ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ।। 43 ।।
ఏవం — ఈ విధంగా; బుద్ధేః — బుద్ధి కంటే; పరం — ఉన్నతమైనది; బుద్ధ్వా — తెలుసుకొని; సంస్తభ్య — వశపరుచుకొని; ఆత్మానం — నిమ్నస్థాయి అస్తిత్వాన్ని (ఇంద్రియ-మనస్సు-బుద్ధి లను); ఆత్మనా — ఉన్నత స్థాయి అస్తిత్వం చేత (ఆత్మ); జహి — సంహరింపుము (నిర్మూలింపుము); శత్రుం — శత్రువు; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; కామ-రూపం — కోరికలనే రూపంలో; దురాసదమ్ — బలీయమైన.
Translation
BG 3.43: ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ మహాబాహువులు కలవాడా, నీ నిమ్న అస్తిత్వాన్ని (ఇంద్రియమనోబుద్ధులను), నీ ఉన్నత అస్తిత్వంచే (ఆత్మ శక్తి ద్వారా) వశపరుచుకొనుము, మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము.
Commentary
ముగింపుగా శ్రీ కృష్ణుడు, కామమనే (కోరికలు) శత్రువుని ఆత్మజ్ఞానం ద్వారా నిర్మూలించమని ఉద్ఘాటిస్తున్నాడు. ఆత్మ అనేది భగవంతుని అంశము కాబట్టి, అది దివ్యమైనది. అంటే, అది కోరుకునే దివ్య ఆనందం దివ్య వస్తువు ద్వారానే లభ్యమౌతుంది, ఎందుకంటే ప్రాపంచిక వస్తువులన్నీ భౌతికమైనవే. ఈ భౌతిక వస్తు/విషయములు, ఆత్మ యొక్క గాఢమైన అంతర్లీన తపనని తీర్చలేవు, కాబట్టి వాటి కోసం కోరికలను సృష్టించుకోవటం నిష్ప్రయోజనమైన పని. మనం ప్రయత్న పూర్వకంగా, మన బుద్ధికి ఈ ప్రకారంగా ఆలోచించటానికి తర్ఫీదు ఇవ్వాలి. ఆ తరువాత దానిని మనస్సు, ఇంద్రియములను నియంత్రించటానికి వినియోగించాలి.
కఠోపనిషత్తులో ఈ విషయం, ఒక రథం ఉదాహరణ ద్వారా చాలా అద్భుతంగా వివరించబడింది.
ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ
ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్ ।
ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః (1.3.3-4)
ఐదు గుర్రాలచే గుంజబడే ఒక రథం ఉంది అని ఉపనిషత్తులలో చెప్పబడింది; ఆ గుర్రాలకు నోటియందు పగ్గాలున్నాయి; ఆ పగ్గాలు రథ సారథి చేతిలో ఉన్నాయి; ఆ రథం వెనుక భాగంలో ఒక ప్రయాణీకుడు ఉన్నాడు. అసలైతే, ఆ ప్రయాణికుడు, రథ సారధికి దిశానిర్దేశం చేయాలి; సారధి అప్పుడు పగ్గాలతో గుర్రాలకి దిశానిర్దేశం చేయాలి. కానీ, ఇక్కడ, ప్రయాణీకుడు నిద్రపోతున్నాడు, కావున గుర్రాలు తమ ఇష్టానుసారం ఉన్నాయి.
ఈ ఉపమానంలో, రథం అంటే శరీరం; గుర్రాలు అనేవి ఐదు ఇంద్రియములు; గుర్రాల నోటియందు ఉన్న పగ్గాలు, మనస్సు; రథ సారధి, బుద్ధి; వెనుక కూర్చున్న ప్రయాణీకుడు, శరీరంలో ఉన్న జీవాత్మ. ఇంద్రియములు (గుర్రాలు) భోగాలని కోరతాయి. మనస్సు (పగ్గాలు) ఇంద్రియములపై (గుర్రాలపై) నియంత్రణ చేయటం లేదు. బుద్ధి (సారధి) పగ్గాల (మనస్సు) లాగుడుకి వశమైపోయింది. కాబట్టి భౌతికంగా బద్ధుడైఉన్న స్థితిలో, అయోమయానికి గురై ఉన్న జీవాత్మ, బుద్ధిని సరియైన దిశలో నడిపించలేదు. ఈ స్థితిలో, రథం ఎట్లా పోవాలి అన్న విషయాన్ని ఇంద్రియములే నిర్దేశిస్తాయి. ఇంద్రియ సుఖములను జీవాత్మ పరోక్షంగా అనుభవిస్తుంది, కానీ అవి దానికి సంతృప్తిని ఇవ్వలేవు. ఈ రథంలో కూర్చునిఉన్న జీవాత్మ (ప్రయాణికుడు) ఈ ప్రకారంగా అనాది నుండి భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు.
కానీ, ఒకవేళ జీవాత్మ తన ఉన్నతమైన స్వభావం పట్ల మేల్కొని, చురుగ్గా వ్యవహరిస్తే, అది బుద్ధిని సరైన దిశలో పెట్టవచ్చు. అప్పుడు బుద్ధి, తక్కువ స్థాయి అస్తిత్వాలైన మనస్సు, ఇంద్రియములను సరిగ్గా నియంత్రిస్తుంది - అప్పుడే రథం శాశ్వత సంక్షేమం దిశగా కదులుతుంది. ఈ విధంగా, తక్కువ స్థాయి అస్తిత్వాన్ని (ఇంద్రియములు, మనస్సు, బుద్ధి) నియంత్రించటానికి ఉన్నతమైన ఆత్మ (జీవాత్మ) ను తప్పకుండా వినియోగించాలి.