఞానం ఉన్నవారు కూడా, అనంతమైన పూర్వ జన్మ సంస్కారాలని (వారి ధోరణులు, అభిప్రాయాలు), ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మ (అసంఖ్యాక పూర్వ జన్మల నుండీ పేరుకుపోయిన సంచిత కర్మ ఆధారంగా, ఈ జన్మ సమయంలో కేటాయించబడ్డ విధి) ని, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలని తమలో కలిగి ఉంటారు. ఆ అలవాట్ల, స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించటం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ వైదిక శాస్త్రాలు అన్నీ పనులను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమంటే, అదొక అయోమయమైన/అస్థిర మైన పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాంటి అసహజమైన అణచివేత ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అలవాట్ల, సహజ స్వభావాల బలీయమైన శక్తిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే అది ఆధ్యాత్మిక పురోగతికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నామో అక్కడి నుండే ఆధ్యాత్మిక పురోగతి మొదలుపెట్టాలి; ఇది చేయాలంటే మన ఇప్పుడున్న ప్రస్తుత స్థితిని అర్థం చేసుకుని, అంగీకరించి అక్కడినుండి మెరుగుపరుచు కోవాలి.

జంతువులు కూడా తమ తమ ప్రత్యేక స్వభావాలకు అణుగుణంగా ప్రవర్తిస్తాయని మనం గమనించవచ్చు. చీమలు ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాయంటే అవి తమ కోసం చూసుకోకుండా, తమ సమాజం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి, ఇది మానవ సమాజంలో కనిపించటం అరుదు. ఒక ఆవుకి తన దూడ మీద ఎంత మమకారం ఉంటుందంటే, దూడ ఒక్క క్షణం కనిపించక పోయినా ఆవు ఆందోళనకి లోనవుతుంది. మానవులెవరికీ సాధ్యం కాని అమితమైన విశ్వాస గుణాన్ని కుక్కలు ప్రదర్శిస్తాయి. అదే విధంగా, మనం మానవులం కూడా మన సహజ స్వభావంచే నడిపింపబడుతాము. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి, శ్రీ కృష్ణుడు అతనికి ఇలా చెప్పాడు, ‘నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది (భగవద్గీత 18.59)’; ‘నీ యొక్క సహజ స్వభావంచే జనించిన ఆలోచనే నిన్ను ఆ పని చేయటానికి ప్రోద్బలం కలిగిస్తుంది (భగవద్గీత 18.60)’. మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ ప్రాప్తి దిశగా మార్చటం ద్వారా, మరియు, మన విధులను రాగ ద్వేష రహితంగా, భగవత్ సేవ రూపంగా చేయటం ద్వారా, ఆ సహజ స్వభావాన్ని పవిత్రమొనర్చుకోవాలి.

Watch Swamiji Explain This Verse