Bhagavad Gita: Chapter 15, Verse 3-4

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ ధృడేన ఛిత్త్వా ।। 3 ।। తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః ।
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ।। 4 ।।

న రూపమ్ — రూపము లేకుండా; అస్య — దీని యొక్క; ఇహ — ఈ లోకములో; తథా — ఆ విధముగా; ఉపలభ్యతే — కనిపించును; న అంతః — అంతము లేని; న చ ఆదిః — మొదలు లేకుండా; న చ సంప్రతిష్ఠా — మూలం లేకుండా; అశ్వత్థమ్ — రావి చెట్టు; ఏనం — ఇది; సు-విరూఢ-మూలం — లోతైన మూలములు గల; అసంగ-శస్త్రేణ — అనాసక్తి/వైరాగ్యము అనే గొడ్డలి చే; ధృడేన — బలమైన; ఛిత్త్వా— ఛిద్రం చేసి; తతః — ఆ తరువాత; పదం — ప్రదేశము; తత్ — అది; పరిమార్గితవ్యం — వెతకాలి; యస్మిన్ — ఎక్కడికైతే; గతాః — వెళ్లిన పిదప; న నివర్తంతి — తిరిగిరారు; భూయః — మరల; తమ్ — ఆయనకి; ఏవ — ఖఛ్చితముగా; చ — మరియు; ఆద్యం — మూలమైన; పురుషం — పరమేశ్వరుడు; ప్రపద్యే — ఆశ్రయించుము; యతః — ఎక్కడి నుండి అయితే; ప్రవృత్తిః — ఈ వ్యవహారము; ప్రసృతా — ఉద్భవించినదో; పురాణీ — అతి ప్రాచీనమైన.

Translation

BG 15.3-4: ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు, దాని యొక్క మొదలు, చివర, లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి/వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి, అదియే ఆ భగవంతుడు, ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.

Commentary

సంసారములో, అంటే ఎడతెగని జనన-మరణ చక్రములో మునిగి ఉన్న బద్దులైన జీవాత్మలు, ఈ యొక్క అశ్వత్థ వృక్షము యొక్క స్వభావమును తెలుసుకోలేకున్నారు. వారికి ఈ చెట్టు యొక్క చిగుళ్ళు చాల ఆకర్షణీయముగా అనిపిస్తాయి, అంటే, వారు ఇంద్రియ వస్తు విషయముల పట్ల ఆకర్షితమవుతారు మరియు వాటి పట్ల కోరికలను పెంచుకుంటారు. ఈ కోరికలను తీర్చుకోవటానికి, వారు ఎంతో శ్రమిస్తుంటారు. కానీ, వీరి శ్రమ అంతా ఇంకా ఆ వృక్షము మరింత పెరగటానికి దోహద పడుతుంది అని తెలుసుకోరు. ఎప్పుడైతే కోరికలు తీరుతాయో, అవి మరింత ఉధృతంగా అత్యాశ రూపంలో తిరిగి వస్తాయి. కోరికలను అడ్డుకున్నప్పుడు, అవి క్రోధమునకు దారితీస్తాయి, అది బుద్ధిని మరింత భ్రమకు గురి చేసి మరింత అజ్ఞానము లోకి నెట్టి వేస్తుంది.

ఈ అశ్వత్థ వృక్షము యొక్క నిగూఢ మర్మమును కొద్ది మందే అర్థం చేసుకుంటారు అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆత్మ కేవలం ‘నేను రాంప్రసాద్ ని, హరిప్రసాద్ కొడుకుని; నేను ఈ ఫలానా దేశంలో ఫలానా పట్టణంలో నివసిస్తున్నాను. నా సుఖాన్ని ఇంకాఇంకా పెంచుకోవాలి. కాబట్టి నేను ఈ శారీరక దృక్పథంతోనే పనులు చేస్తుంటాను, కానీ, ఆనందము అనేది నాకు చిక్కటం లేదు దానితో నాకు అంతా అయోమయంగా ఉన్నది.’ అని అనుకుంటుంది. ఈ వృక్షము యొక్క మొదలు లేదా దాని అసలు స్వభావము తెలుసుకోకుండా, జీవుడు వ్యర్థమైన పనులు చేయటం లేదా ప్రయాసలు పడటం చేస్తుంటాడు. తన యొక్క భౌతిక కోరికలను తీర్చుకోవటం కోసం, మానవుడు ఒక్కోసారి పాపపు పనులు చేస్తూ, నిమ్నస్థాయి జీవులలోకి, అధోలోకాలలోనికి ప్రవేశిస్తాడు. ఒక్కోసారి, భౌతిక భోగములు అనుభవించాలనే కోరిక వ్యక్తిని ఆ చెట్టు యొక్క ఆకుల పట్ల ఆకర్షితం చేస్తుంది, అవే వేదములలో చెప్పబడిన కామ్య కర్మ కాండలు. ఈ కార్యములను చేయటం వలన, వ్యక్తి స్వర్గాది పై లోకములకు వెళతాడు, కానీ పుణ్య క్షయము అయిపోయిన తరువాత తిరిగి భూలోకానికి చేరుతాడు. అందుకే చైతన్య మహాప్రభు ఇలా అన్నాడు:

కృష్ణ భులి ఽసేఇ జీవ అనాది-బహిర్ముఖ
అథైవ మాయా తారే దేయ సంసార-దుఃఖ
కబు స్వర్గే ఉఠాయ, కభు నరకే డుబాయ
దండ్య-జనె రాజా యేన నదీతే చుబాయ
(చైతన్య చరితామృతము, మధ్య లీల 20.117-118)

