యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ।। 22 ।।
యం — ఏదైతే; లబ్ద్వా — లభించిన తర్వాత; చ — మరియు; అపరం — మరి ఇంకేదీ; లాభం — లాభము; మన్యతే — భావించును; న — కాదు; అధికం — గొప్పది; తతః — దాని కంటే; యస్మిన్ — దేనిలో అయితే; స్థితః — స్థితుడై ఉండునో; న — ఎన్నటికీ కాడు; దుఃఖేన — దుఃఖము చేత; గురుణా — మిక్కిలి; అపి — అయినా కూడా; విచాల్యతే — చలించుట.
Translation
BG 6.22: ఆ స్థితిని పొందిన తరువాత, వ్యక్తి, మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి, వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు.
Commentary
భౌతిక జగత్తులో ఎంత మేర సాధించినా, వ్యక్తి సంపూర్ణ తృప్తి పొందలేడు. ఓ పేద వాడు, ధనవంతుడు కావటానికి ఎంతో కష్ట పడతాడు, మరియు తను లక్షాధికారి కాగానే తృప్తి పడ్డ భావన పొందుతాడు. కానీ, అదే లక్షాధికారికి ఒక కోటీశ్వరున్ని చూడగానే, అసంతృప్తి మొదలౌతుంది. ఆ కోటీశ్వరుడు కూడా ఇంకా ఎక్కువ ఐశ్వర్యం కలవాడిని చూసినప్పుడు అసంతృప్తి చెందుతాడు. మనకు ఎంత సంతోషం లభించినా, అంత కన్నా ఎక్కువ సంతోషం ఉంది అనుకున్నప్పుడు, ఎదో అసంతృప్తి భావన ఉంటుంది. కానీ, యోగ స్థితి యందు పొందిన ఆనందం అనేది ఆ భగవంతుని యొక్క అనంతమైన ఆనందం. దాని కంటే ఇంకా ఏదీ ఉన్నతమైనది లేదు కాబట్టి, ఆ అనంతమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు, ఆత్మ సహజంగానే తన లక్ష్యాన్ని చేరుకున్నట్టు గ్రహిస్తుంది.
భగవంతుని దివ్యానందము నిత్య శాశ్వతమైనది కూడా, దానిని ఒకసారి సాధించిన యోగి నుండి దాన్ని ఎప్పటికీ తీసివేయలేరు. ఇటువంటి భగవత్-ప్రాప్తి నొందిన జీవి, భౌతిక శరీరంలోనే వసించి ఉన్నా, భగవత్ భావనలోనే స్థితుడై ఉంటాడు. ఒక్కోసారి, బాహ్యంగా చూస్తే - అనారోగ్యం, వ్యతిరేకతతో ఉండే జనం, అణచివేసే వాతావరణం వంటి వాటితో ఆ మహాత్ముడు కష్టాల్లో ఉన్నట్టు అగుపించవచ్చు, కానీ, అంతర్లీనంగా ఆ మహాత్ముడు భగవత్ సాన్నిధ్యం లోనే ఉండి, దివ్యానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి, ఎంత తీవ్రమైన విపత్తు అయినా అటువంటి మహాత్ముడిని చలింపచేయలేదు. భగవంతుని తోనే ఏకమైన స్థితిలో ఉండి, ఆ మహాత్ముడు శారీరిక దృక్పథం నుండి అతీతంగా ఎదుగుతాడు, మరియు భౌతిక హానిచే ప్రభావితం కాడు. ఈ ప్రకారంగా, మన పురాణాలలో, ప్రహ్లాదుడి అంతర్గత స్థితి ఎలాగుందంటే - పాముల గుంటలో వేయబడినా, ఆయుధాలతో హింసించబడినా, అగ్నిలో ఉంచబడినా, మరియు కొండపై నుండి విసిరివేయబడినా - ఇవేవీ కూడా ప్రహ్లాదునికి భగవంతునితో ఉన్న భక్తియుక్త ఏకత్వాన్ని భంగం చేయలేకపోయాయి.