Bhagavad Gita: Chapter 6, Verse 47

యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ।। 47 ।।

యోగినాం — అందరి యోగుల కెల్లా; అపి — కూడా; సర్వేషాం — అన్ని రకాల; మత్-గతేన — నాయందే నిమగ్నమై ఉండి (భగవంతుని యందు); అంతః — లోనున్న; ఆత్మనా — మనస్సుతో; శ్రద్ధా-వాన్ — గాఢ విశ్వాసం తో; భజతే — భక్తిలో నిమగ్నమై; యః — ఎవరైతే; మాం — నా పట్ల; సః — అతడు; మే — నా చేత; యుక్త-తమః — అత్యున్నత యోగి; మతః — పరిగణించబడును.

Translation

BG 6.47: అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.

Commentary

యోగులలో కూడా, కర్మ యోగులు, భక్తి యోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్ఠమైనవారో అన్న వివాదానికి ఈశ్లోకం ముగింపు ఇస్తున్నది. 'భక్తి యోగి' యే పరమ శ్రేష్ఠుడు, మరియు, సర్వోత్తమమైన అష్టాంగ యోగి మరియు హఠ యోగుల కన్నా ఉన్నతమైన వాడు, అని శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఇది ఎందుకంటే, భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే, అది భగవంతుణ్ణి కట్టి పడేసి, ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది. అందుకే, భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు:

అహం భక్త-పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ
సాధుబిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః

(9.4.63)

‘నేను సర్వ-స్వతంత్రుడనైనా, నా భక్తులకు బానిసై పోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైనవారు.’ భక్తి యోగి దివ్య ప్రేమ శక్తి కలిగి ఉంటాడు, అందుకే భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు మరియు ఆయనచే అందరి కంటే అత్యున్నతంగా పరిగణించబడుతాడు.

ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు 'భజతే' అన్న పదం వాడాడు. అది 'భజ్' అనే మూల పదం నుండి వచ్చింది, అంటే 'సేవ చేయటం' అని అర్థం. ఇది భక్తిని సూచించే చాలా ప్రభావవంతమైన పదం, 'ఆరాధన' అని అనటం కన్నా ప్రభావితమైనది. ఇక్కడ శ్రీ కృష్ణుడు కేవలం ఆరాధించే/పూజించే వారి గురించి కాకుండా, భక్తి యుక్త ప్రేమతో సేవ చేసే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధంగా వారు తమ ఆత్మ సహజ స్థితియైన భగవంతుని సేవకులుగా ఉంటారు; అదే సమయంలో ఇతర రకాల యోగులు తమ విజ్ఞానంలో అసంపూర్ణంగా ఉంటారు. వారు తమని తాము భగవంతునితో అనుసంధానం చేసుకున్నారు కానీ, వారు భగవంతుని నిత్య సేవకులమని ఇంకా అర్థం చేసుకోలేదు.

ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ-పరాయణః
సు-దుర్లభః ప్రశాంతాత్మా కోటిష్వపి మహా-మునే

(భాగవతం 6.14.5)

"కోట్ల మంది పరిపూర్ణ సిద్ది సాధించి ముక్తి పొందిన మహాత్ములలో కూడా, సర్వోన్నత భగవానుడు అయిన శ్రీమన్నారాయణుడి పట్ల భక్తికల, ప్రశాంత చిత్తులు, చాలా అరుదు.’

ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ఇంకొక విధానం ఏమిటంటే - భక్తి యోగము, అతి సమీపమైన మరియు పరిపూర్ణ భగవత్ అనుభూతిని, విజ్ఞానాన్ని అందిస్తుంది - అని. 18.55వ శ్లోకంలో ఇది వివరించబడింది, ఇక్కడ శ్రీ కృష్ణుడు కేవలం భక్తి యోగి మాత్రమే యదార్థమైన భగవత్ తత్త్వాన్ని అర్థం చేసుకుంటాడు, అని వివరించాడు.