‘ఆత్మ సనాతనముగా భగవంతునికి విముఖమై ఉన్నందున, భౌతిక శక్తి దానిని ప్రాపంచిక క్లేశములకు గురి చేస్తున్నది. కొన్ని సార్లు, అది ఆత్మను స్వర్గాది లోకములకు పైకి తీస్కువెళుతుంది, మరియు మరి కొద్ది సార్లు, దానిని నరక లోకాలకు పడవేస్తుంది. ఇది పూర్వ కాలంలో రాజులు పెట్టే హింస వంటిది.’ ఒకలాంటి హింసా విధానంలో, ప్రాచీన రాజులు, వ్యక్తి తలను నీళ్ళలో ఊపిరి ఆడనంత వరకు ముంచేవారు, మరల కొద్దిగా శ్వాస తీసికోవటానికి బయటకు తీసేవారు, కానీ, మరల నీళ్ళలో తల ముంచేసేవారు. ఆత్మ యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. అది స్వర్గాది లోకాలలో తాత్కాలికమైన ఉపశమనం పొందుతుంది, కానీ భూలోకంపై మరల త్రోసివేయబడుతుంది.

ఈ ప్రకారంగా అనంతమైన జన్మలు గడిచిపొయినాయి. భౌతిక భోగముల కోసం ఆత్మ చేసే ప్రయాసలన్నీ కేవలం ఆ వృక్షమును మరింత పెంచుతూ మరిన్ని వేర్లను (ఊడలను) నేల మీదికి పంపించటానికే పనికొస్తున్నాయి. కానీ, శ్రీ కృష్ణుడి ప్రకారం, వైరాగ్యమే, ఈ చెట్టుని కొట్టివేయటానికి ఉన్న గొడ్డలి. 'అసంగము' అంటే అనాసక్తి/వైరాగ్యము, అని అర్థం. ఈ గొడ్డలి ఆత్మ జ్ఞానముచే తయారుచేయబడాలి, ‘నేను నిత్య శాశ్వత సనాతనమైన ఆధ్యాత్మిక జీవుడను, ఈ శరీరమును కాదు. నేను వెతికే శాశ్వతమైన దివ్య ఆనందము, ఎన్నటికీ ఈ భౌతిక వస్తువుల నుండి లభించదు. నేను ఈ శరీరమే అని అనుకుని కోరుకునే ఈ భౌతిక ప్రాపంచిక కోరికలు, ఈ జనన-మరణ చక్ర సంసారములో (జగత్తులో) నా అస్తిత్వమును మరింత పొడిగిస్తాయి. ఈ దిశలో ఎటువంటి ఉపశమనం లేదు.’ అని తెలుసుకోవాలి. వ్యక్తి వైరాగ్యం పెంచుకున్నప్పుడు, ఈ వృక్షము యొక్క మరింత పెరుగుదల ఆగిపోతుంది మరియు ఆ చెట్టు కృశించి పోవటం మొదలవుతుంది.

ఆ తరువాత మనము ఆ వృక్షము యొక్క మొదలు కోసం వెతకాలి, అది దాని యొక్క వేర్ల కన్నా పై భాగములో మిగతా అన్నింటి కన్నా ఉన్నత స్థానంలో ఉంటుంది. ఆ మూలమే భగవంతుడు, శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వం ఇలా చెప్పినట్టు: ‘నేనే భౌతిక మరియు ఆధ్యాత్మిక సృష్టికి మూలమును. సర్వమూ నా నుండే జనిస్తాయి. ఇది సంపూర్ణముగా తెలిసినవారు నన్ను గొప్ప విశ్వాసముతో మరియు భక్తితో ఆరాధిస్తారు.’ (శ్లోకం 10.8) ఈ విధంగా, వృక్షము యొక్క అసలు మూలము తెలుసుకున్నాక, దానికి ఈ శ్లోకంలో చెప్పబడినట్టు శరణాగతి చేయాలి: ‘ఎవరి నుండి సనాతన కాలం క్రితమే ఈ జగత్తు ఆవిర్భవించినదో, అతనికి నేను శరణాగతి చేస్తున్నాను.’ అని.

ఈ ప్రకారంగా, ఇంతకూ పూర్వము అర్థంకానిది, అంతులేనిదిగా ఉన్న వృక్షమును మనము అధిగమించవచ్చు. శ్రీ కృష్ణుడు ఇంతకు పూర్వమే, ‘ప్రకృతి త్రిగుణములను కలిగి ఉన్న నా దైవీ శక్తి, మాయ, అధిగమించటానికి చాలా కష్టతరమైనది. కానీ, ఎవరైతే నాకు శరణాగతి చేస్తారో వారు దానిని సునాయాసముగా దాటి పోతారు. (శ్లోకం 7.14) అని చెప్పాడు. కాబట్టి, ఆ భగవంతుడిని ఆశ్రయించిన పిదప, ఈ అశ్వత్థ వృక్షము కొట్టివేయబడుతుంది. మనము మళ్లీ ఈ భూలోకమునకు రావలసిన అవసరం లేదు, మరియు మనం మరణించిన పిదప ఆయన యొక్క దివ్య ధామమునకు చేరుకుంటాము. శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో ఈ శరణాగతి ప్రక్రియ అంటే ఏమిటో చెప్తున్నాడు.