జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః ।। 8 ।।
జ్ఞాన — జ్ఞానము; విజ్ఞాన — అనుభవైక విజ్ఞానము, అంతర్గతమైన జ్ఞానము; తృప్త-ఆత్మా — సంపూర్ణ తృప్తితో ఉన్నవాడు; కూట-స్థః — చలించకుండా; విజిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవాడు; యుక్త — ఎల్లపుడూ ఆ పరమాత్మతో ఏకమై ఉండేవాడు; ఇతి — ఈ విధంగా; ఉచ్యతే — అందురు; యోగీ — ఓ యోగి; సమ — సమత్వ దృష్టితో; లోష్టా — గులక రాళ్ళు; అశ్మ— రాయి; కాంచనః — బంగారము.
Translation
BG 6.8: జ్ఞానవిజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు – మట్టి, రాళ్ళు, మరియు బంగారము – వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు.
Commentary
జ్ఞానము అంటే, గురువు గారి దగ్గర వినుత, శాస్త్ర గ్రంధముల పఠన ద్వారా, సిద్ధాంతపరంగా తెలుసుకున్న విషయం. విజ్ఞానము అంటే అంతర్గతంగా అనుభవవేద్యమైన జ్ఞానము, ఇది అంతర్గంతంగా విచ్చుకున్నది మరియు ఆంతర వివేకము. ఉన్నత స్థాయి యోగి యొక్క బుద్ధి ఈ జ్ఞానము, విజ్ఞానముల రెంటిచే ప్రకాశితమవుతుంది. ఈ వివేకము కలిగిఉన్న యోగి, అన్ని భౌతిక వస్తువులు కూడా భౌతిక శక్తి యొక్క రూపాంతరములే అని చూస్తాడు. తనకు ఆకర్షణీయంగా ఉన్నవా లేవా అన్న దాన్ని బట్టి ఇటువంటి యోగి వస్తువుల మధ్య తేడాను చూడడు. జ్ఞానోదయమైన యోగి అన్ని వస్తువులను భగవత్ సంబంధంగా చూస్తాడు. భౌతిక శక్తి భగవంతునిదే కాబట్టి, అన్ని వస్తువులు అతని సేవ కొరకే ఉన్నాయి.
కూటస్థ అంటే, భౌతిక శక్తితో సంపర్కం వలన వచ్చే చంచలమైన ఇంద్రియ అనుభూతుల నుండి మనస్సుని దూరంగా ఉంచి, సుఖమైన/అనుకూల పరిస్థితుల కోసం చూసుకోకుండా, లేదా, అప్రియమైన/ప్రతికూల పరిస్థితులను తప్పించుకోకుండా ఉండే వాడు అని అర్థం. విజితేంద్రియ అంటే ఇంద్రియములను నిగ్రహించిన వాడు అని అర్థం. యుక్త అంటే పరమాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండేవాడు అని అర్థం. ఇటువంటి వ్యక్తి భగవంతుని దివ్య ఆనందాన్ని రుచి చూడటం మొదలిడుతాడు, కాబట్టి తృప్తాత్మా అవుతాడు, అంటే, అంతర్గతంగా అనుభవంలోనికి వచ్చిన విజ్ఞానంచే సంపూర్ణ తృప్తి పొందినవాడు అని అర్థం.