ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 42 ।।
ఇంద్రియాణి — ఇంద్రియములు; పరాణి — ఉన్నతమైనవి; ఆహుః — అనబడును; ఇంద్రియేభ్యః — ఇంద్రియముల కంటే; పరం — ఉన్నతమైనవి; మనః — మనస్సు; మనసః — మనస్సు కంటే; తు — కానీ; పరా — ఉన్నతమైనది; బుద్దిః — బుద్ధి; యః — ఏదైతే; బుద్ధే — బుద్ధిని మించి; పరతః — మరింత ఉన్నతమైనది; తు — కానీ; సః — అది (ఆత్మ).
Translation
BG 3.42: స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.
Commentary
ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని, దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చిన పరికరముల వివిధ స్థాయిలను, శ్రీ కృష్ణుడు విశదీకరిస్తున్నాడు. ఈ శరీరం స్థూల పదార్థంతో తయారయింది; దానికన్నా ఉన్నతమైనవి ఐదు జ్ఞానేంద్రియములు (రుచి, స్పర్శ, చూపు, వాసన, మరియు శబ్దముల అనుభూతిని గ్రహించేవి); ఇంద్రియముల కన్నా మించినది మనస్సు; మనస్సు కన్నా ఉన్నతమైనది విచక్షణా శక్తి కలిగిన బుద్ధి; కానీ ఈ బుద్ధి కన్నా మించినది దివ్య ఆత్మ.
ఈ అధ్యాయపు చిట్టచివరి శ్లోకంలో చెప్పబడినట్టుగా, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని, మనము కామాన్ని కూకటి వేళ్ళతో పీకివేయటానికి ఇక ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు.