Bhagavad Gita: Chapter 6, Verse 30

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ।। 30 ।।

యః — ఎవరైతే; మాం — నన్ను; పశ్యతి — చూచేదరో; సర్వత్ర — అంతటా; సర్వం — సర్వమూ; చ — మరియు; మయి — నా యందు; పశ్యతి — చూచేదరో; తస్య — అతనికి; అహం — నేను; న ప్రణశ్యామి — దూరమవను; సః — ఆ వ్యక్తి; చ — మరియు; మే — నాకు; న ప్రణశ్యతి — దూరమవడు.

Translation

BG 6.30: ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు.

Commentary

భగవంతుడిని వీడటం అంటే మనస్సుని అయన నుండి దూరంగా తిరగనీయటం, మరియు ఆయనతో ఉండటం అంటే మనస్సుని ఆయనతో ఏకం చేయటం. మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయన సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనల్ని ఎవరైనా బాధపెట్టారు అనుకుందాం. మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే, మనకు హాని చేసిన వారి పట్ల, అది, ద్వేషము, కోపము వంటి వాటిని పెంచుకుంటుంది. కానీ, అలా కానిస్తే, మన మనస్సు భగవత్ స్పృహ నుండి బయటకు రావటంతో, భగవంతునితో మన మనస్సు యొక్క భక్తి యుక్త సంయోగం ఆగిపోతుంది. దానికి బదులుగా, ఆ వ్యక్తిలోనే కూర్చొని ఉన్న పరమాత్మను దర్శిస్తే, మనం ఇలా అనుకుంటాము, ‘భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహన శీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. కానీ, నేను ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను.’ ఈ విధంగా ఆలోచిస్తే, మన మనస్సుని ప్రతికూల/నకారాత్మక ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు.

అదే విధంగా, మిత్రునితో కానీ లేదా బంధువుతో కానీ అనుబంధం ఏర్పడినప్పుడు, మనస్సు భగవంతుని నుండి దూరమైపోతుంది. ఇప్పుడు, మనం మనస్సుకు ఆ మనిషిలో భగవంతుడిని దర్శించే శిక్షణ ఇస్తే, ప్రతిసారీ మనస్సు వారి మీదకు పోయినప్పుడు, మనం ఇలా అనుకుంటాము, ‘శ్రీ కృష్ణుడు ఈ వ్యక్తిలో ఉన్నాడు, అందుకే నేను వారి పట్ల ఆకర్షితుడను అవుతున్నాను’ అని. ఈ ప్రకారంగా, మనస్సు పరమాత్మ పట్ల భక్తిభావనలు నిలుపుకోవటం కొనసాగిస్తూనే ఉంటుంది.

కొన్నిసార్లు, మనస్సు పాత విషయాలపై చింతిస్తూ (శోకిస్తూ) ఉంటుంది. ఇది కూడా మనస్సుని భగవత్ సన్నిధి నుండి వేరు చేస్తుంది, ఎందుకంటే ఈ శోకము మనస్సుని భూతకాలము లోనికి తీస్కువెళ్ళటం వలన వర్తమాన కాలంలో చేయవలసిన హరి, గురు చింతన ఆగిపోతుంది. ఇప్పుడు, ఆయా సంఘటనని భగవత్ సంబంధముగా చూసినప్పుడు, మనము ఇలా అనుకుంటాము, ‘భగవంతుడు, కావాలనే, నా కోసం, నేను వైరాగ్యం పెంపొందిచుకోవాలని, కష్టాన్ని లోకంలో ఏర్పాటు చేసాడు, ఆయనకు నా సంక్షేమం మీద ఎంత ఆసక్తి అంటే, తన కృపచేత నా ఆధ్యాత్మిక పురోగతి కోసం సరైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు.’ ఈ విధంగా ఆలోచించటం వల్ల మనం భక్తి యుక్త ధ్యాసను కాపాడుకోవచ్చును. నారద మహర్షి ఇలా అంటున్నాడు:

లోక హానౌ చింతా న కార్యా నివేదితాత్మ లోక వేదత్వాత్

(నారద భక్తి దర్శన్, 61వ సూత్రం)

‘లోకంలో ప్రతికూలత/వ్యతిరేక పరిస్థితి ఎదురైనప్పుడు, దాని గూర్చి శోకించకు, చింతించకు. దానిలో భగవత్ అనుగ్రహాన్ని గుర్తించుము.’ మన స్వార్థ ప్రయోజనం ఎందులో ఉందంటే, ఎదో రకంగా మనస్సుని భగవంతుని యందే నిలపటం లోనే, మరియు దీనికి ఒక సులువైన ఉపాయం ఏమిటంటే ప్రతిదానిలో, ప్రతివ్యక్తిలో భగవంతున్ని చూడటమే. ఇది అభ్యాస స్థాయి, ఇది, ఈ శ్లోకంలో చెప్పబడిన పరిపూర్ణ స్థాయి దిశగా నెమ్మదిగా తీసుకువెళుతుంది, ఇక అప్పుడు మనం భగవంతుడికి దూరంకాము, మరియు భగవంతుడు మనకు దూరం కాడు.