Bhagavad Gita: Chapter 6, Verse 35

శ్రీ భగవానువాచ ।
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।

శ్రీ భగవాన్ ఉవాచ — శ్రీ కృష్ణ పరమాత్మ పలికెను; అసంశయం — నిస్సందేహముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; మనః — మనస్సు; దుర్నిగ్రహం — నిగ్రహించుటకు కష్టమైనది; చలం — చంచలమైనది; అభ్యాసేన — అభ్యాసం చేత; తు — కానీ; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; వైరాగ్యేణ — వైరాగ్యముచే; చ — మరియు; గృహ్యతే — నియంత్రించవచ్చు.

Translation

BG 6.35: శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.

Commentary

శ్రీ కృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెప్తూ, అతన్ని 'మహాబాహో' అంటే ‘గొప్ప బాహువులు కలవాడా.’ అని అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ‘ఓ అర్జునా, నీవు యుద్ధములో అత్యంత సాహాసోపేత వీరులను ఓడగోట్టావు, ఈ మనస్సుని ఓడించలేవా?’ అని.

శ్రీ కృష్ణుడు, ఇలా, ‘అర్జునా, ఏంటి అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మనస్సుని సునాయాసముగా నియంత్రించవచ్చు.’ అని చెప్పి ఈ సమస్యను ఖండించలేదు. పైగా, నియంత్రించటానికి మనస్సు నిజంగా క్లిష్టతరమైనది అన్న అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. కానీ, ప్రపంచంలో కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి, అయినా మనం అధైర్య పడకుండా ముందుకు సాగుతాము. ఉదాహరణకి, సముద్రం ప్రమాదకరమైనది మరియు భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుంది అని నావికులకు తెలుసు. అయినా, ఒడ్డునే ఉండిపోయేలా చేయటానికి ఈ కారణాలు వారికి తగినట్టు ఎప్పుడూ అనిపించలేదు. కాబట్టి, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, వైరాగ్యము మరియు అభ్యాసము ద్వారా మనస్సుని నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నాడు.

వైరాగ్యము అంటే ఆంగ్లములో డిటాచ్మెంట్ (detachment). అనంతమైన పూర్వ జన్మల నుండీ ఉన్న మమకారాసక్తుల చేత, మనస్సుకు, తనకు అనురక్తి ఉన్న వస్తువిషయముల దిశలో పరుగులు పెట్టడం అలవాటైపోయింది. ఈ మమకార-ఆసక్తిని తీసివేయటం అనేది మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది.

అభ్యాసము అంటే ఆంగ్లములో ప్రాక్టీసు (practice). అంటే, పాత అలవాట్లను మార్చి, కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ. అభ్యాసము అనేది సాధకులకు ఒక ముఖ్యమైన పదం. సమస్త మానవ పరిశ్రమలలో, నైపుణ్యానికి, ప్రావీణ్యతకి, శ్రేష్ఠతకి దారితీసే ప్రముఖ విషయం ఈ అభ్యాసమే. ఉదాహరణకి ఒక అతి సామాన్య విషయమైన టైపింగ్ తీసుకోండి. మొదటి సారి టైపింగ్ ప్రారంభిస్తున్నప్పుడు, ఒక నిమిషానికి ఒక పదమే టైపు చేయగలుగుతారు. కానీ, ఒక సంవత్సరం టైపు చేసిన తరువాత, వారి చేతివేళ్లు సునాయాసంగా తిప్పుతూ నిమిషానికి ఎనభై పదాలు టైపు చేయగలుగుతారు. ఈ నైపుణ్యం కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యము. ఇదే విధంగా, మూర్ఖమైన మరియు అల్లకల్లోలమైన మనస్సుని అభ్యాసము ద్వారా ఆ భగవంతుని చరణారవిందముల పైనే నిలుపాలి. మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీయాలి - ఇదే వైరాగ్యము - మరియు - మనస్సుని భగవంతుని మీదే నిలుపాలి - ఇది అభ్యాసము. పతంజలి మహర్షి ఇదే ఉపదేశం చెప్పాడు:

అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః (యోగ దర్శనం 1.12)

‘నిరంతర అభ్యాసము, వైరాగ్యముల ద్వారా మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చు.’