Bhagavad Gita: Chapter 6, Verse 12-13

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ।
ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ।। 12 ।।
సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ।। 13 ।।

తత్ర — అక్కడ; ఏక-అగ్రం — ఏకాగ్రతతో; మనః — మనస్సు; కృత్వా — చేసి; యత-చిత్త — మనస్సుని నియంత్రణలో ఉంచుకొని; ఇంద్రియ — ఇంద్రియములు; క్రియః — పనులు; ఉపవిశ్య — కూర్చొని; ఆసనే — ఆసనము పై; యుంజ్యాత్ యోగం — యోగ అభ్యాసము కొరకు పరిశ్రమించవలెను; ఆత్మ విశుద్ధయే — మనస్సు యొక్క పరిశుద్ధి కొరకు; సమం — సమముగా; కాయ — శరీరము; శిరః — శిరస్సు (తల); గ్రీవం — మెడ; ధారయన్ — నిలిపివుంచి; అచలం — నిశ్చలముగా; స్థిరః — స్థిరముగా; సంప్రేక్ష్య — దృష్టి పెడుతూ; నాసిక-అగ్రం — ముక్కు చివరి యందు; స్వం — తనయొక్క ; దిశః — దిక్కుల వైపు; చ — మరియు; అనవలోకయన్ — చూడకుండా.

Translation

BG 6.12-13: దానిపై స్థిరముగా కూర్చొని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి - యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి.

Commentary

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీకృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సుకి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానంలో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూచేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు. ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:

ఆసీనః సంభవాత్ (4.1.7)

‘సాధన చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి.’

అచలత్వం చాపేక్ష్య (4.1.9)

‘నిశ్చలంగా మరియు నిటారుగా కూర్చోండి’

ధ్యానాచ్చ (4.1.8)

‘ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి.’

హఠ యోగ ప్రదీపికలో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం, మరియు సుఖాసనం వంటివి. ధ్యానంలో అటూయిటూ కదలకుండా, మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:

‘స్థిర సుఖమాసనం’ (పతంజలి యోగ సూత్రములు 2.46)’

‘ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఏదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.’ కొందరు మోకాలు నొప్పుల వలన, లేదా వేరేఇతర ఆరోగ్య కారణాల వలన, నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.

దృష్టిని నాసికాగ్రము మీద కేంద్రీకరించాలి మరియు అది అటూఇటూ పోకుండా చూసుకోవాలి అని ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు పేర్కొన్నాడు. దీనికి రూపాంతరంగా, కనులను మూసి ఉంచవచ్చు. ఈ రెండు పద్దతులు కూడా ప్రాపంచిక వ్యగ్రతని నిరోధించటంలో సహకరిస్తాయి.

బాహ్యమైన ఆసనం మరియు శరీరాన్ని ఉంచిన తీరు, ధ్యానమునకు తగినట్టుగా ఉండాలి, కానీ ధ్యానం అనేది యదార్థంగా ఒక అంతర్గత ప్రయాణం. ధ్యానం ద్వారా, మనల్ని మనమే లోతుగా పరిశీలించుకోవచ్చు మరియు మనస్సుని అనంత జన్మల మలినముల నుండి పరిశుద్ధి చేసుకోవచ్చు. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం వలన, దాని యొక్క గుప్తమైన శక్తిని వెలికితీయవచ్చు. ధ్యానం యొక్క అభ్యాసం మన వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకరించుకోవటానికి, అంతర్గత చైతన్యాన్ని మేలుకోలుపటానికి, స్వీయ అవగాహన పెంపొందించు కోవటానికి, చాలా దోహద పడుతుంది. ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు 6.15వ శ్లోకంలో తదుపరి వివరించబడుతాయి. కొన్ని ఆనుషంగిక ప్రయోజనాలు ఏమిటంటే, ధ్యానం అనేది :

– చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.

– ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.

– జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.

– చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది

మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించటమే అత్యుత్తమమైన ధ్యాన పద్దతి. ఈ విషయం తదుపరి రెండు శ్లోకాలలో వివరించబడింది.