సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ ।
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ।। 21 ।।
సుఖం — ఆనందము; ఆత్యంతికం — అంతములేని; యత్ — ఏదైతే; తత్ — అది; బుద్ధి — బుద్ధి; గ్రాహ్యం — గ్రహింపబడును; అతీంద్రియం — ఇంద్రియములకు అతీతమైనది; వేత్తి — తెలుసుకొని; యత్ర — ఈ స్థితిలో; న — కాదు; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; అయం — అతను; స్థితః — స్థితుడై ఉండును; చలతి — చలించుట; తత్త్వతః — పరమ సత్యము నుండి.
Translation
BG 6.21: సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి, నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు.
Commentary
ఆనందము కోసం అన్వేషణ అనేది ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనము ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు-అంశలము అన్న వాస్తవం నుండి ఇది జనించింది. ఈ విషయం ధ్రువీకరించటానికి , 5.21వ శ్లోకంలో ఎన్నో వేద శాస్త్రాలనుండి వాక్యాలను పేర్కొనటం జరిగింది. భగవంతుడిని అనంతమైన ఆనంద స్వరూపంగా పేర్కొంటూ ఇంకా కొన్నివాక్యాలను ఇక్కడ చూడండి:
రసో వై సః రసం హ్యేవాయం లబ్ధ్వానందీ భవతి
(తైత్తిరీయ ఉపనిషత్తు 2.7)
‘భగవంతుడు స్వయంగా ఆనందమే; జీవాత్మ ఆయనను పొందగానే ఆనందమయం అయిపోతుంది.’
ఆనందమయో ఽభ్యాసాత్ (బ్రహ్మ సూత్రములు 1.1.12)
‘యదార్థమైన ఆనంద స్వరూపమే భగవంతుడు’
సత్య జ్ఞానానంతానంద మాత్రైక రస మూర్తయః
(భాగవతం 10.13.54)
‘నిత్యత్వము, జ్ఞానము, మరియు ఆనందముల సమ్మేళనముతో భగవంతుని దివ్య మంగళ స్వరూపము తయారు చేయబడినది.’
ఆనంద సింధు మధ్య తవ వాసా, బిను జానే కట మరసి పియాసా
(రామచరితమానస్)
‘ఆనంద సింధువు అయిన భగవంతుడు మీ యందే స్థితుడై ఉన్నాడు. ఆయనను తెలుసుకోకుండా మీ యొక్క ఆనందం కోసం ఉన్న తృష్ణ ఎలా తీరుతుంది?’
మనము పరిపూర్ణ ఆనందం కోసం ఎన్నో యుగాల నుండి అన్వేశిస్తున్నాము మరియు మనం చేసే ప్రతి పని ఆ ఆనందం కోసమే. కానీ, భౌతిక సుఖాలనిచ్చే వస్తు-విషయముల నుండి మనస్సు, మరియు ఇంద్రియములు, కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే అనుభవిస్తాయి. ఇంద్రియ తృప్తి అనేది, భగవంతుని పరమానందం కోసం పరితపించే లోనున్న ఆత్మ యొక్క వాంఛను, తీర్చడంలో విఫలమౌతుంది.
మనస్సు భగవంతుని యందే ఏకమై ఉన్నప్పుడు, ఆత్మ, వర్ణింపశక్యముకాని, ఉత్కృష్టమైన, ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాఙ్మయంలో ఈ స్థితినే 'సమాధి' అంటారు. పతంజలి మహర్షి ఇలా పేర్కొన్నాడు:
సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్
(పతంజలి యోగ దర్శనం 2.45)
‘సమాధిలో సాఫల్యం కోసం, పరమేశ్వరునికి శరణాగతి చేయుము.’
సమాధి స్థితిలో, సంపూర్ణ సంతృప్తిని మరియు సంతుష్టి అనుభవిస్తూ, ఆత్మకు కోరుకోవడానికి ఇంకా ఏమీ మిగిలి ఉండవు; తద్వారా, ఒక్క క్షణం కూడా వైదొలగకుండా, ఆత్మ పరమ సత్యము నందే ధృడముగా స్థితమై ఉండును.