Bhagavad Gita: Chapter 3, Verse 32

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ ।
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ।। 32 ।।

యే — ఎవరైతే; తు — కానీ; ఎతత్ — ఈ యొక్క; అభ్యసూయంతః — లేని దోషాలు వెతుకుతూ; న, అనుతిష్ఠంతి — పాటించరో ; మే — నా యొక్క; మతం — ఉపదేశము; సర్వ-జ్ఞాన — అన్ని రకాల జ్ఞానం లో; విమూఢాన్ — భ్రాంతి నొంది; తాన్ — వారు; విద్ధి — తెలుసుకుంటారు; నష్టాన్ — భ్రష్టులైన వారు; అచేతసః — విచక్షణా జ్ఞానం లేని వారు.

Translation

BG 3.32: కానీ, జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.

Commentary

శ్రీ కృష్ణుడు చెప్పిన ఉపదేశం మన శాశ్వతమైన సంక్షేమం కోసం మంచిది. కానీ, మన ప్రాపంచిక బుద్ధి అసంఖ్యాకమైన దోషాలతో ఉంది, కాబట్టి ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కానీ, దాని ప్రయోజనాన్ని కానీ అన్నిసార్లూ అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకోగలిగితే, అత్యల్ప జీవాత్మలమైన మనకు, మహోన్నత దివ్య పరమాత్మకు ఉన్న తేడా ఏముంటుంది? అందుకే, భగవద్గీత యొక్క దివ్య ఉపదేశాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకం/విశ్వాసం అనేవి చాలా అవసరం. ఎక్కడైతే మన బుద్ధి అర్థం చేసుకోలేదో, అక్కడ ఉపదేశంలో రంధ్రాన్వేషణ (తప్పులు వెతుకుట) చేసే బదులుగా, మన బుద్ధిని సమర్పించాలి. ‘శ్రీ కృష్ణుడు అంతటి వాడు చెప్పాడే, అయితే అది తప్పకుండా సత్యమే అయిఉంటుంది, నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. ప్రస్తుతానికి దీనిని ఒప్పుకొని, ఆధ్యాత్మిక సాధన చేస్తా. సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన తరువాత భవిష్యత్తులో నేను అర్థం చెసుకోగలను’; అన్న దృక్పథమే శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది.

జగద్గురు శంకరాచార్య, శ్రద్ధ అంటే ఇలా నిర్వచించారు : గురు వేదాంత వాక్యేషు దృఢో విశ్వాసః శ్రద్ధా, ‘గురువు మరియు శాస్త్రముల మాటల్లో గట్టి నమ్మకమే శ్రద్ధ.’ చైతన్య మహాప్రభు ఇలాగే వివరించాడు : శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ (చైతన్య చరితామృతము, మధ్య లీల, 2.62) ‘ప్రస్తుతానికి మనం వారి ఉపదేశం అర్థం చేసుకోలేకపోయినా, గురువు, దైవము పట్ల బలమైన నమ్మకమే, శ్రద్ధ.’ బ్రిటిష్ కవి అల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇలా అన్నాడు : ‘నిరూపించలేనప్పుడు, విశ్వాసము ద్వారానే నమ్మకాన్ని అలవరచుకో’. కాబట్టి, శ్రద్ధ అంటే భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అవగతం చేసుకోవటమే కాక, నిగూఢమైన అర్థం కాని భాగాలని, భవిష్యత్తులో అర్థమవుతాయి అని ఆశిస్తూ, నమ్మకంతో విశ్వశించటమే.

కానీ, అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. ఈ అహంకారం వలన, దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో, దానిని తప్పు అని తిరస్కరిస్తుంది. శ్రీ కృష్ణుడి ఉపదేశాలు, జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ, జనులు దానిలో తప్పులు పడుతుంటారు, ఉదాహరణకి ‘దేవుడు ఎందుకు అన్నీ తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు? ఆయన దురాశ కలవాడా? అహంకారి ఏమో, అర్జునుడిని తననే పూజించమంటున్నాడు?’ ఇలాంటి వారిని శ్రీ కృష్ణుడు 'అచేతసః' అంటే ‘విచక్షణా జ్ఞానం లేని వారు’ అంటున్నాడు, ఎందుకంటే వారికి – ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది; మంచేదో, చెడేదో; ధర్మానికి, అధర్మానికి; సృష్టికర్తకి, సృష్టింపబడిన వానికి; సర్వోన్నత యజమానికి, సేవకునికీ; తేడా తెలియదు. అలాంటి వారు ‘తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు’, ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి, జనన-మరణ చక్రంలో పడి తిరుగుతుంటారు.

Watch Swamiji Explain This Verse